Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

గెలిపించలేకపోతున్న ఒబామా

$
0
0

అమెరికాలో పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థ ఉండినట్టయితే అధ్యక్షుడు బరాక్ ఓబామా నాయకత్వంలోని డెమోక్రాటిక్ పార్టీకాక, ప్రత్యర్థి రిపబ్లికన్ పార్టీ ఇప్పుడు ప్రభుత్వాన్ని ఏర్పరిచి ఉండేది. ఇటీవల ముగిసిన ఎన్నికలలో అమెరికా కాంగ్రెస్-పార్లమెంటు లోని దిగువ సభ-ప్రతినిధులసభ-లో రిపబ్లికన్ పార్టీకి 239 స్థానాలు లభించాయి. డెమొక్రాటిక్ పార్టీకి 191 స్థానాలు దక్కడం అధ్యక్ష పదవికి రెండవసారి ఎన్నికైన ఒబామాకు వ్యూహాత్మక పరాజయం వంటిది! అధ్యక్ష ప్రజాస్వామ్య రాజ్యాంగ వ్యవస్థ పరిఢవిల్లుతున్న అమెరికాలో ప్రభుత్వపు మనుగడకు ‘కాంగ్రెస్’లోని పార్టీల బలాలతో సంబం దం లేదు. అంతేకాదు ఒక పార్టీకి చెందిన సభ్యులందరు ఒక బిల్లుపై కాని, ఒక అంశంపై కాని ఒకే విధంగా ఓట్లు వేయడంలేదు. పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో వలె ప్రభుత్వ పక్షానికి చెందిన సభ్యులు ప్రభుత్వాన్ని విధిగా సమర్ధించవలసిన పనిలేదు. ‘విప్’లను జారీ చేయడం ఉల్లంఘించిన వారిని ‘్ఫరాయింపుల చట్టం’ కింద శిక్షించడం వంటి పార్లమెంటరీ ప్రజాస్వామ్య ప్రహసనాలు లేదా వైపరీత్యాలు అధ్యక్ష పాలన ఉన్న అమెరికాలో లేవు. ప్రభుత్వం కాని, శాసన నిర్మాణ విభాగంకాని ప్రత్యక్షంగా ప్రజలకు మాత్రమే బాధ్యత వహిస్తున్నాయి. ప్రభుత్వం పార్లమెంటునకు బాధ్యత వహించడం కాని, బాధ్యత వహించడం పేరుతో పార్లమెంటు పని తీరును నియంత్రించడం కాని అధ్యక్ష వ్యవస్థలకు తెలియని విషయం. అలాంటి అధ్యక్ష ప్రజాస్వామ్య వ్యవస్థకు అద్దం అమెరికా! కానీ నాలుగేళ్లు పదవిలో ఉన్న అధ్యక్షుని ప్రభావం ఆయన పార్టీకి చెందిన పార్లమెంటరీ-కాంగ్రెస్-అభ్యర్థుల జయాపజయాలను ప్రభావితం చేయడం సహజం. ఒబామా అలా ‘కాంగ్రెస్’ ఉభయ సభల ఎన్నికలలో దేనినీ ప్రభావితం చేయలేకపోవడం వ్యక్తిగత పరాజయం కాకపోవచ్చు. కానీ విధాన వైఫల్యానికి నిదర్శనం. 435 స్థానాలున్న దిగువ సభలో ఒబామా పార్టీ ‘మెజారిటీ’ని సాధించలేకపోయింది!
