చీరాల, నవంబర్ 7: నీలం తుపాను ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు పంటలు దెబ్బతిన్నాయని, వాతావరణ శాఖ వైఫల్యంతోనే ముందస్తు జాగ్రత్తలు తీసుకోలేకపోయామని ఆర్థిక శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి అన్నారు. వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ మాజీ చైర్మన్ స్వర్ణ రామకృష్ణారెడ్డి మృతి చెందడంతో వారి కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు మంత్రి బుధవారం ఉదయం చీరాల వచ్చారు. ఈ సందర్భంగా ఆయన ఐఎల్‌టిడి అతిథిగృహంలో విలేఖరులతో మాట్లాడుతూ నీలం తుపాను అనంతరం కురిసిన భారీ వర్షాలతో రైతులు పంట నష్టపోయారని తెలుసుకున్న ప్రధాని మన్మోహన్‌సింగ్, యుపిఎ చైర్‌పర్సన్ సోనియాగాంధీ స్వయంగా ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిని అడిగి తెలుసుకున్నారన్నారు. పచ్చిమగోదావరి జిల్లాలో కురిసిన భారీ వర్షాలకు పంట పొలాల్లో నీరు ఇంకా నిల్వలు ఉన్నాయని, అవి తొలగిపోయిన తరువాత అధికారులు అంచనా తయారుచేయనున్నట్లు ఆయన వెల్లడించారు. పంట నష్టం జరిగిన జిల్లాలలో నష్టం అంచనా వేసేందుకు ముఖ్యమంత్రి ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేశారని వివరించారు. తాత్కాలిక చర్యలలో భాగంగా సంబంధిత కలెక్టర్‌లకు పూర్తి ఆదేశాలు జారీ చేశామని, అవసరమైన మేర నిధులను కలెక్టర్‌లు వాడుకోవచ్చని ఆయన చెప్పారు. లోతట్టు ప్రాంతాల వారికి, చేనేత మగ్గాల గుంతల్లోకి నీరు చేరి పనులకు ఆటంకం కలిగించి ఉంటే తక్షణ చర్యల్లో భాగంగా బియ్యం సరఫరా చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. అంతేగాక ప్రమాదవశాత్తు ఈ విపత్తు వల్ల మరణిస్తే వారి కుటుంబ సభ్యులకు తక్షణ సహాయంగా రూ. 1.50 వేలు ఆర్థిక సహాయంగా బ్యాంకు ఖాతాలో జమ చేస్తున్నామన్నారు. ఈ తుఫాన్ ప్రభావంతో ఎక్కువమంది సన్న, చిన్నకార రైతులు ఉంటే వారికి పూర్తిస్థాయిలో సహాయం అందించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ముందుంటుందన్నారు. తుఫాన్ ప్రభావంతో దెబ్బతిన్న పంటలను పరిశీలించేందుకు రెవెన్యూ, వ్యవసాయ, నీటిపారుదల శాఖ అధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారని తెలిపారు. అలాగే సిఎం ఏరియల్ సర్వే చేస్తున్నట్లు ఆయన తెలిపారు. థర్మల్, గ్యాస్ కొరత వల్ల విద్యుత్ ఉత్పత్తి సామర్ధ్యం తగ్గిందని, దీనివల్ల ఇతర ప్రాంతాల నుంచి విద్యుత్‌ను కొనుగోలు చేయాల్సి వచ్చిందన్నారు. విద్యుత్ సరఫరా గ్రిడ్‌ల అనుసంధానం సక్రమంగా లేకపోవటంతో విద్యుత్ కొనుగోలులో అంతరాయం ఏర్పడుతోందని అన్నారు. సంక్షేమానికి రూ. 