కారేపల్లి, నవంబర్ 7: దాడి ప్రతిదాడుల్లో ఇరువురు హత్యకు గురైన సంఘటన మండలంలో సంచలనం సృష్టించింది. గ్రామస్థుల కథనం ప్రకారం మండల పరిధిలోని చీమలపాడు గ్రామపంచాయతీ పాటిమీదిగుంపు గ్రామానికి చెందిన బానోత్ రమేష్ గ్రామంలో పలు నేరాల్లో నిందితుడుగా ఉన్నాడు. ఇటీవల జరిగిన ఒక మేకపోతు దొంగతనం సంఘటనలో ప్రత్యక్షంగా చూసిన మరో వ్యక్తి పెద్ద మనుషుల పంచాయతీలో సాక్ష్యం చెప్పాడని అతనిపై కక్షతో మంగళవారం అర్థరాత్రి 2 గంటల సమయంలో అతని ఇంటిపై రాళ్లతో దాడికి దిగాడు. ఎంటో గొడవ జరుగుతున్నదని ఆ పక్క ఇంటిలో గల ధరావత్ రమేష్ బయటకు వచ్చి ఎందుకు రాళ్లు వేస్తున్నావని గట్టిగా మందలించాడు. దీంతో బాణోత్ రమేష్ తన వద్ద ఉన్న కత్తితో అతనిపై దాడి చేశాడు. పొట్టపై తీవ్రగాయాలై పేగులు బయటకు వచ్చాయి. ఈ సందర్భంలో చుట్టు పక్కల వారు గుమిగూడి దాడి చేసిన వ్యక్తిని పట్టుకొని చేతులు కట్టి వేశారు. గాయపడిన వ్యక్తిని ఖమ్మంలోని ఆసుపత్రికి తరలించటంతో అతను మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఈ విషయాన్ని ఫోన్ ద్వారా పాటిమీద గుంపుగ్రామస్థులకు మృతుని బంధువు ఒకరు చేరవేశారు. దీంతో కోపోద్రిక్తులైన గ్రామస్థులు కట్టివేసిన వ్యక్తిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. దీంతో ఆ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ విషయాన్ని గ్రామస్థులు కారేపల్లి పోలీసులకు తెలియజేశారు. కారేపల్లి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పంచనామా నిర్వహించారు. తొలుత మృతి చెందిన బానోత్ రమేష్‌కు ఖమ్మం ప్రభుత్వాసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించగా, గ్రామస్థుల దాడిలో మృతి చెందిన వ్యక్తి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఇల్లందు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఇల్లెందు రూరల్ సిఐ సాయిబాబా, కారేపల్లి ఎస్‌ఐ ఆరిఫ్ ఆలీఖాన్ పంచనామా నిర్వహించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. బాణోత్ రమేష్ గతంలో గ్రామంలోని మూడు ద్వాలి అనే మహిళను కూడా చంపివేసినట్లు గ్రామస్తులు తెలిపారు. కారేపల్లి ఎస్‌ఐ మాట్లాడుతూ పోలీస్‌స్టేషన్‌లో ఇతనిపై మాజీ సర్పంచ్ ధరావత్ సైదులుపై దాడి, దాస్ అనే వ్యక్తిపై దాడి, అతని పెద్ద భార్య ద్వాలి చేయి కోసిన సంఘటనల్లో బానోత్ రమేష్ నిందితుడుగా ఉన్నాడని తెలిపారు.
రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
* రాష్ట్ర మంత్రి రాంరెడ్డివెంకటరెడ్డి
ఇల్లెందు, నవంబర్ 7: రైతాంగాన్ని కష్టకాలంలో ఆదుకుని వారి సంక్షేమం కోసం ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను రైతాంగం సద్వినియోగం చేసుకోవాలని ఉద్యనవనశాఖ రాష్ట్ర మంత్రి రాంరెడ్డివెంకటరెడ్డి అన్నారు. పోడుభూములను సాగుచేసుకుంటున్న రైతాంగానికి ఆరవవిడతగా పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని బుధవారం ఇల్లెందులో నిర్వహించారు. స్థానిక సింగరేణి వైసిఓఎ క్లబ్‌లో నియోజకవర్గ పరిధిలోని 1950మంది 3500ఎకరాలకు సంబంధించిన భూమి పట్టాలను అందించారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో రైతన్నలు క్షేమంగా ఉంటేనే రాష్ట్రం అభివృద్ధి పధంలో కొనసాగుతుందన్నారు. పేదరైతులకు భూమి పంపిణీ కార్యక్రమాన్ని దేశంలోనే తొలిసారిగా కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిందన్నారు. పోడుభూములు సాగుచేసుకుంటున్న రైతులకు భూమిపై పూర్తి హక్కును కల్పిస్తూ పట్టాలు అందించే విధానాన్ని అమలులోకి లేవడం వలన లక్షలాది మంది రైతన్నలు వ్యవసాయ భూములకు యజమానులు అయ్యామన్నారు. భూపంపిణీ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సిద్దార్ధజైన్, ఆర్డీఓ ధర్మారావు, వివిధ మండలాల తహశీల్ధార్లు, ఎంపిడిఓలు, వ్యవసాయ శాఖ అధికారులు పాల్గొన్నారు. కాగా ఇల్లెందుకు వచ్చిన మంత్రికి కాంగ్రెస్ పార్టీ నాయకులు మడత వెంకటగౌడ్ తదితరులు ఘనస్వాగతం పలికారు.
ట్రైకార్ వార్షిక ప్రణాళికపై కలెక్టర్ సమీక్ష
ఖమ్మం(మామిళ్ళగూడెం), నవంబర్ 7: ప్రస్తుత 2012-13 సంవత్సరానికి ట్రైకార్ కింద 22.29 కోట్ల రూపాయల అంచనాలతో 2748 మంది లబ్ధిదారులకు ప్రయోజనం చేకుర్చేందుకు 1814 యూనిట్లను మంజూరు చేయనున్నట్లు జిల్లా కలెక్టర్ సిద్ధార్ధ జైన్ తెలిపారు. బుధవారం జెడ్పీ హాల్లో నిర్వహించిన సమావేశంలో ట్రైకార్ వార్షిక ప్రణాళిక అమలు గుంరించి ఐటిడిఎ యూనిట్ అధికారులు, బ్యాంకర్సు, ఎంపిడివోలతో ఆయన చర్చించారు. ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు దోహద పడే ఇన్‌కమ్ జనరేటింగ్ యూనిట్లను ప్రోత్సహించాలని సూచించారు. ఉత్పాదక పెంపుదల, విలువలను పెంచే ప్రోసెసింగ్ యూనిట్లను మంజూరు చేయాలన్నారు. యూనిట్లకు ఇస్తున్న సబ్సిడీ ప్రజాధనం అని ఆ డబ్బుతో వ్యవస్తాపరమైన అభివృద్ధి పనులు జరగాలని ఆయన అన్నారు. ట్రైకార్ లబ్ధిదారుల ఎంపికకు ఈ నెల 20 నుండి 27 వరకు గ్రామ సభలు నిర్వహించాలని ఆధికారులను ఆదేశించారు. సమావేశంలో ఎల్‌డిఎం శ్రీనివాస్, ఎస్‌మిహెచ్ ఎజిఎం కృష్ణమోహన్, నాబార్డ్ ఎజిఎం ప్రసాద్, డిఆర్‌డిఎ పిడి అజయ్‌కుమార్, ఐటిడిఎ ఎపివో శ్రీనివాసరావు, ఐటిడిఎ యూనిట్ అధికారులు, వివిద శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
నేడు జిల్లాలో
విజయమ్మ పర్యటన
ఖమ్మం(గాంధీచౌక్), జనవరి 7: జిల్లాలో నీలం తుఫాన్ వల్ల నష్టపోయిన రైతులను పరామర్శించేందుకు గురువారం వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ పర్యటించనున్నట్లు ఆ పార్టీ జిల్లా కన్వీనర్ పువ్వాడ అజయ్‌కుమార్ తెలిపారు. బుధవారం క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నీలం తుఫాన్ వల్ల నష్టపోయిన రైతులను ప్రభుత్వం పట్టించుకోవటం లేదని ఆరోపించారు. పంటనష్టపోయిన రైతులను పరామర్శించేందుకు గాను గురువారం ఆమె ఖమ్మంలో పర్యటించనున్నారన్నారు. పాలేరు, ఖమ్మం, వైరా, సత్తుపల్లి నియోజకవర్గాల్లో ఆమె నష్టపోయిన పంటపొలాలను పరిశీలించనున్నారని వెల్లడించారు. ప్రజలు, పార్టీ కార్యకర్తలు పర్యటనను విజయవంతం చేయాలని కోరారు.
