భారతీయ జనతాపార్టీ ఇప్పుడు వ్యూహాత్మక సంక్షోభంలో చిక్కి ఉక్కిరిబిక్కిరి అవుతోంది. బయటనుంచి ‘అవినీతి’ దాడులు, అంతర్గతంగా కుమ్ములాటలు- ఈ వ్యూహాత్మక గందరగోళానికి ప్రధాన కారణం! అవినీతికి వ్యతిరేకంగా ఉధృతవౌతున్న ఉద్యమాన్ని ఎంతవరకు సమర్థించాలన్న విషయమై ‘్భజపా’ విధానంలో స్పష్టత ఏర్పడకపోవడానికి ప్రధాన కారణం పార్టీ అధ్యక్షుడు నితిన్ గడ్కరీ! ఆయనకు వ్యతిరేకంగా ‘అవినీతి వ్యతిరేక భారత్’ -ఇఏసి- నాయకుడు అరవింద్ కేజరీవాల్ సంధించిన ఆరోపణలు సృష్టించిన ప్రకంపనలు ఇప్పటికీ సద్దుమణగకపోవడం సంక్షోభం తీవ్రతరవౌతోందన్న దానికి సాక్ష్యం! 2014 లోక్‌సభ ఎన్నికల సందర్భంగా పార్టీ తరపున ప్రధానమంత్రి అభ్యర్థి ఎవరన్నదానిపై స్పష్టత ఏర్పడకపోవడం పార్టీని కుదేలుమనిపిస్తున్న మరో వైపరీత్యం. ఈ రెండు అంశాలు కేంద్రంగా రాజుకున్న అలజడి తొలగేవరకు పార్టీ ప్రస్థాన క్రమం పునరారంభం కావడం దాదాపు అసాధ్యం. గత వర్షాకాల సమావేశాల సందర్భంగా బొగ్గు బొరియలలో పుట్టుకొచ్చిన అవినీతి గురించి భూన భోంతరాళాను దద్దరిల్ల జేసిన భాజపా, సమావేశాలు ముగిసిన తరువాత ఆదే అంశంపై దేశ వ్యాప్త ఉద్యమం ఎందుకని చేపట్టలేదు? బొగ్గు బొరియల కేటాయింపులో ‘అక్రమాలకు పాలుపడడం ద్వారా దేశానికి లక్షా ఎనబయి ఆరుకోట్ల రూపాయల నష్టం వాటిల్ల జేసిన ప్రధాన మంత్రి మన్‌మోహన్ సింగ్ పదవికి రాజీనామా చేసే వరకు చట్ట సభలను సాగనివ్వబోమని ‘్భష్మించిన’ భాజపావారు ఇప్పుడు ఆ ఊసెత్తుకోవడం లేదు. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ముగిసిన వెంటనే ప్రభుత్వం వారు చిల్లర వ్యాపారంలోకి ‘విదేశీ ప్రత్యక్ష నిధుల’-ఎఫ్‌డిఐ-ను అనుమతిస్తున్నట్టు ప్రకటించారు. ఫలితంగా ప్రజల దృష్టిని ‘బొగ్గు బొరియల’లో భగ్గుమన్న అవినీతివైపు నుంచి మళ్ళించడంలో ప్రభుత్వం వ్యూహాత్మక విజయం సాధించింది. ప్రధాన జాతీయ ప్రతిపక్షం వారు సైతం ‘మన్‌మోహన్ సింగ్ రాజీనామా’ కోర్కెను మరచిపోయి చిల్లర ‘ఎఫ్‌డిఐ’ని వ్యతిరేకిస్తున్నట్టు ఆర్భాటించింది. అయితే చిల్లర ఎఫ్‌డిఐకి వ్యతిరేకంగా కూడ భాజపా దేశవ్యాప్తంగా భారీ ఎత్తున ఆందోళనకు దిగినట్టు వార్తలు లేవు. కథనాలు లేవు. ఆ ఛాయ లేదు. కనీసం చర్చా గోష్ఠులు, మేధోమధనాలు జరుగుతున్న జాడ లేదు. దృశ్య మాధ్యమాలలో సైతం భాజపా వారు ‘ఎఫ్‌డిఐ’ని వ్యతిరేకిస్తున్న దృశ్యాలు లేవు! ‘వాల్‌మార్ట్’ దుకాణాలు తెరవకుండా ఎక్కడికక్కడ అడ్డుకుంటామని భాజపా లోక్‌సభా నాయకురాలు గత ఏడాది