ప్రతినిధుల సభ ప్రాధాన్యం
అమెరికాలో అధ్యక్ష పదవి తరువాత అత్యంత ప్రతిష్ఠాత్మక స్థానం ప్రతినిధుల సభ ‘స్పీకర్’ పదవి. పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థలలో ‘స్పీకర్’ రాజకీయ పార్టీలలో సభ్యుడుగా ఉండడు. కానీ అమెరికా అధ్యక్ష ప్రజాస్వామ్యంలో అధ్యక్షునితోపాటు ప్రతినిధుల సభ అధ్యక్షుడు కూడా క్రియాశీల రాజకీయాలలో పాల్గొనడం మాత్రమే కాదు తమ పార్టీకి నాయకత్వం వహిస్తున్నాడు. అధ్యక్షుని ప్రత్యర్థి పార్టీకి నిజమైన నాయకులు ప్రతినిధుల సభలోను, ఎగువ సభ సెనెట్‌లోను ఆయా పార్టీల నాయకులు! మెజారిటీ ఉన్న పార్టీ నాయకుడు ప్రతినిధుల సభ స్పీకర్ కాగలుగుతున్నాడు, శాసన నిర్మాణంలో మాత్రమే కాక పార్టీ సభ్యుల పనితీరును కూడ ప్రభావితం చేయగలుగుతున్నాడు! ప్రతినిధుల సభలో మెజారిటీ పార్టీకి చెందిన వారే దేశాధ్యక్షులుగా ఎన్నికయిన సమయంలో పార్టీలో అధ్యక్షుడు అత్యున్నత అధికారి. అలా కాని సమయంలో-ప్రతినిధుల సభలో మైనారిటీ పార్టీవారు అధ్యక్షులుగా ఉన్నప్పుడు-స్పీకర్‌లు తమ రాజకీయ పార్టీలో అత్యంత ప్రభావ వంతులు కాగలుగుతున్నారు. వివిధ బిల్లులను రూపొందించడంలోను ఆమోదించడంలో ఇలా స్పీకర్లు దిశా నిర్దేశనం చేయగలుగుతున్నారు. అందువల్ల వచ్చే రెండేళ్లపాటు కూడ ఒబామాకు వ్యతిరేకంగానే ఈ దిశానిర్దేశనం జరగవచ్చు!! నిజానికి గత రెండేళ్లుగా కూడ ఒబామాకు ప్రతినిధుల సభలో విధాన వ్యతిరేకత ఎదురవుతోంది. 2006 నాటి ఎన్నికలలో ప్రతినిధుల సభలో మెజారిటీని సాధించిన డెమొక్రాటిక్ పార్టీ 2008 లో దాన్ని నిలబెట్టుకుంది. ప్రతినిధుల సభ పదవీకాలం రెండేళ్లు మాత్రమే. క్రీస్తుశకం 1789లో తొలి ప్రతినిధుల సభ ఏర్పడింది.ఇప్పుడు ఎన్నికైనది 113వ ప్రతినిధుల సభ. 2006లో డెమొక్రాటిక్ పార్టీ ప్రతినిధుల సభలో మెజారిటీని సాధించడం 2008లో ఒబామా అధ్యక్ష పదవికి ఎన్నిక కావడానికి నేపథ్యంగా నిలిచింది. రెండేళ్లలో ఒబామా పనితీరుపట్ల పెల్లుబికిన అసంతృప్తి ప్రతినిధుల సభల ఎ న్నికలలోను, సెనెట్ ఎన్నికలలోను ప్రస్ఫుటించింది. 2010 నవంబర్‌లో జరిగిన ఎన్నికలలో ప్రతినిధుల సభలో డెమొక్రాటిక్ పార్టీకి 185 స్థానాలు మాత్రమే దక్కాయి. రిపబ్లికన్లు 239 స్థానాలను గెలవగలిగారు. 2008లో గెలిచిన 52 స్థానాలలో ఒబామా పార్టీ ఓడిపోయింది. 2008లో గెలిచిన ఏడు సెనెట్ స్థానాలను కూడా ఆ ఎన్నికలలో ఒబామా పార్టీ కోల్పోవడం రెండేళ్లలోనే ఆయన నాయకత్వం పట్ల పెరిగిన అసంతృప్తికి అద్దం..
విధానాల వైఫల్యం
ప్రస్తుత ఎన్నికలలో సైతం ‘కాంగ్రెస్’లో ఒబామా పార్టీ బలం 2010 నాటికంటే ఏ మాత్రం పెరగకపోవడం ఒబామా విజయస్థాయిని మరింత వామనీకృతం చేసిన విపరిణామం. 2010 ఎన్నికల తరువాత ప్రతినిధుల స్పీకర్ పదవిని కోల్పోయిన ‘డెమొక్రాట్’ నాన్సీ పెలాసీ మళ్లీ స్పీకర్ అయ్యే అవకాశం ప్రస్తుత ఎన్నికల తరువాత కూడ లేదు. నాలుగేళ్లకోసారి జరిగే అధ్యక్ష ఎన్నికలతోపాటు అనేక రాష్ట్రాల గవర్నర్ పదవులకు, కాంగ్రెస్ ప్రతినిధుల సభకు, సెనెట్‌లోని మూడవ వంతు స్థానాలకు, అనేక రాష్ట్రాల కాంగ్రెస్‌లకు, ఇతర స్థానిక పదవులకు విడివిడి బ్యాలెట్ల ద్వారా ఒకేసారి ఎన్నికలు జరగడం అమెరికా ప్రజాస్వామ్య పరిమాణ విస్తృతికి ప్రమాణం. అధ్యక్ష పదవి నాలుగేళ్లు కాగా మధ్యలో రెండేళ్లకు మళ్లీ జరిగే ప్రతినిధుల సభ సెనెట్ ఎన్నికలను అధ్యక్షుని పని తీరుపై ప్రజల మధ్యంతర సమీక్షగా భావిస్తున్నారు. అందువల్ల 2010 నాటి ఎన్నికలు ఒబామా విధానాల నిరాకరణకు ప్రతీక! ఇప్పుడు అధ్యక్ష ఎన్నికలతోపాటు జరిగిన ‘కాంగ్రెస్’ ఎన్నికలు కూడ ఒబామా విధానాలను ప్రజలు అంగీకరించ లేదనడానికి ప్రతీకలు. సెనెట్‌లో గతంలోని 51 స్థానాల స్థాయిని మెరుగుపరుచుకోలేక పోయినందున ఒబామా పార్టీకి విదేశాంగ వ్యవహారాలలో అడుగడుగునా ఆటంకాలు ఎదురు కావచ్చు!!