యాత్రతో ఉత్సాహం
* లక్ష్యం చేరుకుంటాం - పోతినేని
ఆంధ్రభూమి బ్యూరో
ఖమ్మం, నవంబర్ 7: సిపిఎం జిల్లా కమిటీ చేపట్టిన సాగునీటి మహాపాదయాత్ర ఆ పార్టీ కార్యకర్తల్లో నూతనోత్సహాన్ని కల్పిస్తోంది. గత ఎన్నికల నాటి నుంచి పార్టీ కార్యకర్తల్లో ఉన్న స్తబ్ధతను ఈ యాత్ర పొగొట్టింది. ప్రధానంగా యాత్రలో పాల్గొనే కార్యకర్తల సంఖ్య మొదట్లో నాయకులు వెయ్యి మందిగా అంచనా వేయగా, ప్రస్తుతం అది 1300కు చేరుకుంది. మరో వైపు ఆయా గ్రామాల గుండా యాత్ర వస్తున్న సమయంలో ప్రజల నుంచి వస్తున్న స్పందనను చూసి సిపిఎం నాయకత్వం ఆనందం వ్యక్తం చేస్తోంది. సాగునీటి కోసం చేపట్టిన ఈ యాత్రలో ఇతర సమస్యలు కూడా వారి దృష్టికి వస్తుండటం విశేషం. ప్రధానంగా నాగార్జున సాగర్ ఆయకట్టులో పాదయాత్ర జరుగుతున్న సమయంలో ఆయా ప్రాంతాల్లోని రైతాంగం నుంచి వస్తున్న స్పందనకు ఉబ్బితబ్బిబ్బవుతున్నారు. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీలు ప్రభుత్వం తమ సమస్యలను పట్టించుకోవటం లేదని, గతంలో దళిత సమస్యలపై సిపిఎం చేసిన ఉద్యమం ఫలితంగా కొన్ని సమస్యలు పరిష్కారమైనా ప్రభుత్వ మాత్రం తమ పట్ల సవతితల్లి ప్రేమ చూపిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా పాదయాత్ర గత నెల 28న దుమ్ముగూడెంలో ప్రారంభం కాగా, పార్టీలకతీతంగా అందరూ సంఘీభావం ప్రకటిస్తుండటం విశేషం. అనేక చోట్ల అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు కూడా పాల్గొని జిల్లాకు లాభం చేకూర్చే సమస్యపై ఉద్యమం చేస్తున్నందుకే తాము మద్దతు ప్రకటిస్తున్నామని చెప్పటం గమనార్హం. అంతేగాకుండా తెలుగుదేశం, సిపిఐ, సిపిఐ (ఎంఎల్)న్యూడెమోక్రసీ, లోక్‌సత్తా తదితర పార్టీలే కాకుండా అనేక ప్రజా సంఘాలు కూడా సంఘీభావం ప్రకటిస్తున్నాయి. బుధవారం ఎన్‌ఆర్‌ఐ పేరెంట్స్ అసోసియేషన్, కొంతమంది డాక్టర్లు, లాయర్లు, పట్టణంలోని ప్రముఖులు సంఘీభావం ప్రకటించారు.
