...................
ఈ కథా కథనాలని చూస్తుంటే... అదే కైలాసం అదే శివుడు,
అదే దక్షుడు, అదే సతీదేవి. కాని హరహర మహాదేవ
ధారావాహికని చూస్తూంటే ప్రతి ఒక్కటీ కొత్తగా అనిపిస్తుంది. అంతకంటె కొత్తగా కనిపిస్తుంది. ఆ కొత్తదనానికి కారణం కథ కాదు, కథనం. ఇందులోని చిత్రానువాద ప్రతిభ ప్రతి సన్నివేశ కల్పనలోనూ, ఆయా సందర్భాలకు అనుగుణమైన సంఘటనలని నిరూపించడంలోనూ ఆశ్చర్యకరమైన రీతిలో వ్యక్తవౌతుంది.
...............................
తెలుగు బుల్లితెర ధారావాహికల నిండా కనిపించేవి కేవలం అత్తా కోడళ్ళ గొడవలు, సవతుల గోల, పసలేని పగలూ, అర్థంలేని ప్రతీకారాలూ వంటి మొరటి కథావస్తువులు, ముతక కథనాలు మాత్రమే. వీటితో విసుగెత్తిపోయిన ప్రేక్షకులకి కాస్త ఊరట కలిగించే విషయం ఒకటుంది. ఈ మధ్యన కొన్ని బుల్లితెర వాహినుల్లో ప్రసారవౌతున్న అనువాద ధారావాహికలు మళ్లీ కొత్తదనం చూపిస్తూ ఆకట్టుకుంటున్నాయి. నిజానికి తెలుగువాళ్లకి ఏ మాత్రం పరిచయంలేని వాతావరణం, కట్టుబొట్లు, ఆధారాలు వీటినిండా అలుముకుని ఉంటాయి. కాబట్టి వాటిని మనం అంత సులభంగా జీర్ణించుకోలేము. కానీ వేషభాషలూ, సంస్కృతీ సంప్రదాయాలూ మొదలైన పరిమితుల్ని అధిగమించి విస్తరించేదే కళ. కాబట్టి, కళకి పరిధులుండవు అనే విషయాన్ని ఈ ధారావాహికలు నిరూపిస్తున్నాయి.
నిజానికి సమకాలీన సమాజంలో మరీ ముఖ్యంగా తెలుగు నేలమీద బాల్య వివాహాలు చాలా అరుదనే చెప్పాలి. ఒకవేళ అక్కడక్కడా అలాంటి వివాహాలు జరిగినా వాటికి మన సమాజపు ఆమోదం లేదు. అయినప్పటికీ హిందీలో విజయం సాధించిన ‘బాలికా వధు’ హిందీ ధారావాహిక తెలుగులో ‘చిన్నారి పెళ్లికూతురు’గా అనువదించి మాటీవీలో ప్రసారం చేస్తే అది మిగిలిన తెలుగు ధారావాహికలతో పోటీపడి విజయం సాధించింది. ఆ విజయం అనూహ్యమైనది కాదు. ఎందుకంటే మానవ సంబంధాలకి స్పందనలకీ ప్రేమానుబంధాలకీ ఆవేశకావేశాలకీ భాషాభేదాలుగానీ ప్రాంతీయ తత్త్వాలుగానీ ఉండవు. ఆ ధారావాహిక సాధించిన విజయం మరిన్ని ధారావాహికలు అనువదించడానికి ప్రేరణగా మారింది.
* * *
ప్రస్తుతం మాటీవీలో ఏడెనిమిది హిందీ ధారావాహికలు ప్రసారం అవుతున్నాయి. వాటిలో మరీ ప్రత్యేకంగా పేర్కొనదగినది ‘హరహర మహాదేవ.. శంభోశంకర’’. ఇదిలైఫ్ ఓకె ఛానల్లో ప్రసారమై అశేష ప్రేక్షకాదరణతో నడుస్తోంది.
ఈ ధారావాహిక పాతకొత్తల మేలుకలయిక. ప్రేమ అనేది ఎంత పాత కథ అయినా ఎప్పటికప్పుడు అది కొత్తదే. మనుషుల్లో మనసున్నంత కాలం దాని కొత్తదనం మాసిపోదు.