40వేల కోట్లను బడ్జెట్ నుంచి ఖర్చు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. రాష్ట్రంలో ఎలాంటి ఆర్థిక సంక్షోభం లేదని, ఎలాంటి విపత్తునైనా ఎదుర్కొనేందుకు వనరులు సమృద్ధిగానే ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. మాజీ ముఖ్యమంత్రి, తమిళనాడు గవర్నర్ కొణిజేటి రోశయ్య సుదీర్ఘకాలం ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేశారని, వనరులు సమకూర్చటంలో ఆయన బాటనే అనుసరిస్తున్నామని ఆయన వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం గ్యాస్ సిలిండర్‌లపై విధించిన పరిమితుల గురించి మాట్లాడుతూ కేంద్రంపై గ్యాస్ భారం అధికమవటంతో కేంద్ర ప్రభుత్వం ఈ నిబంధనలు పెట్టిందని, రాష్ట్ర ప్రభుత్వం కూడా గ్యాస్‌పై కొంతభారం మోస్తుందని అన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసమే ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నాయని మంత్రి రామనారాయణరెడ్డి మండిపడ్డారు. ప్రతిపక్ష పార్టీలు మొక్కుబడిగా వచ్చి రైతులను పరామర్శించి వారిని రెచ్చగొట్టి తిరిగి పాదయాత్రలంటూ కార్యక్రమాలు చేపడుతున్నారని, దీనివల్ల రైతులు మరింత ఆవేదనకు గురవుతున్నారని అన్నారు. సమావేశంలో చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్, తహశీల్దారు విద్యాసాగరుడు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
దేవుడి కరుణతో బయటపడ్డా
డెయిరీ చైర్మన్ చల్లా వెల్లడి
ఆంధ్రభూమి బ్యూరో
ఒంగోలు, నవంబర్ 7: దేవుడి కరుణ, జార్ఖండ్ రాష్ట్ర ప్రభుత్వం, అధికారుల కృషితో తాను కిడ్నాపర్ల చెర నుండి సురక్షితంగా బయటపడ్డానని ఒంగోలు డెయిరీ చైర్మన్ చల్లా శ్రీనివాసరావు తెలిపారు. కిడ్నాపర్ల చెర నుండి విడుదలైన శ్రీనివాసరావు గురువారం జిల్లాకేంద్రమైన ఒంగోలుకు విచ్చేసిన సందర్భంగా టిడిపి నాయకులు, కార్యకర్తలు, డెయిరీ సిబ్బంది ఆయనకు ఘనస్వాగతం పలికారు. ఈసందర్భంగా డెయిరీ కార్యాలయ ఆవరణలో ఏర్పాటుచేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆసియా బ్యాంకు అభివృద్ధి నిధులతో అక్కడ రోడ్డు నిర్మాణ పనులు చేపడుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. తెలుగు రైతు రాష్ట్ర అధ్యక్షుడు కరణం బలరామకృష్ణమూర్తి ప్రత్యేక చొరవ తీసుకుని బిజెపి జాతీయ నాయకుడు ముప్పవరపు వెంకయ్యనాయుడు దృష్టికి తీసుకువెళ్ళారన్నారు. ఆయన ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్ళి