లక్ష్యం కోసం అలుపెరగని పోరాటం
* పోతినేని సుదర్శన్
తాము ప్రజల కోసమే ఈ ఉద్యమాన్ని చేపడుతున్నామని, తాము అనుకున్న లక్ష్యాన్ని చేరేంతవరకు ఉద్యమం ఆపమన్నారు. గతంలో దుమ్ముగూడెం ప్రాజెక్టు సాధన కోసం తమ నాయకుడు తమ్మినేని వీరభద్రం జిల్లా వ్యాప్తంగా 2600కిలోమీటర్లు వంద రోజుల పాటు పాదయాత్ర చేశారని, తద్వారా ప్రాజెక్టుకు శంకుస్థాపన జరిగిందన్నారు. ఇప్పుడు ఆ ప్రాజెక్టును వెంటనేపూర్తి చేయటంతో పాటు జిల్లాలో పెండింగ్‌లో ఉన్న అన్ని ప్రాజెక్టులకు నిధులను కేటాయించి ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. యాత్రలో ఇప్పటికీ 200కిలోమీటర్లు పూర్తయిందని, ప్రజల నుంచి వస్తున్న స్పందన అద్వితీయమన్నారు. యాత్రలో ఒకరిద్దరు అస్వస్థతకు లోనైనా ఎటువంటి ఇబ్బందులు తలెత్తటం లేదన్నారు. ప్రజల నుంచి ఆయా గ్రామాల్లో వస్తున్న ఆదరణ అమోఘమని, ప్రజలు తమ సమస్యలపై తమకు విన్నవించుకుంటున్నారని, ఈ క్రమంలో అనేక గ్రామాల్లోని ప్రజలు తమ గ్రామంలో ఎక్కువ సేపు ఉండాలని వత్తిడి తెస్తున్న కారణంగా ప్రతిరోజు యాత్ర కొంత ఆలస్యంగా ముగుస్తుందన్నారు. అయినప్పటికీ ఈ నెల 10వ తేదీ వరకు తాము అనుకున్న విధంగానే యాత్ర చేపడతామని, ఆ రోజు జరిగే బహిరంగ సభలో తమ పార్టీ అగ్రనేతలు సీతారాం ఏచూరి, బివి రాఘవులు, తమ్మినేని వీరభద్రం పాల్గొంటున్నారని తెలిపారు. అయితే ఈ సమస్యను ఈ యాత్ర పూర్తయిన తర్వాత ప్రభుత్వం నుంచి వచ్చే స్పందనను బట్టి ఉద్యమప్రణాళికను రచిస్తామన్నారు. ప్రస్తుతం ప్రతి రోజు 1300మంది వరకు పాదయాత్రలో పాల్గొంటున్నారని, ఆయా మండలాలు, గ్రామాల్లో మరో 2వేల మంది నిత్యం యాత్రలో ఉంటున్నారన్నారు. ఎన్ని కష్టాలు ఎదురైనా యాత్రలో పాల్గొంటున్న పార్టీ కార్యకర్తలకు ఆయన అభినందనలు తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం సిపిఎం అలుపెరగని పోరాటాలు చేస్తున్నందుకు ఈ యాత్రే నిదర్శనమన్నారు.
ఎండలోనే సదరన్ క్యాంపు
* సొమ్మసిల్లిన వికలాంగులు
* కనీస సౌకర్యాలూ లేని వైనం
చర్ల, నవంబర్ 7: అధికారులు, రాజకీయ నేతలు వస్తే ఎక్కడా లేని హంగామా చేస్తారు చర్ల మండల అధికారులు. అదే ఏదైనా ప్రైవేటు కార్యక్రమం జరిగినా వారు వద్దన్నా మరీ ఎగబడి మరీ వారికి ఏర్పాట్లు చేస్తారు. అదే మండల కేంద్రానికి ఎమ్మెల్యే, సబ్ కలెక్టర్ వస్తే వారి మెప్పు కోసం పడరాని పాట్లు పడుతుంటారు. కాగా వికలాంగులకు ఏడాదికోమారు నిర్వహించే సదరన్ క్యాంపునకు మాత్రం అధికారులు ఏ మాత్రం ఏర్పాట్లు చేయకపోవడం శోచనీయం. కనీసం వికలాంగులకు దరఖాస్త్ఫురాలు, మంచినీరు, టెంట్లు కూడా ఏర్పాటు చేయకపోవడం అధికారుల పనితీరుకు అద్దం పడుతోంది. చర్ల మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రి