ఈ ఆదిదేవుడి కథ ఒక అపురూపమైన ప్రేమ కథగా ప్రారంభమైంది. ఒక రుద్రాక్ష చుట్టూ ఇంత అందమైన కథ అల్లవచ్చా అనేంత ఆశ్చర్యం కలుగుతుంది. ఈ కథా కథనాలని చూస్తుంటే.. అదే కైలాసం అదే శివుడు, అదే దక్షుడు, అదే సతీదేవి. కాని హరహర మహాదేవ ధారావాహికని చూస్తూంటే ప్రతి ఒక్కటీ కొత్తగా అనిపిస్తుంది. అంతకంటె కొత్తగా కనిపిస్తుంది. ఆ కొత్తదనానికి కారణం కథ కాదు, కథనం. ఇందులోని చిత్రానువాద ప్రతిభ ప్రతి సన్నివేశ కల్పనలోనూ, ఆయా సందర్భాలకు అనుగుణమైన సంఘటనలని నిరూపించడంలోనూ ఆశ్చర్యకరమైన రీతిలో వ్యక్తవౌతుంది. ఎక్కడో కైలాసంలోని పరమేశ్వరుడి రుద్రాక్ష తెగిపడి హిమగిరులమీదుగా జారి నదిలో కొట్టుకొచ్చి సతి చేతికి దొరకడం, దానివల్ల తన తండ్రికి దూరం కావలసిన పరిస్థితులు ఏర్పడటం, దాంతో దానిని ఆమె శివలింగానికే సమర్పించడం, మరి కొంతకాలానికి మళ్లీ దానిని అక్కడికి వెళ్లి స్వీకరించక తప్పని పరిస్థితులు ఎదురవ్వడం, ఆ రుద్రాక్ష కేంద్రంగా సతీదేవికి తన ప్రేమ గురించి తెలియడం అంతా మూలానికి ఎలాంటి హాని చెయ్యని అతి చక్కని కల్పన. ఇలాంటి కల్పనలు ఈ ధారావాహికలోని ప్రతి భాగంలోనూ కనిపిస్తాయి.
ఇందులోని పాత్రలన్నీ కూడా తెలుగువారికి చిరపరిచితమైనవే. అయినప్పటికీ కొత్తగా కనిపిస్తాయి. ఎందుకంటే ఆయా పాత్రధారులెవరూ తెలుగువారు కారు. అలాగే ఆయా పాత్రల ఆహార్యం కూడా మనకి అంతగా పరిచయమైనది కాదు. ఉదాహరణకి శుక్రాచార్యుడు అనగానే మనకి ఒక గ్రీకు యోధుడు గుర్తుకురావడం అసాధ్యం. కానీ, ఇందులో శుక్రాచార్యుడు అలాగే ఉన్నాడు. అయినా పరాయివాడిగా అనిపించకపోవడానికి కారణం సంస్కృతుల ఎల్లలు తుడిచి పెట్టుకుపోతూండటమే. ఇది హర్షణీయమా కాదా అనే దాని గురించి చర్చ జరగవలసి ఉంది.
అలాగే పౌరాణిక గాథలని తెరకెక్కించడంలో కొన్ని సాంకేతికమైన అవరోధాలుంటాయి. ఉదాహరణకి సహజత్వం కోసం శివుడు తన మెడలో నిజంగానే నాగుపాముని వేసుకుంటే? శివుడు పాత్రధారి ఏకాగ్రతని ఆ పాము కొంతమేరకైనా భంగపరచేది. అప్పుడు ఆ పాత్రధారి ఇంత సహజంగా నటించగలిగేవాడు కాడు. ఈశ్వరుడంటే పూర్ణపురుషుడు. కొన్ని సందర్భాలలో ఇందులోని శివుడి హావభావాలని చూస్తున్నప్పుడు శివుడంటే ఇలాగే ఉంటాడనిపిస్తుంది. ఒకవేళ నిజం పాములతో నటించి ఉంటే ఈ అనుభూతి కలగదు. అందుకే కళలనేవి సహజత్వాన్ని కలిగి ఉండాలే తప్ప సహజంగా ఉంటే సహించడం కష్టం అని. ఇందులోని సతి పాత్రధారిణి తెలుగువారికి చిరపరిచితురాలైన ఒక సినిమా నటి పోలికలతో ఉండటం కూడా తెలుగువారిని ఆకట్టుకునే అంశం.
మరో విషయం ఏమిటంటే, మాటీవీలో సాయంత్రం ప్రసారమయ్యే ధారావాహికలు చిగురాకులలో చిలకమ్మ, హరహర మహాదేవ, చూపులు కలసిన శుభవేళ ఇలా వరుసగా మూడు విభిన్న ప్రేమ కథలు ప్రసారం కావడం చూస్తుంటే హిందీ పుణ్యమా అని తెలుగులో కూడా మళ్లీ రాధ-మధులాంటి చక్కటి కథలతో ఆహ్లాదకరమైన ధారావాహికలు రావచ్చనే అభిప్రాయం కలుగుతోంది. అప్పుడైనా ఈ అత్తాకోడళ్ళ గోల నించీ తెలుగు ఛానళ్ళు బయటపడాలని కోరుకోవడంలో అత్యాశ ఏమీ లేదు.