సమస్యను పరిష్కరింప చేశారన్నారు. అదేవిధంగా సాహెబ్‌గంజ్ జిల్లా ఎస్‌పి విజయలక్ష్మి ప్రత్యేక కృషి చేశారని ఆయన కొనియాడారు. జిల్లా ఎస్‌పి కొల్లి రఘురామిరెడ్డి ఎప్పటికప్పుడు అక్కడి ఎస్‌పితో మాట్లాడుతూ త్వరితగతిన సమస్యను పరిష్కరించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈనెల ఒకటవ తేదీ ఉదయం 10.25 గంటకు ఒక కల్వర్టు వద్ద రోడ్డును బ్లాక్‌చేసి దుండగులు హడావుడి చేశారన్నారు. అనంతరం ఆయుధాలతో బెదిరించి తనతోపాటు మరో ఇద్దరిని జనంతో సంబంధాలు లేని ప్రాంతాలకు తీసుకువెళ్ళారన్నారు. తమ కళ్ళకు గంతలు కట్టి తీసుకువెళ్ళటంతో ఏమి జరుగుతుందో తెలియలేదన్నారు. అక్కడి రాష్ట్ర ప్రభుత్వం హెలికాప్టర్ల ద్వారా కూడా సర్వే చేయించిందని ఆయన పేర్కొన్నారు. తమకు తినేందుకు బిస్కెట్లు, నీరు, పండ్లు ఇచ్చారని ఆయన తెలిపారు. కాగా వారి డిమాండ్ ఏమిటో తెలియదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసుల పనితీరును ఆయన ప్రశంసించారు. చల్లా వెంట తెలుగురైతు రాష్ట్ర అధ్యక్షుడు కరణం బలరామకృష్ణమూర్తి, కందుకూరు మాజీ శాసనసభ్యుడు దివి శివరాం తదితరులు పాల్గొన్నారు. ముందుగా డెయిరీ పక్కనే ఉన్న వినాయకస్వామి ఆలయంలో చల్లా ప్రత్యేక పూజలు చేశారు. అక్కడ నుండి భారీ ఊరేగింపుతో డెయిరీ ఆవరణలోకి విచ్చేశారు. మొత్తంమీద చల్లా విడుదలతో టిడిపి శ్రేణుల్లో ఆనందం నెలకొంది.
భారీ వర్షాలు కురిస్తే అంతే..
కొత్తపట్నం మండల వాసుల కష్టాలు
ప్రమాదం జరిగితే కాటికే
ఆంధ్రభూమి బ్యూరో
ఒంగోలు, నవంబర్ 7: భారీ వర్షాలు, తుపాన్లు సంభవిస్తే కొత్తపట్నం మండల ప్రజలకు నిద్ర ఉండదు. కనీసం ప్రజలకు రోగం వస్తే నగరానికి వచ్చి చూపించుకోలేని దయనీయమైన పరిస్థితి. జిల్లాకు కూతవేటు దూరంలో ఉన్న కొత్తపట్నం మండల ప్రజల దుర్భర పరిస్థితి ఇది. ఎన్నికల సమయంలో మాత్రం వివిధ రాజకీయపక్షాలకు చెందిన నాయకులు మాత్రం మండలాన్ని అన్ని రంగాల్లో తీర్చిదిద్దుతామని ఉత్తర ప్రగల్భాలాలు పలకటం పారిపాటిగా మారింది. తీరా ఎన్నికలు పూర్తయిన తరువాత మాత్రం మండల ప్రజల ముఖం చూసే నాథుడే ఉండరన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రధానంగా భారీ వర్షాలు, తుపాన్లు సంభవించినప్పుడు కొత్తపట్నం మండలానికి సంబంధించిన 14 గ్రామాల ప్రజలకు బాహ్యప్రపంచంతో సంబంధాలు ఉండవు. దురదృష్టవశాత్తు ఏదైనా సంఘటన జరిగితే వారు మృత్యుకౌగిల్లోకి వెళ్ళటమే తప్ప మెరుగైన వైద్యం అందదు. ఇటీవల కురిసిన భారీ వర్షాలతోపాటు, లైలా, థానే తుపాను ప్రభావం కొత్తపట్నం