ఆవరణలో వికలాంగుల డిమాండ్ మేరకు సదరన్ క్యాంపు ఏర్పాటు చేశారు. ఈ క్యాంపుకు చర్ల, దుమ్ముగూడెం, వెంకటాపురం, వాజేడు తదితర మండలాల నుంచి వికలాంగులు హాజరయ్యారు. వారంతా అధికారుల రాక కోసం ఎండలోనే నిరీక్షించి సొమ్మసిల్లి పడిపోయారు. వాజేడు నుంచి వచ్చిన ఓ వికలాంగురాలు మంచినీరు అందక సొమ్మసిల్లింది. అనంతరం ఎండలోనే ఏర్పాటు చేసిన కౌంటర్ల వద్ద పేర్లు నమోదు చేయించుకుని వైద్యుల వద్ద పరీక్షలు చేయించుకున్నారు. ఈ తరుణంలో భద్రాచలం ఎమ్మెల్యే కుంజా సత్యవతి అక్కడకు రావడంతో వారంతా సమస్యలను ఏకరవుపెట్టారు. ఇందుకు స్పందించిన ఆమె వెంటనే అధికారులను ఆదేశించి ఏర్పాట్లు చేయించారు. ఇదిలా ఉండగా ఇంత సేపు కనీస ఏర్పాట్లు చేయాలని అధికారులను అడిగినా ఏ ఒక్కరూ స్పందించలేరని మీరు రాకుంటే మా పరిస్థితి ఎండలో మాడాల్సిందేనని ఆవేదన వ్యక్తం చేశారు. వికలాంగులందరికీ సర్ట్ఫికెట్లు, బస్‌పాస్‌లు వచ్చేలా చూడాలని అధికారులను ఆమె ఆదేశించారు. దీంతో భద్రాచలం ఆర్టీసి అధికారులు వారికి పాస్‌లు అందించారు. ఈ సదరన్ క్యాంపుకు నాలుగు మండలాల నుంచి 450 మంది వికలాంగులు హాజరయ్యారు. ఈ క్యాంపులో అడిషనల్ డిఎంఅండ్‌హెచ్‌ఓ మోహన్‌రావు, భ్రమరాజు, వెంకట నర్సయ్య, విజయరావు, వెంకటయ్య, ప్రసాద్, రవికుమార్, ఐకెపి పీఎం వసంత సేన, కో ఆర్డినేటర్ శ్రీనివాస్, నాయకులు మచ్చా వీర్రాజు, సురేష్, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.
రోడ్డు ప్రమాదంలో మెడికో మృతి
మధిర, నవంబర్ 7: మండల పరిధిలోని ఆత్కూరు క్రాస్‌రోడ్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మధిర ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న డాక్టర్ రవికిషోర్ కుమారుడు వేర్పుల రోహన్‌కిషోర్(24) మృతిచెందిన సంఘటన మంగళవారం అర్థరాత్రి చోటుచేసుకుంది. కిషోర్ విజయనగరంలోని మహారాజ మెడికల్ కళాశాలలో వైద్య విద్య ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. దసరా సెలవలకు మధిర వచ్చాడు. తన స్నేహితులతో కలిసి మధిర నుండి ఖమ్మం వైపు వెళ్తుండగా ఆత్కూరు క్రాస్‌రోడ్డు మూలమలుపు వద్ద ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి లారీని ఢీకొట్టటంతో కిషోర్‌కు తీవ్రగాయాలు, స్నేహితులకు స్వల్ప గాయాలయ్యాయి. 108 ద్వారా మధిర ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రధమ చికిత్స జరిపి విజయవాడ తరలిస్తుండగా మర్గమధ్యలో రోహన్‌కిషోర్ మృతి చెందాడు. కిషోర్ మరో నాలుగు నెలలలో వైద్య విద్యను ముగుంచుకొని హౌస్ సర్జన్‌కు వెళ్ళాల్సి ఉండగా రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో కుటుంబ సభ్యులు కన్నీరు, మున్నీరుగా విలపిస్తుండం స్థానికులను కలసి వేచింది.
