Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

కాకిలెక్కలు

$
0
0

శ్రీకాకుళం, నవంబర్ 7: మునుపెన్నడూ లేని విధంగా జిల్లాను నీలం తుఫాను అతలాకుతలం చేసి తుడిచిపెట్టుకుపోయింది. ఆరుగాలం శ్రమించే అన్నదాతలు పంట కోత దశకు వచ్చే సమయానికి నీటమునిగింది. అలాగే పత్తి, అరటి కూరగాయలు, వాణిజ్య పంటలు నాశనమయ్యాయి. వేలాది ఇళ్లు కూలిపోయి ఆ కుటుంబాలు నిరాశ్రయులయ్యారు. జిల్లా కేంద్రంలోని వివిధ కాలనీలు నీటమునిగి డ్రైనేజీ వ్యవస్థ పూర్తిగా పాడైంది. పశువులు సైతం మృత్యువాతపడ్డాయి. అనేక చెరువులకు గండ్లు పడగా రోడ్లు, కాజ్‌వేలు కొట్టుకుపోయాయి. ఇటువంటి నష్టాలను క్షేత్రస్థాయిలో అధికారులు పరిశీలించి నివేదికలు రూపొందించాల్సి ఉండగా అవేవీ పట్టని చందంగా కాకిలెక్కలు సర్కార్‌కు సమర్పించడం గమనార్హం. జిల్లా అధికారుల బిగ్‌బాస్ వెల్లడించిన నష్టాలకు ప్రకృతి బీభత్సానికి నష్టపోయిన అంచనాలకు సుమారు 200 కోట్లు వ్యత్యాసం సుస్పష్టమవుతోంది. జిల్లాకు రెండువందల కోట్లు నష్టం వాటిల్లిందని కలెక్టర్ సౌరభ్‌గౌర్ వెల్లడిస్తుండగా 380 కోట్లవరకు నష్టం ఉంటుందని అధికారులు అంగీకరించడం గమనార్హం. అలాగే 67,365 ఎకరాల్లో వరిపంటకు నష్టం వాటిల్లిందని సంబంధిత శాఖాధికారులు నివేదికలు రూపొందించగా నాలుగు లక్షల ఎకరాల్లో 20 శాతానికి పైగా నష్టం వాటిల్లి దిగుబడిపై ప్రభావం చూపుతోందని పలువురు స్పష్టం చేస్తున్నారు. నీటిపారుదల శాఖకు 20 కోట్లు నష్టం వాటిల్లినట్లు నివేదికలు రూపొందించారు. అయితే నారాయణపురం కుడి, ఎడమ కాలువల డిస్ట్రిబ్యూటరీలకు 49 చోట్ల గండ్లు పడ్డాయి. చిన్ననీటి పారుదల పరిధిలో 409 స్లూయిజ్‌లు విరిగిపోయాయి. వీటి మరమ్మతులకు 13.66 కోట్లు తక్షణమే అవసరమని నివేదిక పంపించారు. వంశధార ప్రాజెక్టు పరిధిలో డిస్ట్రిబ్యూటరీలకు, కెనాల్‌గట్లకు అనేక చోట్ల గండ్లు ద్వారా 62 లక్షల వరకు నష్టం వాటిల్లింది. ఇక రహదారులు విషయానికి వస్తే 68.48 కోట్లు... జిల్లాలో పంచాయతీ రహదారుల, భవనాల శాఖ పరిధిలో 445.50 కిలోమీటర్ల మేర నీలం ప్రభావానికి నష్టపోయాయి. ఒక్క ఆర్‌అండ్‌బి పరిధిలో శాశ్వత పనులకు 54.43 కోట్ల రూపాయలు అవసరమని అధికారులు గుర్తించారు. పంచాయతీ రహదారుల విషయానికి వస్తే టెక్కలి డివిజన్ పరిధిలో 184.20 