మండలాన్ని కుదేసింది. ఒంగోలు నుండి కొత్తపట్నం వెళ్ళే మార్గమధ్యలో నల్లవాగు, కొత్తపట్నం దగ్గరలోని గవ్వలగుంట వాగు ఉద్ధృతంగా ప్రవహించింది. అలాగే ఒంగోలు నుండి ఈతముక్కలకు వెళ్ళే మార్గమధ్యంలో వాగు ప్రవహిస్తుంది. కాగా ఒంగోలు నుండి మోటుమాలకు వెళ్ళాలంటే ఉప్పుకాల్వ వద్ద ఉన్న చప్టావద్ద ప్రమాదస్థాయిలో వరదనీరు ప్రవహిస్తుంటాయి. దీంతో కొత్తపట్నం మండలం నుండి ఒంగోలుకు రావాలంటే మూడుమార్గాలు మూసుకుపోయినట్లే. ఈనేపథ్యంలో మండల ప్రజలు చప్టాలు, హైలెవల్ బ్రిడ్జిలు నిర్మించాలని గొంతెత్తి ఘోషిస్తున్నప్పటికీ అధికారులుకాని, పాలకులు కాని పట్టించుకున్న పాపానపోవటం లేదు. దీంతో మండలంలోని సుమారు 40వేల మంది ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అదేవిధంగా సముద్రంలో వేటాడిన మత్స్యసంపద కూడా జిల్లాకేంద్రమైన ఒంగోలుకు సక్రమంగా రాని పరిస్థితులు నెలకొంటున్నాయి. ప్రస్తుతం రోడ్ల పరిస్థితి కూడా కడుదయనీయంగా ఉన్నాయి. ఒంగోలు నుండి ఈతముక్కలకు వెళ్ళే రోడ్డుమార్గంలో అన్ని గుంతలు ఉండటంతో భారీ వర్షాల సమయంలో ఏ గుంతలో పడి వాహనాలు మునిగిపోతాయోనన్న ఆందోళనలో ప్రయాణికులు బిక్కుబిక్కుమంటూ ప్రయాణించాల్సిందే. అదేవిధంగా ఒంగోలు నుండి కొత్తపట్నం వెళ్ళే మార్గమధ్యంలో ఉన్న తూముల బ్రిడ్జి కూలిపోయే దశకు చేరుకుంది. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు, అధికారులు కొత్తపట్నం మండలంపై ప్రత్యేక దృష్టిసారించాల్సిన అవసరం ఉంది.
ఆదర్శప్రాయుడు ఎన్‌జి రంగా
ఎమ్మెల్యే దగ్గుబాటి నివాళి
ఒంగోలు, నవంబర్ 7: ప్రపంచ రైతాంగ ఉద్యమనేత ఆచార్య ఎన్‌జి రంగా అందరికీ ఆదర్శప్రాయుడని పర్చూరు శాసనసభ్యుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు అన్నారు. ఆచార్య రంగా కిసాన్ సంస్థ ఒంగోలు వారి ఆధ్వర్యంలో ఎన్‌జి రంగా 113వ జయంతి కార్యక్రమం బుధవారం ఒంగోలులో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆచార్య రంగా కిసాన్ సంస్థ అధ్యక్షుడు ఆళ్ళ వెంకటేశ్వరరావు అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమానికి గౌరవ అతిథిగా హాజరైన దగ్గుబాటి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఆచార్య ఎన్‌జి రంగా జీవించినంతకాలం రైతులు, పేద, బడుగు వర్గాల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం సేవ చేశారని తెలిపారు. ఆయన ప్రపంచ రైతాంగానికి నాయకత్వం వహించిన వ్యక్తని పేర్కొన్నారు. వ్యవసాయాన్ని అధ్యయనం చేసి అనేక పుస్తకాలను రచించి వ్యవసాయంపై రైతాంగానికి