రైతు ప్రాణం తీసిన అప్పులు
ఇల్లెందు, నవంబర్ 7: ఒకవైపు తెచ్చిన అప్పులు తీర్చలేకపోవడం మరోవైపు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు లేకపోవడంతో పాటు అకాల వర్షాల వలన చేతికి అందిన పంటలు నీట మునగడంతో రైతులు తీవ్ర మనసిక వేదనకు గురయ్యారు. ఆకోవలోనే అధికంగా ఉన్న అప్పులు తీర్చలేక ఎట్టి కోటయ్య (42) అనే రైతు బుధవారం పురుగులమందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. మండల పరిధిలోని రాగబోయినగూడెం పంచాయితీ గోపాలపురం గ్రామానికి చెందిన కోటయ్య 7ఎకరాలలో పత్తి పంట వేశాడు. చేతికి అందిన పంట వర్షాల వలన దెబ్బతినడంతో మూడులక్షలకు పైగా ఉన్న అప్పులను తీర్చలేడని మనోవేదనకు గురై ఆత్మహత్య చేసుకున్నాడని గ్రామస్థులు పేర్కొంటున్నారు. ఏడాది క్రితం భార్య అనారోగ్యంతో మృతిచెందింది. ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమారైలు ఉన్నారు.
ఇద్దరు మావోయిస్టు మిలీషియా సభ్యుల అరెస్టు
భద్రాచలం, నవంబర్ 7: భద్రాచలం డివిజన్ చింతూరు మండలం ఏడుగురాళ్లపల్లి వద్ద మడకం నారాయణ, పొడియం సోముడు అనే ఇద్దరు మావోయిస్టు మిలీషియా సభ్యులను అరెస్టు చేసినట్లు ఎఎస్పీ డా.గజరావ్ భూపాల్ బుధవారం తెలిపారు. ఏడుగురాళ్లపల్లి వద్ద ఎస్‌ఐ, సిబ్బంది, సిఆర్పీఎఫ్ పోలీసులు వాహనాలు తనిఖీలు చేస్తుండగా అనుమానం వచ్చిన వీరిని అదుపులోకి తీసుకుని విచారించగా వివరాలు వెల్లడించారని చెప్పారు. పలు సంఘటనల్లో వీరు పాల్గొన్నారని, వారి వద్ద నుంచి బర్మాల్ తుపాకీని స్వాధీనం చేసుకుని కోర్టుకు రిమాండ్ చేశామని పేర్కొన్నారు.
ధ్యానంతోనే ప్రపంచ శాంతి
* జగద్గురు బ్రహ్మర్షి సుభాష్‌పత్రి
చింతకాని, నవంబర్ 7: ధ్యానంతోనే ప్రపంచ శాంతి వర్ధిల్లుతుందని జగద్గురు బ్రహ్మర్షి సుభాష్‌పత్రి అన్నారు. బుధవారం మండల పరిధిలోని నాగులవంచ గ్రామంలో ఆంధ్రప్రదేశ్ గృహ నిర్మాణ సంస్థ, పిరమిడ్ సొసైటీ మూవ్‌మెంట్ వారు సంయుక్తంగా నిర్మించిన మైత్రేయి బుద్ధ పిరమిడ్ గృహ సముదాయాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడుతూ ధ్యానంతో మానసిక ప్రశాంతత పొందవచ్చని, ప్రపంచ శాంతిని ఏర్పర్చవచ్చన్నారు. పిరమిడ్ కేంద్రాలలో ధ్యానం చేయడం వలన ఎన్నో ఉపయోగాలు ఉన్నాయని ఆయన అన్నారు. ఒకే గ్రామంలో 40 పిరమిడ్ గృహ సముదాయాలు నిర్మించడం రాష్ట్రంలో ఇదే ప్రధమమని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎంపిడివో విద్యాచందన, గృహనిర్మాణశాఖ ఏఇ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
సోనియా ఇంటి చూరుపట్టుకుని వేలాడితే తెలంగాణ రాదు