గత శతాబ్ది మొత్తంమీద 1912 నుంచి 2012 వరకు యాబయిరెండేళ్లపాటు డెమొక్రాటిక్ పార్టీకి చెందిన అధ్యక్షులు పాలించారు. నలబయి ఎనిమిదేళ్లు రిపబ్లికన్లపాలన జరిగింది. ఉడ్రో విల్సన్, ఫ్రాంక్లిన్‌డి రూజ్‌వెల్ట్, జాన్ కెన్నడీ వంటి చారిత్రక బాధ్యతలను నిర్వర్తించిన అధ్యక్షులు డెమొక్రాటిక్ పార్టీవారు. ఉడ్రోవిల్సన్ మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో అమెరికా బ్రిటన్ కూటమికి విజయం చేకూర్చాడు. రూజ్‌వెల్ట్ రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో అమెరికా అధ్యక్షుడు. ఈ విజయాలు ‘ఐక్యరాజ్య సమితి’ని అంతకు ముందు ‘నానాజాతి సమితి’ని అమెరికా అదుపు చేయడానికి, అంతర్జాతీయ ఆధిపత్యం సాధించడానికి వలసిన అహంకారాన్ని సమకూర్చాడు. అలాంటి పరంపరకు చెందిన ఒబామా రెండవసారి సాధించిన విజయం స్థాయి గతంలోని తమ పార్టీ అభ్యర్థుల స్థాయికి దీటుగా లేదు! అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితం కేవలం ప్రజల వోట్లు ప్రాతిపదికగా కాక వివిధ రాష్ట్రాలకున్న ప్రతినిధుల ప్రాతిపదికగా నిర్ధారణ జరుగుతోంది. ‘సమాఖ్య’-ఫెడరల్- స్వరూప స్వభావాలను సమగ్రత్వం సాధించిన అమెరికా రాజ్యాంగ వ్యవస్థలోని వైశిష్ట్యమిది. ఇది వైపరీత్యం కూడ. ప్రజల వోట్లలో మెజారిటీ సాధించిన అభ్యర్థి ఓడిపోవడం తక్కువ వోట్లు వచ్చిన వారు గెలవడం చరిత్రలో రెండుసార్లు జరిగింది. ఇందుకు కారణం రాష్ట్రాల ప్రతినిధులతో కూడిన ‘వరణ సమితి’-ఎలక్టోరల్ కాలేజి-లో మెజారిటీ వచ్చిన అభ్యర్థి అధ్యక్షులుగా ఎన్నిక కావడం. ఒక రాష్ట్రంలోని ప్రజల వోట్లలో మెజారిటీ వచ్చిన అభ్యర్థినికి ఆ రాష్టప్రు ప్రతినిధుల వోట్లు మొత్తం లభిస్తున్నాయి. ఇలా 538 మంది సభ్యులు కల వరణ సమితిలో మెజారిటీ వోట్లు రావడం అసలు ఎన్నిక! నిజానికి నవంబర్‌లో జరిగే ఎన్నికలు అనధికారమైన ఎన్నికలు. డిసెంబర్‌లో ‘వరణ సమితి’ ప్రతినిధులు ఆధికారికంగా అధ్యక్షుడిని ఎన్నుకుంటారు. ఈ ‘వరణ సమితి’ పద్ధతి కారణంగా మాత్రమే ఇప్పుడు ఒబామాకు ఘనవిజయం జరిగినట్టు ప్రచారమైంది. కానీ ప్రజల వోట్లు ఒబామాకు, ఆయన రిపబ్లికన్ అభ్యర్థి మిట్రండ్ రోనీకి మధ్య సమానంగా చీలాయి. రెండవసారి పోటీ చేసి గెలిచిన ప్రతి అధ్యక్షునికి దాదాపు అరవై శాతం వోట్లు రావడం 1956 నుండి నడుస్తున్న కథ. ఒబామాకు ఓడిన ప్రత్యర్థితో సమానంగా మాత్రమే వోట్లు రావడం ఆయన విధాన వైఫల్యానికి నిదర్శనం. ‘నిరుద్యోగం’ స్థాయి పెరగడం ఒబామా నాలుగేళ్ల పాలనలో ప్రధాన వైపరీత్యం!!