కిలోమీటర్లు పాడయ్యాయి. శ్రీకాకుళం డివిజన్ పరిధిలో 7.5 కిలోమీటర్లు, పాలకొండ డివిజన్ పరిధిలో 14.4 కిలోమీటర్ల మేర రహదారులు పాడయ్యాయి. తాత్కాలిక మరమ్మతులకు 3.22 కోట్లు, శాశ్వత మరమ్మతులకు 11.05 కోట్లు అవసరమని నివేదించారు. ఉద్యానవన పంటలకు 36.90 లక్షల నష్టం వాటిల్లినట్లు సంబంధిత అధికారులు ప్రాధమిక అంచనాలు రూపొందించారు. ఇది పెరిగే అవకాశం లేకపోలేదు. అలాగే 4,666 హెక్టార్లలో పత్తి, 860 ఎకరాల్లో మొక్కజొన్న, 90 హెక్టార్లలో చెరకు, 116 హెక్టార్లలో అపరాల పంటలు దెబ్బతిన్నట్టు నివేదికలు రూపొందించారు. అయితే వీటి విస్తీర్ణం మరింత పెరిగే ప్రమాదం లేకపోలేదు. ఇదిలా ఉండగా భారీ వర్షాలకు 1375 పూరిళ్లు దెబ్బతిన్నాయి. శ్రీకాకుళం డివిజన్ పరిధిలో 43 ఇళ్లు పూర్తిగా 475 ఇళ్లు పాక్షికంగా ధ్వంసమయ్యాయి. పాలకొండ డివిజన్ పరిధిలో 14 పూర్తిగాను, 375 పాక్షికంగాను దెబ్బతిన్నాయి. టెక్కలి డివిజన్‌లో 73 పూర్తిగాను, 392 పాక్షికంగా పూరిళ్లు నేలమట్టమయ్యాయి. ఇటువంటి వారికి పునరావాసం కల్పించడంలో జిల్లా యంత్రాంగం మొక్కుబడిగా పర్యటించి సరిపెట్టుకుందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అలాగే ఆహార పదార్ధాలు, బియ్యం వంటి సామాగ్రి అందించే దాఖలాలు ఎక్కడా లేవు. తీర గ్రామాల్లో కూడా ఎటువంటి సహాయక చర్యలు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇలా నివేదికలకు, నష్టం అంచనాలకు వ్యత్యాసం ఉండడంతో పరిహారం అర్హులకు అందదన్న సందేహాలు తొంగిచూస్తున్నాయి. కాకిలెక్కల నివేదికలకు చెక్ పెట్టి నష్టపోయిన కుటుంబాలకు పరిహారం అందేలా క్షేత్రస్థాయిలో అంచనాలు రూపొందించేలా చర్యలు చేపట్టాల్సి ఉంది. అయితే జిల్లా కలెక్టర్ సౌరభ్‌గౌర్ ఐదు రోజుల్లో నివేదికలు ఇవ్వాలని క్షేత్రస్థాయి అధికారులను ఆదేశించడంతో వారంతా ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. సర్వే నంబర్ వారీగా ఆసామీ ప్రాప్తికి జాబితాలు రూపొందించాలంటే సుమారు 20 రోజుల సమయం పడుతుంది. దీనికి భిన్నంగా ప్రాధమిక అంచనాలు రూపొందించాలని అధికారులు సూచించడం సరైనది కాదని సామాన్యులు సైతం అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో పరిహారం జాబితాలు ఎలా రూపొందించుకుంటారో వేచిచూడాల్సి ఉంది.

