ఏలూరు, నవంబర్ 3: తమ్మిలేరు నుండి వరద నీరు మహోగ్రంగా విరుచుకుపడుతుండటంతో పశ్చిమగోదావరి జిల్లా కేంద్రం ఏలూరు నగరం ప్రమాదపుటంచున నిలబడింది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీవర్షాల కారణంగా తమ్మిలేరు ఉగ్రరూపం దాల్చింది. శనివారం మధ్యాహ్నానికి తమ్మిలేరు నుంచి వరదనీరు ఏలూరు వైపు దూసుకువచ్చింది. రాత్రి సమయానికి ఇది మహోగ్రంగా మారింది. నాగిరెడ్డిగూడెం ప్రాజెక్టు సామర్ధ్యం 354 అడుగులు కాగా శనివారం ఉదయానికే 350 అడుగుల నీటి మట్టం దాటిపోయింది. దీంతో దిగువకు వరద నీరు వదలడం ప్రారంభించారు. రాత్రి సమయానికి 27వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా 17వేల క్యూసెక్కుల నీటిని కిందకు వదులుతున్నారు. నాగిరెడ్డిగూడెం నుంచి ఏలూరు వరకు ఉన్న 50 కిలోమీటర్ల పొడవున కురిసిన వర్షపునీరు కూడా దీనికి తోడై మొత్తం వరదనీరు ఏలూరు వైపు పరుగులు తీస్తోంది. రాత్రి సమయానికే ఏలూరులో పరిస్ధితి ఆందోళనకరంగా మారింది. లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లల్లోకి నీరు ప్రవేశించింది. జిల్లా యంత్రాంగం అప్రమత్తమై సహాయక చర్యలకు ఉదయం నుంచి శ్రీకారం చుట్టింది. తమ్మిలేరు కాల్వకు తూర్పు లాకుల వద్ద రెండు గండ్లు కొట్టడం ద్వారా వరదనీటిని పక్కకు మళ్లించేందుకు తద్వారా ఏలూరు నగరానికి కొంతమేరకు ముప్పును నివారించడానికి ప్రయత్నించింది. అయినప్పటికీ నగరంలోనికి సాయంత్రానికి భారీగా వరదనీరు చేరుతోంది. అయితే రాత్రి గడుస్తున్న కొద్ది నగరంలో వరదనీటి మట్టం క్రమంగా పెరుగుతూ రావటం నగర ప్రజలను తీవ్ర భయాందోళనలకు లోనుచేసింది. రెండు రెస్క్యూ టీంలను, స్పీడ్ బోట్‌లను నగరానికి రప్పించింది. ఏలూరుకు సమీపంలోని పోణంగిలోని వైఎస్సార్ కాలనీ జలదిగ్బంధంలో చిక్కుకుంది. ఇక్కడ విశాఖపట్నానికి చెందిన నావికాదళం సభ్యులు సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. ఏలూరులోని సర్ సిఆర్‌ఆర్ కళాశాల వద్ద ఉన్న వంతెన వద్ద కూడా పరిస్థితి ఆందోళనకరంగానే ఉంది. వంతెనను ఆనుకుని వరదనీరు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. మరోవైపు శనివారపుపేట కాజ్‌వే, శ్రీపర్రు కాజ్‌వే పైనుంచి తమ్మిలేరు ఉరకలు వేస్తోంది. పరిస్థితి ప్రమాదకర స్థాయికి చేరుకుంటుండటంతో నగరంలోనికి ప్రవేశించే మార్గాలు మూసుకుపోయే పరిస్థితి తలెత్తుతోంది. ముఖ్యంగా ఏటిగట్టు పరిసర ప్రాంతాల్లో నివసిస్తున్న వారి ఇళ్లలోకి వరదనీరు చేరుకుంది. సామాను అంతా నీట మునిగి పేద ప్రజలు కట్టుబట్టలతో మిగిలారు. మరికొందరు అత్యవసరమైన గృహోపకరణాలను వరదనీటిలోనే బయటకు తెచ్చుకునేందుకు ప్రయత్నించారు.
మహోగ్రంగా తమ్మిలేరు
english title:
tammileru
Date:
Sunday, November 4, 2012