విశాఖపట్నం, నవంబర్ 3: విశాఖ జిల్లా బుచ్చయ్యపేట మండలం తాకేరులో 21 మంది గ్రామస్థులు చిక్కుకున్నారు. వడ్డాది కొత్తూరు గ్రామానికి చెందిన వారు తమ పశువులను తాకేరు ఏటికి అటువైపు కళ్ళాల్లో కట్టి ఉంచారు. తాకేరు ఏటికి వరద తీవ్రత పెరుగుతుండంతో గ్రామానికి చెందిన 21 మంది కళ్ళాల్లోకి వెళ్లారు. సుమారు 100 పశువులను తీసుకుని శనివారం సాయంత్రం 7 గంటల సమయంలో తిరిగి ఏరు దాటుతుండగా నీటి ప్రవాహం పెరిగింది. దీంతో వారు ఏటి మధ్యలో ఉన్న ఒక దిబ్బపైకి చేరుకున్నారు. సహాయం కోసం ఎదురు చూస్తున్నారు. విషయం తెలిసిన రెవెన్యూ, అగ్నిమాపక సిబ్బంది తాకేరు ఏటి ఒడ్డుకు చేరుకున్నారు. అయితే వరద ప్రవాహం తీవ్రంగా ఉండడం వలన, అలాగే భారీ వర్షం కురుస్తున్నందువలన సహాయక చర్యలు చేపట్టలేకపోతున్నారు. ఇదిలా ఉండగా కోనాం రిజర్వాయర్‌లో నీటి ప్రవాహం ప్రమాద స్థాయికి చేరుకోవడంతో గేట్లు ఎత్తివేయడానికి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. 23 గ్రామాల్లోని ప్రజలను అప్రమత్తంగా ఉండాలని గ్రామాల్లో దండోరా వేయించారు. బుచ్చెయపేట మండలంలో బొడ్డేరుపై నిర్మించిన డైవర్షన్ వే కొట్టుకుపోవటంతో విశాఖ నుంచి నర్సీపట్నం, పాడేరు ప్రాంతాలకు రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఇదిలా ఉండగా పెద్దేరు నీటి ప్రవాహం తీవ్రంగా ఉండటంతో నిర్మాణంలో ఉన్న చోడవరం-వడ్డాది వంతెన కూలిపోయింది. (చిత్రం) విశాఖ జిల్లా బుచ్చెయ్యపేట మండలంలో బొడ్డేరుపై నిర్మించిన డైవర్షన్ వే కొట్టుకుపోయిన దృశ్యం
రాష్ట్రంలో మరో 24 గంటలు వర్షాలు
విశాఖపట్నం, నవంబర్ 3: తెలంగాణ నుంచి కోస్తా ఆంధ్ర మీదుగా అల్పపీడనం ఏర్పడిందని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం తెలియచేసింది. ఆ అల్పపీడనానికి నాలుగు కిలో మీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం ఏర్పడి ఉందని తెలియచేసింది. దీని ప్రభావం వలన రాష్ట్రం అంతటా భారీ వర్షాలు కురుస్తాయి. కోస్తాలో అనేక ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉంది. మరో 24 గంటలకు పైగా ఈ వర్షాలు కురుస్తాయని తెలిపింది. అలాగే తీరం వెంబడి గంటకు 50 నుంచి 60 కిలో మీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తుపాను హెచ్చరికల కేంద్రం తెలియచేసింది. ఇదిలా ఉండగా తెలంగాణ, కోస్తా ఆంధ్ర జిల్లాలో శనివారం తెల్లవారుజాము నుంచి ఎడతెరిపిలేని వర్షాలు కురుస్తున్నాయి. తిరువూరులో 21 సెంటీ మీటర్లు, ఎస్‌కోటలో 18, మంగళగిరిలో 18, చింతలపూడిలో 17, చింతపల్లి, దమ్ముగూడెంలో 15, భీమవరం, బాపట్ల, అశ్వారావుపేటలో 14, తణుకు, ఉయ్యూరు, ఏలూరు, తాడేపల్లిగూడెం, ఏటూరునాగారంలో 13 సెంటీ మీటర్ల చొప్పున వర్షం కురిసింది. అలాగే రేపల్లెలో 12, తెనాలిలో 11, అవనిగెడ్డలో 11 సెంటీ మీటర్ల వర్షం కురిసింది.