నివేదికలు స్పష్టంగా ఉండాలి
ఆంధ్రభూమి బ్యూరో
శ్రీకాకుళం, నవంబర్ 7: ప్రకృతి కరాళ నృత్యానికి అతలాకుతలమైన శ్రీకాకుళం జిల్లా నష్టాన్ని లెక్కించడంలో అధికారులు కాకిలెక్కలు చూపించవద్దంటూ కేంద్ర కమ్యూనికేషన్లు, ఐ.టి.శాఖ సహాయ మంత్రి డాక్టర్ కిల్లి కృపారాణి అధికారులను ఆదేశించారు. ఇటీవల కురిసిన వర్షాలపై బుధవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అధికారులతో మంత్రి సమీక్షించారు. నివేదికలలో పొరపాట్లు వల్ల రైతులు నష్టపోరాదని, రైతులు సంతోషించే విధంగా రూపొందించాలన్నారు. తుపాను వల్ల కురిసిన వర్షాలపై అధికార యంత్రాంగం వెంటనే అప్రమత్తమై అన్ని చర్యలుతీసుకోవడం పట్ల ఆమె అభినందించారు. రహదారులను, ప్రజాసవసరాలను తక్షణం పునరుద్ధరించుటకు అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. కేంద్ర బృందం జిల్లాలో పర్యటించే విధంగా ప్రధాన మంత్రిని కలిసి కోరనున్నట్లు ఆమె చెప్పారు. మరణించినవారి కుటుంబాలకు వెంటనే నష్టపరిహారం అందజేయాలని ఆదేశించారు. మంగళవారం ఎనిమిది మండలాల్లో పర్యటించి దెబ్బతిన్న పంటలు, రహదారులు, గండిపడిన చెరువులను పరిశీలించానని చెప్పారు. గత సంవత్సరాల పంటల నష్టబీమా ఇంత వరకు అందలేదని రైతులు తెలియజేసారని వాటిపై తక్షణం స్పందించి తగు చర్యలు తీసుకోవాలన్నారు. గార మండలం చల్లవాని బంద, సోంపేట మండలం బీల ప్రాంతం, కంచిలి మండలం గంగాసాగరం గండి వలన అనేక వందల ఎకరాలు నీట మునిగాయన్నారు. గంగాసాగరం పనులు 5.38 కోట్ల రూపాయలతో పూర్తిఅయ్యే పరిస్థితి లేదని దానిపై అంచనాలు తయారు చేయాలని అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్ సౌరభ్‌గౌర్ మాట్లాడుతూ నివేదికలు ఈ నెల 12వ తేదీ నాటికీ రూపొందించాలని అధికారులను ఆదేశించారు. 13 నుంచి 15 వరకు పంట నష్టం వివరాలు గ్రామాల్లో తెలియజేయాలన్నారు. జిల్లాలో 31,877 హెక్టార్లలో పంట దెబ్బతిందని, ఐదు వేల హెక్టార్లలో పత్తి దెబ్బతిందని, చెరకు, జొన్న, అపరాలు కొంత మేర దెబ్బతిన్నాయని వివరించారు. పంట నష్టాలకు గురైన రైతుల బ్యాంకు ఖాతాల వివరాలు నమోదు చేయాలని ఆయన ఆదేశించారు. రైతులకు తక్కువ సమయంలో అందివచ్చే పంటల విత్తనాలు సరఫరా చేయాలన్నారు. పూర్తిగా ధ్వంసమైన గృహాలకు ఇందిరా అవాస్ యోజన గృహాలని, పాక్షికంగా దెబ్బతిన్న గృహాలకు మూడు వేల రూపాయలు వెంటనే అందించనున్నట్లు చెప్పారు. మృతి చెందిన నలుగురు కుటుంబాలకు నష్టపరిహారాన్ని వెంటనే అందిస్తామన్నారు. రహదారులు పురుద్ధరణ జరుగుతుందని, గండిపడిన చెరువు పనులు వెంటనే చేపట్టాలని ఆయన ఆదేశించారు. 12 పశువులు మృతి చెందాయని, కనుగులవానిపేట వద్ద ఒక పౌల్ట్రీ దెబ్బతిందని తెలిపారు. రహదారులు, భవనాలశాఖ కింద చేపట్టే రహదారుల తాతకలిక పునరుద్ధరణకు ఐదు కోట్ల రూపాయలు, శాశ్వత పునర్నిర్మాణానికి 30 కోట్ల రూపాయలు అంచనా వేసారని తెలిపారు. జిల్లాలో దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న పనులు జాబితాలను అంచనాలతో సహా సమర్పించాలని ఆదేశించారు. వీటిని ప్రభుత్వ స్థాయిలో పెట్టి మంజూరుకు ప్రయత్నిస్తామన్నారు.
శాసనమండలి సభ్యులు పీరుకట్ల విశ్వప్రసాద్, ఎచ్చెర్ల శాసనసభ్యుడు మీసాల నీలకంఠంనాయుడు, ఆమదాలవలస ఎమ్మెల్యే బొడ్డేపల్లి సత్యవతి, జిల్లా సహకార పరపతి సంఘం అధ్యక్షులు గొండు కృష్ణమూర్తి మాట్లాడారు. ఆమదాలవలస, బూర్జ, పొందూరు మండలాల్లో కరకట్టల నిర్మాణాన్ని చేపట్టాలని తద్వారా భవిష్యత్తులో వరద ముంపు నుండి ఉపశమనం కలగగలదని ఎమ్మెల్యే సత్యవతి సూచించారు. ఉద్యానవన పంటలు 540 హెక్టార్లలో దెబ్బతిన్నాయని, పంచాయితీరాజ్ రహదారుల తాత్కాలిక పనర్నిర్మాణానికి 9 కోట్ల రూపాయలు, శాశ్వత పునర్నిర్మాణానికి 60 కోట్ల రూపాయలు అవసరమని, వంశధార పరిధిలో 120 పనులు మరమ్మతుకు గురైనట్లు, నీటిపారుదలశాఖ కింద 184 పనులు మరమ్మతులకు గురైనట్లు ప్రాధమికంగా అధికారులు అంచనాలను తయారు చేసారు. ఈ సమావేశంలో పాలకొండ, టెక్కలి శాసనసభ్యులు నిమ్మక సుగ్రీవులు, కొర్ల భారతి, డిసిసిబి అధ్యక్షుడు ఎస్.వి.రమం, జిల్లా అదనపు జాయింట్ కలెక్టర్ ఆర్.ఎస్.రాజకుమార్, జిల్లా రెవెన్యూ అధికారి నూర్‌భాషాఖాసీమ్, జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ పి.డి. పి.రజనీకాంతారావు, టెక్కలి రెవెన్యూ డివిజనల్ అధికారి వి.విశే్వశ్వరరావు, వ్యవసాయశాఖ సంయుక్త సంచాలకులు ఎస్.మురళీకృష్ణారావు, రహదారులు, భవనాలశాఖ, పంచాయితీరాజ్, ట్రాన్స్‌కో, వంశధార పర్యవేక్షక ఇంజనీర్లు సి.హెచ్.సోమశేఖర్, బి.వి.ఎస్.చిరంజీవి, కె.శ్రీనివాస్, బి.రాంబాబు, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఎం.శారద, తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.

