విశాఖపట్నం, నవంబర్ 3: యూనికోడ్‌లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ శాశ్వత సభ్వత్యం తీసుకోవడం ద్వారా అంతర్జాలంలో తెలుగుభాషను ప్రపంచ వ్యాప్తం చేయడానికి మార్గం సుగమమయిందని రాష్ట్ర అధికార భాషాసంఘం అధ్యక్షుడు మండలి బుద్ధప్రసాద్ అన్నారు. అంతర్జాలంలో తెలుగు వినియోగంపై రాష్ట్ర సమాచార, సాంకేతికశాఖ, సిలికానాంధ్ర, విశ్వ తెలుగు అంతర్జాల వేదిక సంయుక్తంగా విశాఖలోని గీతం విశ్వవిద్యాలయంలో నిర్వహిస్తున్న అంతర్జాతీయ సదస్సు రెండోరోజు శనివారం ఆయన మాట్లాడుతూ తెలుగు భాషాభివృద్ధికి 1966లో అధికార భాషా చట్టం సాధించినప్పటికి దానిని అమలు చేయడంలో ఎదురవుతున్న ఇబ్బందులను వివరించారు. తగినన్ని ఉపకరణాలు లేని కారణంగా తెలుగుభాషను అధికారికంగా వినియోగించటంలో జాప్యం జరుగుతోందన్నారు. ప్రస్తుత సదస్సులో 15 కొత్త ఫాంట్లను విడుదల చేయడం వల్ల ఆంధ్రప్రదేశ్‌లో అధికారికంగా తెలుగు భాషను వాడటానికి ప్రభుత్వ ఉద్యోగులు ఇకపై కుంటి సాకులు చెప్పడానికి వీలుండదన్నారు. రాష్ట్ర సమాచార సాంకేతిక శాఖ తెలుగు విజయం పేరిట ప్రత్యేక వెబ్‌సైట్‌ను రూపొందించడం అభినందనీయమన్నారు. తెలుగు పత్రాల్లో అచ్చు తప్పులను సరిదిద్దే ఉపకరణాలను రూపొందించడం, లక్షన్నర పదాలకు పైగా పర్యాయ పదాలతో కూడిన పద నిఘంటువు రూపొందించడం, తెలుగు నుండి ఇతర భాషలకు, ఇతర భాషల నుంచి తెలుగుకు సమానార్థక పదాల అనే్వషణ, సుమారు 60 వేల పదాల నిడివి కలిగిన ఇంగ్లీషు-తెలుగు నిఘంటువు రూపొందించడం గర్వకారణమన్నారు. హైదరాబాద్ విశ్వవిద్యాలయం అనువర్తిత భాషా శాస్త్ర అనువాద అధ్యయనాల కేంద్రం పరిశోధక బృందం జి ఉమామహేశ్వరరావు, కె పరమేశ్వరి, క్రిస్ట్ఫోర్, ఎన్‌వి శ్రీరాములు, అడ్డంగి శ్రీనివాస్, బిందుమాధవి సదస్సులో మాట్లాడుతూ కేంద్ర, ప్రభుత్వ సమాచార, సాంకేతికమంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున తలపెట్టిన భారతీయ భాషల నుంచి భారతీయ భాషలకు యంత్రానువాదంలో అనేక విశ్వవిద్యాలయాలు, ఐఐటిలు పాలు పంచుకుంటున్నాయని తెలిపారు. ముఖ్యంగా తెలుగు-హిందీ, హిందీ-తెలుగు, తెలుగు-తమిళం, అనువాదాల్లో పాలు పంచుకుంటున్నాయన్నారు. పదాలపరంగా తెలుగు సంపన్న భాష అని అయితే హిందీ ప్రధానంగా వాక్య నిర్మాణం మీద ఆధారపడే భాష కావడం వల్ల అనువాదంలో లోతుగా అధ్యయనాలు జరుగుతున్నాయన్నారు. ఓయు ప్రొఫెసర్ సనుమాసస్వామి మాట్లాడుతూ అంతర్జాలంలో ప్రాచీన పదాల ప్రయోగాలను వివరించారు. తెలుగుభాషా బోధనకి వెన్నుదన్నుగా నిలుస్తున్న ఆన్‌లైన్ తెలుగు లెర్నింగ్ సైట్‌లు, అంతర్జాల పిల్లల పత్రికలపై నాగార్జున విశ్వవిద్యాలయం పరిశోధకులు ఎమ్ సత్యనారాయణ, పివి లక్ష్మణరావు ఆసక్తికరమైన అంశాలను వెల్లడించారు.
అధికార భాషా సంఘం అధ్యక్షుడు
english title:
internet
Date:
Sunday, November 4, 2012