అవగాహన కల్పించారన్నారు. రైతాంగ సమస్యలను పరిష్కరించేందుకు పార్లమెంట్ సమావేశాల్లో నిత్యం రైతుల సమస్యలను లేవనెత్తేవారని కొనియాడారు. రైతులకు అండగా నిలిచి వ్యవసాయాన్ని ప్రోత్సహించారని తెలిపారు. రైతులు బాగుంటేనే గ్రామీణ ప్రాంతాలు ఆర్థికంగా అభివృద్ధి చెంది దేశం కూడా సుభిక్షంగా ఉంటుందని రంగా చెబుతుండేవారని తెలిపారు. రంగా జయంతి కార్యక్రమాన్ని రంగా కిసాన్ సంస్థ వారు జరపడం సంతోషంగా ఉందన్నారు. వ్యవసాయ రంగానికి ప్రత్యేక బడ్జెట్‌ను ఏర్పాటు చేయడం ద్వారా రైతాంగం అభివృద్ధి చెందుతుందని, ఆవైపుగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. వ్యవసాయం మీద ఆధారపడి జీవించే వారికి మేమున్నామని భరోసా కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించాలన్నారు. ప్రస్తుతం వ్యవసాయం సంక్షోభంలో చిక్కుకోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని, ప్రభుత్వం వారిని ఆదుకునేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. కేంద్ర మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు మాట్లాడుతూ కృష్ణ, గోదావరి ఆనకట్టల నిర్మాణాలకు ఆనాటి కాటన్ దొర కృషి చేసి రైతాంగానికి సాగునీరు పుష్కలంగా అందించారన్నారు. అదేవిధంగా ఎన్‌జి రంగా కూడా వ్యవసాయ రంగానికి ప్రాముఖ్యతనిచ్చి జీవితాంతం రైతు సమస్యలకోసం పని చేశారన్నారు. వ్యవసాయ, సామాజిక అభివృద్ధికి కృషి చేసిన కాటన్ దొరలాగే ఎన్‌జి రంగా కూడా రైతులకు సేవలు అందించారని కొనియాడారు. రంగా పదవులకోసం ఏనాడు పని చేయలేదన్నారు. నాగార్జునసాగర్ ప్రాజెక్టు ఏర్పాటుకు కృషి చేసింది రంగాయేనన్నారు. రైతులకు ప్రభుత్వం సకాలంలో ఎరువులు, విత్తనాలు అందించి ఆదుకోవాలని, వ్యవసాయానికి బీమా పథకం అమలు చేయాలని, బ్యాంకుల ద్వారా రుణాలు అందజేయాలని, రైతాంగానికి అవసరమైన ఆధునిక పరికరాలు అందించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు ఈదర హరిబాబు, దివి శివరాం, రంగా కిసాన్ సంస్థ ప్రధాన కార్యదర్శి చుంచు శేషయ్య, ఉపాధ్యక్షుడు నామినేని మోహన్‌రావు తదితరులు మాట్లాడారు. ఈసందర్భంగా మాజీ మంత్రులు దగ్గుబాటి వెంకటేశ్వరరావు, వడ్డే శోభనాద్రీశ్వరరావులను ఘనంగా సన్మానించారు. అనంతరం బొచ్చేపల్లికి చెందిన ఉత్తమ రైతు దండా వీరాంజనేయులు, ఉత్తమ వ్యవసాయ సహకార పరపతి సంఘం అధ్యక్షుడు కారుసాల సింగయ్య చౌదరి, ఉత్తమ ఎత్తిపోతల పథకం, ఉత్తమ వ్యవసాయ శాస్త్ర విద్యార్థి, ఉత్తమ వ్యవసాయ ఇంజనీరింగ్ విద్యార్థులకు ఆర్థికసాయం అందించారు.