..........

నరేంద్రయాదవ్‌కే డిసిసి పగ్గాలు
ఆంధ్రభూమి బ్యూరో
శ్రీకాకుళం, నవంబర్ 7: జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నర్తు నరేంద్రయాదవ్‌ను నియమించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. గురువారం అధికారికంగా నరేంద్ర నియామకం హైకమాండ్ ప్రకటించనుంది. ఎప్పటినుంచో ఈ పీఠంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. శ్రీకాకుళం ఎంపి కిల్లి కృపారాణికి ఇటీవల కేంద్ర మంత్రి ఛాన్స్ లభించింది. గత కొన్నాళ్లుగా డిసిసి అధ్యక్షురాలిగా కృపారాణి వ్యవహరిస్తున్నారు. ఎప్పటినుంచో ఎం.పిగా, డిసిసి అధ్యక్షురాలిగా జోడి పదవులకు పూర్తి న్యాయం చేయలేకపోతున్నానని, ఇంకెవరికైనా డిసిసి పగ్గాలు అప్పగించాలని మంత్రి ధర్మాన ప్రసాదరావు ద్వారా హైకమాండ్‌కు విన్నవించారు. అప్పటి నుంచి ప్రదేశ్‌కాంగ్రెస్ కమిటీ సామాజికవర్గాల సమతుల్యత పాటించేలా డిసిసి అధ్యక్షున్ని నియమించాలని కసరత్తు చేస్తూ వచ్చారు. జిల్లా మంత్రి ధర్మాన ప్రసాదరావు, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్తిబాబు పలు పర్యాయాలు దీనిపై చర్చించి యాదవ సామాజికవర్గానికి చెందిన నర్తు నరేంద్రయాదవ్‌కు అవకాశం కల్పించారు. నరేంద్రయాదవ్ సామాన్య కార్యకర్త నుంచి కాంగ్రెస్ పార్టీలో పనిచేసి అంచెలంచెలుగా ఎదిగారు. కవిటి మండలం ఈదుపురం గ్రామానికి చెందిన నరేంద్రయాదవ్ డిగ్రీ పూర్తిచేసి కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం బలోపేతానికి కృషి చేశారు. అదే గ్రామానికి సర్పంచ్‌గా ఎన్నికై సర్పంచ్‌ల సంఘం రాష్ట్ర కార్యదర్శిగా కూడా పనిచేశారు. యువజన కాంగ్రెస్‌లో ప్రధాన కార్యదర్శిగా పనిచేసి కాంగ్రెస్ పార్టీ చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు పాదయాత్ర సాగించి హైకమాండ్ వద్ద శభాష్ అనిపించుకున్నారు. మంత్రి ధర్మాన ప్రసాదరావు ముఖ్య అనుచరునిగా జిల్లా కాంగ్రెస్‌లో చురుకైన పాత్ర పోషించారు. ఈదుపురం నుంచి పిఎసిఎస్ డైరెక్టర్‌గా ఎన్నికై ఇచ్ఛాపురం పిఎసిఎస్ అధ్యక్షునిగా డిసిసిబి ఉపాధ్యక్షునిగా ప్రస్తుతం సేవలందిస్తున్నారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షునిగా కూడా పనిచేస్తున్నారు. ఇటువంటి అనుభవం ఉన్న నర్తునరేంద్రయాదవ్‌కు డిసిసి బాధ్యతలు అప్పగించడం ఆ పార్టీలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. కాగా, ఇంతవరకు ఎన్నడూ జిల్లా కాంగ్రెస్ పగ్గాలు యాదవ్‌సామాజిక వర్గానికి లభించిన దాఖలాలు లేవు.
పార్టీని విజయపథంలో నడిపిస్తా
జిల్లాలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తానని నూతన డిసిసి అధ్యక్షులు నర్తు నరేంద్రయాదవ్ పేర్కొన్నారు. రానున్న 2014 ఎన్నికల్లో జిల్లాలో పది నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపే తన లక్ష్యమన్నారు. గ్రామస్థాయి, మండల, బ్లాక్, జిల్లా స్థాయి కమిటీల నియామకాల్లో యువతకు మరింత ప్రాధాన్యత ఇస్తానని చెప్పారు. తనపై ఉన్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా శాయశక్తుల పార్టీని ముందుకు నడిపిస్తానని ఆంధ్రభూమితో స్పష్టం చేశారు.

