దేశ స్వాతంత్య్రంకోసం సంవత్సరాల తరబడి పోరాడి, తమ ప్రాణాలు సైతం జాతిజనులకోసం త్యాగంచేసిన మహనీయుల గురించి జాతిజనులు క్రమేపి మరచిపోతున్నారు. అలాంటి త్యాగధనుల గూర్చి వారి ఆశయాలను, సిద్ధాంతాల భావితరాల వారికి తెలియజేయడం మనముందున్న కర్తవ్యం. ప్రభుత్వం కూడా అలాంటి మహోన్నత వ్యక్తుల జీవిత చరిత్రల్ని విద్యార్థులకు పాఠ్యాంశాలుగా విద్యావ్యవస్థలో ప్రవేశపెట్టేందుకు కృషిచేయాల్సిన అవసరం ఎంతైనా వుంది. భారతదేశ స్వాతంత్య్ర సంగ్రామ చరిత్ర గ్రంథాలకు, పుస్తకాలకు పరిమితంకారాదు. ఏదో కొందరి నాయకుల జయంతి, వర్ధంతి ఉత్సవాల్ని మొక్కుబడిగా నిర్వహించి, అంతటితో ఆ త్యాగధనులకు తామేదో ఒనగూర్చిపెట్టినట్లు ప్రభుత్వం, పాలకులు, పార్టీల నేతలు భావించరాదు.
జాతిపిత మహాత్మాగాంధీని కూడా భావితరాల వారు క్రమేపి మరుగునపడేసే అవకాశవాదం అందలం ఎక్కుతుండటం విషాదం. అంతటి మహోన్నత వ్యక్తి ఒకరు ఈ గడ్డపై మనమధ్య జీవించాడంటే భవిష్యత్తు తరాలవారు నమ్మలేరని ప్రముఖ శాస్తవ్రేత్త అల్బర్ట్ ఐన్‌స్టీన్ జాతిపిత మహాత్మాగాంధీని శ్లాఘించారంటే అది ఆ మహాత్ముని గొప్పతనానికి ప్రతీక. స్వాతంత్య్రోద్యమానికి అహింసాపద్ధతుల్లో సబర్మతీ ఆశ్రమంనుండి బాపూజీ అంకురార్పణచేశారు. అలాంటి పవిత్ర సబర్మతీ ఆశ్రమానికి కార్పొరేషన్‌వారు ఆస్తిపన్ను కింద, జరిమానా కింద రూ.16 లక్షలు చెల్లించమని ఆశ్రమ నిర్వాహకులకు శ్రీముఖం జారీచేసింది. గుజరాత్ పేద రాష్ట్రంకాదు. సబర్మతీ ఆశ్రమం పన్నుకడితే గాని కార్పొరేషన్ గడవని స్థితిలోనూ లేదు. పైపెచ్చు ఆశ్రమం వాణిజ్యపరమైన కార్యక్రమాల్ని ఏవీ నిర్వహించడంలేదు. ఆశ్రమ కమిటీ ఈ భవనాల్లో పలు విద్యాసంస్థల్ని నిర్వహిస్తోంది. ప్రాథమిక పాఠశాల, ఉపాధ్యాయ శిక్షణాసంస్థ, చేనేత పాఠశాల, బాలికలకోసం పాఠశాల, హాస్టళ్ళు నిర్వహిస్తోంది. ఇందులో ఎక్కువగా బడుగు బలహీనవర్గాల విద్యార్థులకు ఉచితంగా చదువుచెపుతున్నారు. కానీ కార్పొరేషన్ వారి దృష్టిలో వాణిజ్య కార్యకలాపాలకిందే వస్తాయని కార్పొరేషన్ వాదిస్తోంది. సర్దార్ పటేల్ అహమ్మదాబాద్ మున్సిపాలిటీకి అధ్యక్షుడుగా వున్నప్పుడు అన్నిరకాల మున్సిపల్ పన్నులునుంచీ ఆశ్రమానికి మినహాయింపు ఇచ్చారు. మొరార్జీదేశాయి అవిభక్త బొంబాయి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఈ మినహాయింపులు ఆశ్రమానికే కాకుండా ఆశ్రమం నిర్వహిస్తున్న గోశాలకు కూడా విస్తరించారు. ఇవన్నీ జరిగికూడా 50 ఏళ్ళు దాటుతోంది. ఇన్నాళ్ళ తర్వాత సబర్బతీ ఆశ్రమ ప్రాంగణంలో గాంధీ నివసించిన హృదయ్‌కుంజ్, మీరాకుటీర్, వినోబాభావే కుటీర్‌లకు మాత్రం ఎలాంటి పన్నులు ఉండవని, ఆ ప్రాంగణంలోని మరో డజను భవనాలకు మాత్రం పన్నులు చెల్లించాల్సిందేనని ఇప్పుడు అహ్మదాబాద్ కార్పొరేషన్ పేచీ పెడుతున్నది. 1917లో మహాత్ముడు ఆశ్రమం స్థాపించినప్పుడు అది అహ్మదాబాద్‌కు చాలా దూరంగా ఉండే ప్రాంతం. కానీ కాలక్రమేణా ఊరు పెరిగి నగరం నడిబొడ్డుగా మారింది. ప్రస్తుతం అక్కడి భూమికి ఎక్కడా లేని విలువ ఏర్పడింది. దాంతో పన్నులు బాగా పెరిగిపోయాయి. తరచు అధికారులు ఆశ్రమానికి వచ్చి పన్నులు, జరిమానా కడతారా?.. లేక భవనాలన్నింటినీ సీల్ వేసేయమంటారా? అని బెదిరింపులకు గురిచేయడం, నగర మేయర్‌కు లేఖ రాసినా స్పందన లేకపోవడంతో ఆశ్రమ నిర్వాహకులు విసిగిపోయి మానవతా విలువలకు, మహాత్ముణ్ణి కూడా ఖాతరుచేయని అధికారులకు సీల్‌చేసి వెళ్ళండి చెట్లుక్రిందయినా పాఠాలు చెప్పుకుంటాం పొమ్మన్నారట! జాతిపిత మీద గౌరవం లేనిచోట, జాతి ప్రజానీకం మనోభావాల్ని కూడ గుర్తింలేని అధికారులకు మానవతా విలువల్ని ఏం గుర్తిస్తారు? మహాత్ముడు సబర్మతీ ఆశ్రమం నెలకొల్పే నాటికి, ఇప్పటికీ కాలం చాలా మారిపోయింది. దేశభక్తి త్యాగ నిరతి మచ్చుకైనా కానరాని అవినీతి సామ్రాట్టులు చక్రం తిప్పుతున్నప్పుడు, స్వాతంత్య్రయోధులు కాని, సమరవీరులు కాని ఎవరికి ఎందుకు గుర్తుంటాయి?
దేశ స్వాతంత్య్రంకోసం సంవత్సరాల తరబడి పోరాడి
english title:
sabarmati
Date:
Monday, November 12, 2012