నవంబర్‌లోనే బీషణ ప్రతిజ్ఞ చేశారు. అప్పటి ప్రతిజ్ఞ ఇప్పుడు వర్తించదా? హైదరాబాద్‌తో సహా అన్ని నగరాలలోను గత నెల ఆరంభం నాటికే -ప్రభుత్వం అనుమతించిన తరువాత పదిహేను రోజుల గడువుకు ముందే- విదేశీ సంస్థల చిల్లర దుకాణాలు వెలిశాయి. అవినీతి గురించి ఎఫ్‌డిఐ గురించి భాజపా పెద్ద ఎత్తున ఉద్యమాలు మొదలు పెట్టలేకపోవడానికి కారణం వ్యూహాత్మక సంక్షోభం. నితిన్ గడ్కరీ అధ్యక్ష పదవినుంచి తప్పుకోవాలన్న ఆకాంక్షలు సంస్థాగత అనుశాసన పరిధిని దాటి బహిరంగ వేదికలపై ప్రతిధ్వనిస్తుండడం ఒక సంక్షోభ సూచకం మాత్రమే. ఇలా వీధిన పడి అధ్యక్షుడిని వెక్కిరిస్తున్న వారిపై చర్యలు తీసుకోకపోవడానికి కారణం అధిష్ఠానం అయోమయ స్థితిలో అలమటిస్తుండడం!
అరవింద కేజరీవాల్ బృందం వారు కాంగ్రెస్ అధ్యక్షురాలి అల్లునికి వ్యతిరేకంగాను, కేంద్ర మంత్రులకు వ్యతిరేకంగాను, కాంగ్రెస్ ప్రాంతీయ నాయకులకు వ్యతిరేకంగాను అవినీతి ఆరోపణలు చేసినన్నాళ్ళు భాజపావారు వాటి గురించి గొప్పగా ప్రచారం చేశారు. కానీ గడ్కరీ కుటుంబం వారి ‘పూర్తి’ సంస్థకు వ్యతిరేకంగా అవినీతి విస్ఫోటనాలు ఆరంభమయ్యేసరికి భాజపా మాట మార్చింది. ‘ఇఏసి’ వారు ప్రామాణికతను కోల్పోయారని, స్వార్థపరుల తొత్తులుగా మారిపోయారని ‘్భజపా’ విమర్శించింది. గడ్కరీపై వచ్చిన ఆరోపణలు నిజమా కాదా అన్నది వేరే సంగతి. కానీ భాజపా వారు అంతవరకు తాము నెత్తికెత్తుకొని ఉండిన ‘ఇఏసి’ని నడి బజారులో నేలకేసి కొట్టినట్టు ప్రయత్నించడమే వారి వ్యూహాత్మకమైన, సైద్ధాంతికమైన దివాళాకోరుతనానికి నిదర్శనం. ఈ ద్వంద్వ ప్రమాణాలు పాటించడానికి కారణం అంతర్గతమైన కుమ్ములాట.. గడ్కరీ గతంలో లాల్ కృష్ణ అద్వానీ వలె పదవిని పరిత్యజించి ఉంటే ఆయన ప్రతిష్ఠతో పాటు పార్టీకి ప్రజలలో పలుకుబడి పెరిగి ఉండేది. అలా జరగక పోవడానికి కారణం గడ్కరీ తప్పుకున్నట్టయితే మళ్ళీ అద్వానీకి పట్టం కట్టవలసి వస్తుందన్న ఒక వర్గం భయం. ఈ భయం కేవలం భయం కాదు. ‘నేను సిద్ధంగానే ఉన్నాను...’ అన్న రీతిలో అద్వానీ ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రకటనలు చేస్తూనే ఉన్నాడు. అవినీతి ఆరోపణలకు గురి అయిన గడ్కరీ పదవి నుంచి తప్పుకుంటే మిన్నులేమీ విరిగి మీద పడవు. కానీ ఆయనను తప్పించిన తరువాత ఏమిటన్నది కాని, ఎవరన్నది కాని తేలక పోవడం సంక్షోభానికి ప్రతీక. గడ్కరీని కొనసాగించాలన్న నిర్ణయం తీసుకున్న అధినాయక సమావేశానికి అద్వానీ రాకపోవడానికి ఈ అంతర్గత సంక్షోభమే నేపథ్యం!