మరో ట్రూమన్ వలె
క్రీస్తు శకం 1956 నుంచి రెండవసారి పోటీ చేసి గెలిచిన ఏ అధ్యక్షుని విజయం కూడ ‘పోలింగ్’నకు ముందు అనుమానా స్పదం కాలేదు. ఓడిపోయిన ఇద్దరు అధ్యక్షులూ ఓడిపోనున్నారని ముందుగానే స్పష్టమైంది. ‘డెమొక్రాట్’ జిమీకర్టర్ 1980 లోను, ‘రిపబ్లికన్’ జార్జి బుష్ 1992లోను అలా రెండవసారి పోటీచేసి ఓడిపోయిన అధ్యక్షులు. కానీ చివరి క్షణం వరకు ఓడిపోతారో గెలుస్తారో తెలియని ఇద్దరు అధ్యక్షులూ డెమొక్రాటిక్ పార్టీవారు. 1948లో రెండవసారి ఎన్నికయిన ట్రూమన్ మొదటివాడు. ఇప్పుడు గెలిచిన ఒబామా రెండవ వాడు! 1948లో ట్రూమన్ ఓడిపోయాడని ఆయన ప్రత్యర్థి ‘రిపబ్లికన్’ థామస్ ఈ డీవీ ఘనవిజయం సాధించాడని ఉదయం పత్రికలు పతాక శీర్షికలలో ప్రచురించాయట! సాయంకాలం పత్రికలు తప్పు దిద్దుకోవలసి వచ్చిందట! ట్రూమన్ రెండవసారి ఎన్నిక కావడం అంతటి సందేహాస్పదమైంది. రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో 1932వ, 1936వ, 1940వ, 1944వ సంవత్సరాలలో వరుసగా నాలుగుసార్లు అధ్యక్షుడుగా ఎన్నికైన ఫ్రాంక్లిన్ డి రూజ్‌వెల్ట్ 1945 ఏప్రిల్‌లో మరణించిన వెంటనే ఉపాధ్యక్షుడు ట్రూమన్ అధ్యక్షుడయ్యాడు. అందువల్ల 1948 నాటికి పదహారేళ్లు ‘డెమొక్రాటిక్’ పాలనను అనుభవించిన అమెరికన్లు మార్పును కోరి ఉండవచ్చు! కానీ ఒబామా పాలన మొదలైన తీరు నాలుగేళ్లకే అమెరికన్లకు ఆయన పట్ల అసంతృప్తి పెరిగింది!!అందువల్లనే 2010నుంచి ఆయన ప్రత్యర్థి పార్టీ ప్రాబల్యం కల ‘ప్రతినిధుల సభ’లో కలిసి పనిచేయవలసి వస్తోంది. గత వందేళ్లలో డెమొక్రాటిక్ పార్టీ వారే ప్రతినిధుల సభలో ఎక్కువసార్లు మెజారిటీని సాధించారు. ప్రత్యర్థి పార్టీకి కాంగ్రెస్‌లో మెజారిటీ ఉన్న సమయంలోనే ఎక్కువ మంది ‘రిపబ్లికన్’లు అధ్యక్షులుగా పనిచేసారు. ఈ వైపరీత్యం ఇప్పుడు డెమొక్రాటిక్ పార్టీ అధ్యక్షులకు ఎదురవుతోంది. 1994లో బిల్ క్లింటన్, 2010 నుండి ఒబామా ఈ వైపరీత్యానికి గురి అవుతున్నారు. గెలిచారు కానీ గెలిపించలేకపోయారు!!

అమెరికాలో పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థ ఉండినట్టయితే అధ్యక్షుడు బరాక్ ఓబామా నాయకత్వంలోని డెమోక్రాటిక్ పార్టీకాక, ప్రత్యర్థి రిపబ్లికన్ పార్టీ ఇప్పుడు ప్రభుత్వాన్ని ఏర్పరిచి ఉండేది
english title: 
obama
author: 
-తంగేడుకుంట

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>