తక్షణమే రైతులను ఆదుకోవాలి
బిజెపి నాయకుల డిమాండ్
చీరాల, నవంబర్ 7: నీలం తుపాను ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు నష్టపోయిన రైతులను ప్రభుత్వం తక్షణమే ఆదుకొని ఆర్థిక సహాయం చేయాలని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధులు ఎస్ సురేష్‌రెడ్డి, జి భానుప్రకాష్‌రెడ్డిలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వర్షాలకు దెబ్బతిన్న పంట పొలాలను బుధవారం వారు పర్చూరు, చీరాల నియోజకవర్గాలలో నాలుగు బృందాలుగా ఏర్పడి పరిశీలించారు. ఈ సందర్భంగా స్థానిక సాయి కృష్ణా రెసిడెన్సీలో ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో వారు మాట్లాడుతూ రాష్ట్రంలో నీలం తుఫాన్ కారణంగా రూ. 5వేల కోట్లు నష్టం వాటిల్లిందని సర్వేలో తేలిందని అన్నారు. పంట దెబ్బతిన్న రైతులకు ఎకరాకు రూ. 10వేలు నష్టపరిహారం చెల్లించాలని, అదేవిధంగా నీట మునిగిన చేనేత మగ్గాలకు, వేట సాగక పస్తులుంటున్న మత్స్యకారులకు 35కేజిల బియ్యం, 5లీటర్ల కిరోసిన్, రూ. 5వేల నగదును తక్షణ సహాయంగా అందజేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి తన పదవిని కాపాడుకోవటానికే కాలాన్ని వెచ్చిస్తున్నారని ప్రజల సమస్యలు పట్టించుకోవటం లేదని విమర్శించారు. గతంలో వచ్చిన రెండు తుఫాన్‌లతో దెబ్బతిన్న రైతులకు నష్టపరిహారం అందించలేదని వారు అన్నారు. పులిచింతల ప్రాజెక్టును వెంటనే పూర్తిచేయాలని వారు డిమాండ్ చేశారు. డ్రైన్‌ల మరమ్మతులు లేక పట్టణంలోని ప్రజలు పలు ఇబ్బందులు పడుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అఖిలపక్ష బృందాన్ని ఢిల్లీకి తీసుకెళ్ళి రైతులకు సహాయాన్ని అందించేందుకు కృషి చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కె హరిబాబు, బత్తుల నరసింహారావు, గోలి నాగేశ్వరరావు, మువ్వల వెంకటరమణ, మేడికొండ భరణీరావు, పల్లపోలు రామబ్రహ్మం, ఆకాశపు శ్రీనివాసరావు, గౌరాబత్తిన జయశంకర్, లంకా భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీలో అపశ్రుతి
ఒకరి మృతి
ఒంగోలు, నవంబర్ 7: ఒంగోలులోని పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో బుధవారం జరిగిన ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీలో అపశ్రుతి చోటుచేసుకుంది. చీమకుర్తి మండలం చండ్రపాడు గ్రామానికి చెందిన కొమ్ము ప్రభాకర్ (21) అనే అభ్యర్థి దేహదారుఢ్య పరీక్షల్లో భాగంగా పరుగు పందెంలో పాల్గొన్నాడు. ఒక రౌండ్ పరిగెత్తిన అనంతరం రెండవ రౌండ్ పరిగెత్తే సమయంలో ఒక్కసారిగా కింద పడిపోయాడు. దీనితో అక్కడే ఉన్న డాక్టర్ వైద్య పరీక్షలు చేసి అప్పటికే ప్రభాకర్ మృతి చెందినట్లు నిర్ధారించారు. ప్రభాకర్ పరుగు పందెంలో పాల్గొని