ముందస్తు జాగ్రత్తలు తీసుకోండి
* ప్రజలకు డిఎంఅండ్‌హెచ్‌ఒ సూచన
శ్రీకాకుళం (టౌన్), నవంబర్ 7: జిల్లాలో ఇటీవల కురిసిన వర్షాల వలన అంటువ్యాధులు ప్రబలే ప్రమాదముందని, ప్రజలు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ ఎం.శారద కోరారు. వర్షాల వలన నీరు కలుషితమవుతుందని, కాబట్టి ప్రజలందరూ కాచి వడపోసిన నీటిని మాత్రమే తాగాలని సూచించారు. నీటి కాలుష్యంతో ముఖ్యంగా అతిసార వ్యాధి ప్రబలే అవకాశముందన్నారు. వేడివేడి పదార్ధాలను భుజించాలని, నిల్వ పదార్ధాలు తినరాదని అన్నారు. కుళ్లిపోయిన చేపలు, మాంసం వంటివి ఎట్టి పరిస్థితిల్లోను తినరాదని, ఆకుకూరలు, కాయగూరలు శుభ్రంచేసి తినాలని చెప్పారు. ఆహార పదార్ధాలపై ఈగలు వాలకుండా జాగ్రత్తలు పాటిస్తూ, నీటిలో క్లోరినేషన్ చేయించాలని తెలిపారు. ఎవరికైనా వాంతులు, విరోచనాలు సంభవిస్తే సమీపంలో ఉన్న ఆరోగ్య కార్యకర్తలను సంప్రదించాలని కోరారు. ఇప్పటికే జిల్లాలోని 18 క్లస్టర్‌ల పరిధిలో టీంలు వేశామని, ప్రాధమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో వైద్య బృందాలు పనిచేస్తున్నాయన్నారు.