కొత్తగూడెం, నవంబర్ 7: సోనియా ఇంటి చూరు పట్టుకుని వేలాడితే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం రాదని, ఉద్యమాన్ని బలోపేతం చేస్తూ రాజకీయాలకు అతీతంగా పోరుచేసినప్పుడే తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుందని ఎమ్మెల్సీ, తెలంగాణ యునైటెడ్ ఫ్రెంట్ అధ్యక్షుడు కపిలవాయి దిలీప్‌కుమార్ అన్నారు. తెలంగాణ రాష్ట్రీయ లోక్‌దళ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రథయాత్రకు మద్దతు తెలుపుతూ కొత్తగూడెంలో పాల్గొన్న సందర్భంగా ఆయన స్థానిక వివేకవర్ధని హైస్కూల్‌లో బుధవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మెడలు వంచి తెలంగాణను సాధించుకునే దిశగా ఐక్యంగా ఉద్యమించాలని కోరారు. స్థానికసంస్థల ఎన్నికలలో సమైఖ్యాంధ్ర నినాదం చేసే పార్టీలకు కనీసం సర్పంచ్ పదవి కూడా రాకుండా మట్టి కల్పించారని పిలుపునిచ్చారు. తెలంగాణపై కపట నాటకాలు వేసే పార్టీలను చిత్తుగా ఓడించాలని కోరారు. ఇదిగో తెలంగాణ వస్తుందని ఢిల్లీ పర్యటన అనంతరం కేసిఆర్ చేసిన ప్రకటనలు నీటి మూటలుగా మిగిలాయే తప్ప తెలంగాణపై కేంద్రం నుండి ఎలాంటి స్పందన రాలేదన్నారు. కార్యనిర్వాహక అధ్యక్షులు ఎండి రియాజ్, టిఆర్‌ఎల్‌డి రాష్ట్ర అధ్యక్షురాలు రేగళ్ళపాటి రమ్య, ఉపాధ్యక్షులు పసుపులేటి నాచరయ్య, అధికార ప్రతినిధి ఎస్‌కె బేగం, స్నేహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
పురుగు మందు తాగి యువకుడి ఆత్మహత్యా యత్నం
కామేపల్లి, నవంబర్ 7: మండలంలోని పింజరమడుగు గ్రామపంచాయతిలోని సూర్యాతండాకు చెందిన యువకుడు పురుగు మందు తాగి ఆత్మహత్యా యత్నానికి పాల్పడిన సంఘటన బుధవారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం సూర్యాతండాకు చెందిన గుగలోత్ మధన్ అనే యువకుడు కుటుంబ కలహాల నేపథ్యంలో పురుగు మందు తాగడంతో స్థానికులు గుర్తించి 108 ఆంబులెన్స్ ద్వారా వైద్య నిమిత్తం ఖమ్మం తరలించారు.
ఆక్రమించుకున్న భూమి ఇప్పించాలని మంత్రికి వినతి
ఖమ్మం రూరల్, నవంబర్ 7: తమ ఆధీనంలో ఉన్న భూమిని వేరే వ్యక్తులు పట్టా చేయించుకొని ఇబ్బందులకు గురి చేస్తున్నారని వాల్యాతండాకు చెందిన ఇద్దరు కుటుంబీకులు రాష్ట్ర ఉద్యానవన శాఖామంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డికి బుధవారం విన్నవించుకున్నారు. సర్వే నెం.477, 410లలో పొజిషన్‌లో కూసు వెంకటేశ్వర్లు, చెన్నాల శ్రీనివాస్‌యాదవ్‌లు ఉన్నారు. వారికి తెలియకుండానే సదరు భూమికి పక్కనే ఉన్న ఇతర రైతులు బాధిత రైతులకు తెలియకుండా పట్టా చేయించుకొని తమకు భూమిలేదని బెదిరిస్తున్నారని మంత్రికి విన్నవించి కన్నీరు పెట్టుకున్నారు. ఇదే సందర్భంలో చెన్నాల శ్రీనివాస్‌యాదవ్ తనకు జరుగుతున్న అన్యాయాన్ని తట్టుకోలేక మంత్రి డౌన్‌డౌన్ అంటూ నినాదాలు చేశారు. ఆతరువాత మంత్రి చేతులెత్తి దండం పెట్టి తన సమస్యను పరిష్కరించాలని వేడుకున్నారు. దీంతో మంత్రి స్పందించి వారి సమస్యలను వెంటనే పరిష్కరించాలని తహశీల్దార్ కిశోర్‌కుమార్‌ను ఆదేశించారు.