అలసిపోయి గుండె అగిపోయి మృతి చెంది ఉండవచ్చని రిక్రూట్‌మెంట్ నిర్వహిస్తున్న ఆర్మీ అధికారులతోపాటు, వైద్యులు, పోలీసులు భావిస్తున్నారు. ప్రభాకర్ మృతదేహాన్ని ఒంగోలు రిమ్స్ వైద్యశాలకు పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఇదిలా ఉండగా అప్పటికే విషయాన్ని తెలుసుకున్న ప్రభాకర్ తల్లి విశ్రాంతమ్మ, ప్రభాకర్ అక్క రూతమ్మలు రిమ్స్‌లోని మార్చూరీ వద్దకు వచ్చి ప్రభాకర్ మృతదేహాన్ని చూసి బోరున విలపించారు. రూతమ్మ ఒక్కసారిగా సొమ్మసిల్లి పడిపోయింది. తల్లి విశ్రాంతమ్మ బోరున విలపిస్తూ తన కుమారుడు ప్రభాకర్ ఏదోఒక ఉద్యోగం పొందేందుకు ఒంగోలులోనే ఒక గది అద్దెకు తీసుకొని ఉంటున్నాడని తెలిపింది. ఎదిగొచ్చిన తన కొడుకు ఏ ఉద్యోగం పొందకుండానే మృతి చెందాడంటూ తమకు దిక్కెవరంటూ బోరున విలపించింది. ఇటీవల పోలీస్ రిక్రూట్‌మెంట్‌కు సంబంధించి కూడా పరీక్షల్లో పాల్గొన్నట్లు తెలిపారు. ప్రభాకర్ మృతి వార్త తెలియగానే చండ్రపాడు గ్రామం నుండి వారి బంధువులు పెద్దఎత్తున రిమ్స్‌లోని మార్చూరీ వద్దకు వచ్చారు. పోస్టుమార్టం అనంతరం పోలీసులు ప్రభాకర్ మృతదేహాన్ని వారి బంధువులకు అప్పగించారు. ఈ సందర్భంగా ఒంగోలు తాలూకా పోలీస్‌స్టేషన్ సిఐ శ్రీనివాసన్ మాట్లాడుతూ ప్రభుత్వపరంగా ఏదైనా రాయితీలు వచ్చే అవకాశం ఉంటే ఇప్పించే ప్రయత్నం చేస్తామని హామీ ఇచ్చారు. ఆమేరకు ఒంగోలు తాలూకా పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
పంటనష్టం అంచనాలో తప్పులు దొర్లితే సహించేది లేదు
* తహశీల్దార్లకు కలెక్టర్ హెచ్చరిక
మార్కాపురం, నవంబర్ 7: నీలం తుపానులో దెబ్బతిన్న పంట నష్టం అంచనాల్లో అధికారులు రైతులకు అన్యాయం చేస్తే సహించేది లేదని కలెక్టర్ అనితా రాజేంధర్ హెచ్చరించారు. బుధవారం మార్కాపురం ఆర్డీఓ కార్యాలయంలో తహశీల్దార్లతో జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ పంట నష్టం అంచనాల తయారీలో ఒత్తిళ్ళకు లొంగకుండా నష్టపోయిన రైతుల పేర్లను మాత్రమే నమోదు చేయాలని ఆమె ఆదేశించారు. ఈసమావేశంలో పాల్గొన్న జాయింట్ కలెక్టర్ లక్ష్మీనృశింహం మాట్లాడుతూ భూమి వివరాలను కంప్యూటరీకరణను త్వరితగతిన పూర్తి చేయాలని, మీ సేవా ద్వారా వచ్చిన అర్జీలకు త్వరితగతిన సమాచారం అందించాలని ఆదేశించారు. ముఖ్యమంత్రి పర్యటనలో వచ్చిన అర్జీలపై వెంటనే స్పందించాలని, భూమి సిస్తు వసూళ్ళపై దృష్టి సారించాలని ఆయన ఆదేశించారు. నిత్యావసర వస్తువులు అక్రమ మార్గంలో తరలివెళ్ళకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని, తరచూ చౌకధరల దుకాణాలను తనిఖీలు చేసి రికార్డులను పరిశీలించి పేదప్రజలకు అందేలా చూడాలని ఆదేశించారు. ఈసమావేశంలో ఆర్డీఓ రాఘవరావు, తహశీల్దార్లు పాల్గొన్నారు.