ఇప్పుడు మళ్ళీ కేజరీవాల్ బృందాన్ని భాజపావారు మెచ్చుకుంటున్నారు. స్విట్జర్లాండు బ్యాంకులలోను ఇతర దేశాల బ్యాంకులలోను ‘లెక్కలకెక్కని’ డబ్బు దాచిన ఘరానాలను కేజరీవాల్ శుక్రవారం బయట పెట్టడాన్ని భాజపావారు హర్షిస్తున్నారు. ‘మేము ముందే ఇదంతా చెప్పాము’ అని కూడ మరో అడుగు ముందుకేశారు. అలాంటప్పుడు ఒక్క గడ్కరీ అవినీతి మాత్రమే విశ్వసనీయం కాకుండా ఎందుకు పోవాలి? ‘ఇఏసి’ ప్రామాణికతను ధృవీకరించినట్టయితే గడ్కరీపై కూడ దర్యాప్తు జరపాలన్న కోర్కెను అంగీకరించాలి. అప్పుడు ఆయనను తక్షణం పదవినుంచి తప్పించాలి. నిందితులందరూ నేరస్థులు కాకపోచ్చునన్న సూత్రం ఉండనే ఉంది. అందువల్ల గడ్కరీని తప్పించవచ్చు. ఆయన నిర్దోషి అని ఋజువు కూడ చేయవచ్చు. అద్వానీ వంటివారు తప్పుకున్నప్పటికీ పార్టీ ప్రస్థాన ప్రగతి ఆగదంటూ, వ్యక్తులకు కాక సిద్ధాంతాలకు ప్రాధాన్యం ఇచ్చిన వారికి ఇప్పుడా స్పృహ లేకపోవడం ఏమిటి? సంస్థలో జరుగుతన్న ఆధిపత్య సమరం అధినాయకుల బుద్ధిని ఈ స్పృహకు దూరం చేసింది. అద్వానీ మళ్ళీ ప్రధానమంత్రి పదవి కోసం ముస్తాబవుతాడేమో? నిరోధించడంలో కొందరు, రంగం సిద్ధం చేయడంలో మరికొందరు నిమగ్నమై ఉన్నారు. అందువల్ల అవినీతి, ఎఫ్‌డిఐ, ఆహార భద్రత, భూసేకరణ చట్టం- ఇలాంటి ఏ సమస్య గురించి గాని కలిసికట్టుగా ఆలోచించి నిర్ణయించాలన్న బుద్ధికి అధినాయకత్వం దూరమైపోయింది. ‘ఇఏసి’ వారి ప్రామాణికతను ఒకవేళ అంగీకరించకపోతే కాంగ్రెస్ నేతలకు, వాణిజ్య వేత్తలకు వ్యతిరేకంగా వచ్చిన ఆరోపణలు కూడ చెల్లవని భాజపా చెప్పవలసి ఉంది. గడ్కరీని తప్పించాలా? అనివీతి గ్రస్త రాజకీయ ప్రత్యర్థులు పదవులకు రాజీనామా చేయాలన్న కోర్కెను రద్దు చేసుకోవాలా? తేల్చుకోలేని ‘్భజపా’ జనానికి ఏం చెబుతుంది?
భారతీయ జనతాపార్టీ ఇప్పుడు వ్యూహాత్మక సంక్షోభంలో చిక్కి ఉక్కిరిబిక్కిరి అవుతోంది.
english title:
kamalam
Date:
Monday, November 12, 2012