ఏజెన్సీలో మావోల అలజడి లేదు
పాలకొండ(టౌన్), నవంబర్ 7: జిల్లా వ్యాప్తంగా మావోయిస్టుల నుంచి ఎటువంటి అలజడులు లేవని జిల్లా ఎస్‌పి గోపాలరావు తెలిపారు. బుధవారం స్థానిక డి ఎస్‌పి కార్యాలయాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఎస్పీ విలేఖర్లతో మాట్లాడారు. ఏజెన్సీలో ఎటువంటి మావోయిస్టుల అలజడిలేదన్నారు. అయినా శాంతిభద్రతల పరిరక్షణకు సిబ్బందిని అప్రమత్తం చేస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో పశువుల అక్రమ రవాణాపై అధికంగా ఫిర్యాదులు వస్తున్నాయని దీనిని అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. అనుమానిత ప్రాంతాల్లో నిఘా ఏర్పాటు చేస్తామన్నారు. అంతకుముందు డి ఎస్‌పి కార్యాలయంలో పలు కేసులకు సంబంధించిన రికార్డులు పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈసందర్భంగా డి ఎస్‌పి శాంతౌ, పాలకొండ, కొత్తూరు సి ఐలు విజయానంద్, ఆదాం, పాలకొండ , వీరఘట్టం ఎస్ ఐలు శంకరరావు, కామేశ్వరరావు ఉన్నారు.

రైతులకు కేంద్రమంత్రి భరోసా
కంచిలి, నవంబర్ 7: జిల్లాలో నీలం తుఫాన్ కారణంగా కురిసిన భారీ వర్షాలకు నష్టపోయిన రైతులను, ప్రజలను ప్రభుత్వపరంగా ఆదుకుంటామని కేంద్ర కమ్యూనికేషన్లు, సమాచార సాంకేతిక సహాయ మంత్రి కిల్లి కృపారాణి హామీ ఇచ్చారు. బుధవారం మండలం జలంతరకోట వద్దనున్న గంగసాగరానికి పడిన గండిని పరిశీలించారు. ఈ సందర్భంగా మినీ రిజర్వాయర్ నిర్మాణానికి ఆరు కోట్ల రూపాయల నిధులు మైనర్ ఇరిగేషన్ ద్వారా మంజూరైనప్పటికీ పనులను అర్ధాంతరంగా నిలిపివేయడం వలనే ఈ నష్టం వాటిల్లిందని రైతులు కేంద్రమంత్రి దృష్టికి తీసుకువచ్చారు. గంగసాగరానికి సంబంధించి భూసేకరణ పూర్తిగా చేపట్టలేదని, గతంలో కూడా గండిపడి నష్టం వాటిల్లినట్లు రైతులు తెలిపారు. ఈ విషయమై దీపావళి పండగ అనంతరం రైతులు, సంబంధిత అధికారులతో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసి అవసరమైన చర్యలు ప్రభుత్వపరంగా చేపడతామని మంత్రి భరోసా ఇచ్చారు. అనంతరం విలేఖరులతో మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 5,25,00 హెక్టార్లలో వరిపంటకు నష్టం వాటిల్లిందని తెలిపారు.

మునుపెన్నడూ లేని విధంగా జిల్లాను నీలం తుఫాను అతలాకుతలం చేసి తుడిచిపెట్టుకుపోయింది.
english title: 
kaki

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>