సమస్యల వెల్లువ : జంగంగుంట్ల చెరువులో నీటిని అక్రమంగా బయటకు తోడి కాకర్ల గ్రామానికి చెందిన కొందరు రైతులు చెరువులో వ్యవసాయం సాగిస్తున్నారని, వారిపై చర్యలు తీసుకొని న్యాయం చేయాలని జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు. మా గ్రామంలో 7లక్షల 56వేల రూపాయలతో ఓవర్‌హెడ్‌ట్యాంకును నిర్మించారని, అయితే ఈ ట్యాంకు ద్వారా నీరు వచ్చిన దాఖలాలు లేవని, ప్రజలు మురికినీరు తాగి కాలం వెళ్ళబుచ్చాల్సిన పరిస్థితి ఏర్పడిందని జంగంగుంట్ల గ్రామస్థులు కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు. మార్కాపురం డివిజన్‌లోని అనేక ప్రాంతాల్లో బెల్టుషాపులు విచ్చలవిడిగా వెలిశాయని, అధికారిక షాపుల్లో కూడా సమయం లేకుండా మద్యం అమ్మకాలు సాగిస్తున్నారని ఐద్వా నాయకురాలు కళావతి వినతిపత్రం అందచేశారు. గోగులదినె్న గ్రామంలో అక్రమంగా దళితుల భూములు పొందిన వారు ప్రభుత్వం నుంచి తీసుకున్న నష్టపరిహారాన్ని వసూలు చేయాలని ఆరునెలల కింద కలెక్టర్ ఆదేశాలు జారీ చేసినప్పటికీ రెవెన్యూ అధికారులు ఈవిషయంపై దృష్టి సారించలేదని, ఇప్పటికైనా కలెక్టర్ ఉత్తర్వులను అమలు చేస్తూ నష్టపరిహారం నిధులను వసూలు చేయాలని గ్రామానికి చెందిన దళితులు కలెక్టర్‌కు వినతిపత్రం అందచేశారు. నీలం తుపానులో నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించాలని, అలాగే రబీ సీజన్‌లో పంటలు సాగు చేసుకునేందుకు అవసరమైన విత్తనాలు, ఎరువులను కౌలురైతులకు కూడా అందించాలని ఆర్డీఓ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి కలెక్టర్ అనితా రాజేంధర్‌కు వినతిపత్రం అందించారు.
స్వయం సహాయక గ్రూపులకు రూ. 380 కోట్లు రుణలక్ష్యం
* డిఆర్‌డిఎ పిడి పద్మజ వెల్లడి
మార్కాపురంరూరల్, నవంబర్ 7: ఈ ఆర్థిక సంవత్సరంలో జిల్లాలోని స్వయం సహాయక బృందాలకు 380 కోట్ల రూపాయలను వడ్డీలేని రుణంగా ఇవ్వాలని నిర్ణయించామని డిఆర్‌డిఎ ప్రాజెక్టు డైరెక్టర్ పద్మజ వెల్లడించారు. బుధవారం ఎంపిడిఓ కార్యాలయంలో ఆమె విలేఖరులతో మాట్లాడుతూ సెప్టెంబర్ 30 వరకు 185 కోట్ల రుణ లక్ష్యానికి గాను 210 కోట్ల రూపాయలు ఇచ్చామని, మిగతా రుణాన్ని మార్చి 31లోపు అర్హులైన గ్రూపులకు అందిస్తామన్నారు. జూలైలో 2.61కోట్లు, ఆగస్టులో 2.87కోట్లు, సెప్టెంబర్‌లో 2.99 కోట్ల రూపాయలు విడుదలైనట్లు తెలిపారు. పాలప్రగతి కేంద్రాల ఏర్పాటుకు ప్రభుత్వం ప్రోత్సాహం ఇస్తుందని, ఒక్కొక్క గ్రూపుకు 5లక్షల రూపాయలు ఇస్తామని, ఎస్సీ ఎస్టీలకు 2.25లక్షల రూపాయల సబ్సీడి ఉంటుందని, మిగతా వారికి లక్ష రూపాయల సబ్సీడి ఉంటుందని తెలిపారు. బేస్తవారపేటలో పశుదాణా కేంద్రాన్ని ఏర్పాటు చేశామని, పాలప్రగతి కేంద్రాల వారు పోషక విలువలుగల దాణాను అక్కడ నుంచి కొనుగోలు చేయాలని తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరంలో జిల్లాకు 10వేల దీపం కనెక్షన్లు మంజూరయ్యాయని, మార్కాపురం డివిజన్‌లో 2541 కనెక్షన్లను కేటాయించినట్లు తెలిపారు. అనంతరం ఆమె వివిధ అంశాలపై ఎపిఓలతో సమీక్ష నిర్వహించారు.