ప్రజాసేవ కోసం స్వవిషయాలు త్యాగం చెయ్యడం నాయకుడికి అవసరమే. అయితే ఉన్న కుటుంబాన్ని ఉన్నత స్థితికి తీసుకువెళ్లడమూ అవసరమే. అలా సక్రమంగా ఆ సంసార రథం నడవాలంటే ఇంటి హోం మినిస్టర్ (సహధర్మచారిణి- భార్య) చాకచక్యం అవసరం. అలాంటి అవసరమైన చాకచక్యాన్ని సమర్థవంతంగా నడుపుకొచ్చిన విమల (ప్రజా గాయకుడు గద్దర్ సతీమణి) చెప్పిన వివరాల్ని ‘హోంమినిస్టర్’ (వనిత టివిలో ప్రతి శనివారం రాత్రి 10 గంటలకు ప్రసారమవుతున్నది)లో నవంబరు 3న ప్రసారం చేశారు. చాలామంది నాయకుల్లాగా, ప్రజల తరఫున పోరాడే వ్యక్తుల్లాగా గద్దర్‌ది వడ్డించిన విస్తరి జీవితం కాదు. అనుక్షణం అనేకానేక అవరోధాల్ని దాటుకొచ్చిన మొండిధైర్యంతో సాగిన సంరంభం అది. అది అలా నిరాటంకంగా సాగడానికి, ప్రత్యేకించి కుటుంబ సభ్యులు కలతపడకుండా ప్రయాణం సాఫీగా సాగించడానికీ విమల తను అవలంబించిన శైలిని చాలా ఆసక్తికరంగా విపులీకరించారు. అసలలా నిరంతర ఆందోళనా పథంలో పదం కలిపే ప్రక్రియలో ఏదో ఒక స్థితిలో భాగస్వామి ఎందుకొచ్చిన ‘టెన్షన్’ అని కృంగిపోవడం కద్దు. ఆ ఛాయలు తనపై సోకకుండా విజయవంతంగా విమల నెగ్గుకొచ్చారు కనుకనే ఈనాడు విమల విషయాన్ని ఇలా వినగల్గుతున్నాం. ఆమే చెప్పినట్లు అందుకు గద్దర్ పిల్లలు అర్థం చేసుకుని అవగాహనతో జీవితాన్ని నడపడమూ కారణమే. ఇందులో చెప్పుకోతగ్గ అంశమేమిటంటే ఇలాంటి విషయాలు చెప్పేటప్పుడు ఎక్కడో అక్కడ అతిశయోక్తి జాడలు కన్పడతాయి. కానీ విమల అందుకు దూరంగా తాను కష్టాలలో ఎదుర్కొన్న సంఘటనల్ని జరిగింది జరిగినట్లు చెప్పారు. అదీ లేనిపోని భాష కోసం కసరత్తు చేయకుండా మనసుని కదిలించే తెలంగాణా జీవభాషలో చెప్పడం మనసుకి మరీ ముచ్చటేసింది. అయితే యాంకర్ల తీరే చాలా చాలా అలవాటైన బాణీనే, అదే పడికట్టు ప్రశ్నావళి (బాధ కలిగించిన సంఘటన, సంతోషపు సంగతీ.. వగైరా)ని అనుసరించడం బావులేదు. చెప్పే మనిషిని బట్టి, స్పృశించే అంశాన్నిబట్టి అనుకూలంగా ప్రశ్నలు వేయాలి. అప్పుడే ఆసక్తికర అదనపు సమచారం వారి ద్వారా ప్రేక్షకులకు చేరుతుంది.
అరుదైన ఇంటర్వ్యూ
సాధారణంగా ఇంటర్వ్యూలు ఏ చానల్‌లో చూసినా అవి నాయకీ నాయకులకో, దర్శకులకో ఇతర నటులకో చెందినవే కన్పడతాయి. కానీ తెరవెనుక ఉన్న పలు కీలక శాఖల ముఖ్యుల్ని ముట్టుకోరు. అలా కాకుండా వి-6 చానల్ రోజూ రాత్రి ప్రసారం చేసే (కత్తి కార్తీక నిర్వహించేది) ఇంటర్వ్యూలో ఈమధ్య ప్రముఖ అనువాద కళాకారుడు ఆర్.సి.యం.రాజుతో ఇంటర్వ్యూ ప్రసారం చేసింది. సగటు ప్రేక్షకుడు ఏ ప్రకటన చూసినా, ఏ సినిమా పరికించినా, టివిలో సీరియల్ వీక్షించినా రాజు గళం రోజులో ఒక్కసారైనా వినకుండా ఉండడు. అంతగా సృజనాత్మక ప్రక్రియల్లో బలంగా పెనవేసుకుపోయిన రాజు గళ నేపథ్యాన్ని తదితరాల్ని ఈ షో సాకల్యంగా ప్రేక్షకుల ముందుంచింది. గళ వైవిధ్యత కోసం తను తీసుకుంటున్న జాగ్రత్తలు అలా నటులకు గొంతు ఇస్తున్నప్పుడు, వారు పోషించే పాత్రల స్వభావాన్ని తాను అర్థం చేసుకోవడానికి చేస్తున్న కృషినీ బాగా వివరించారు. ఒక రకంగా పాత్రల్లో పరకాయ ప్రవేశం చేస్తేగానీ ఆ మాదిరి కచ్చితత్వపు వాయిస్ రాదు. అందులో అలా రాజు నిష్ణాతత చూపిస్తున్నారు కనకనే సుదీర్ఘకాలంగా వారి గళయానం ఒడిదుడుకులు లేకుండా సాగిపోతోంది. ‘మొగలిరేకులు’ (జెమినీలో వస్తున్న సీరియల్)లో తండ్రీ కొడుకుల పాత్రలకు తాను డబ్బింగ్ చెప్పినపుడు వైవిధ్యత కోసం అవలంబించిన విధానం ఆసక్తికరంగా రాజు ఇందులో చెప్పుకొచ్చారు. అలాగే తానెంతో కష్టపడి డబ్బింగ్ చెప్పిన ‘రక్తకన్నీరు’ (కన్నడ అనువాద చిత్రం -ఉపేంద్ర నాయకుడు) చిత్రం గురించి చెప్పారు. ఇది అరవై దశకాల్లో తెలుగు రంగస్థలాన్ని ఉర్రూతలూగించిన నటుడు నాగభూషణం నేతృత్వంలో వచ్చిన ‘రక్తకన్నీరు’ నాటకం ఆధారంగా తయారైన చిత్రం. అందులో నాగభూషణం ఒక టిపికల్ గొంతుతో డైలాగ్ డెలివరీ చేస్తారు. అదే టిపికల్ వాయిస్‌ను రాజు ఈ చిత్రం గళదానంలో అనుసరించారు. అలా కాకుండా ఇప్పటి ట్రెండును అనుసరించి గొంతును మార్చుకొని మాట్లాడితే బాగుండేది.
ఎక్కువైన నవ్వులు
యాంకరింగ్ ఆహ్లాదకరంగా వుండాలి. అది అందరూ అంగీకరిస్తారు. అలాంటి ఆహ్లాదకర వాతావరణం రాడానికి తగినంత మాత్రంలో నవ్వితే చాలు. కానీ కార్యక్రమం మొత్తంలో అధికభాగం ‘నవ్వు’లే ప్రధాన పాత్ర వహిస్తే అంతగా ఆకట్టుకోదు. అలాంటి భావనే ప్రతి ఆదివారం స్టూడియో ఎన్‌లో ప్రతి ఆదివారం ఉదయం 9.30కి వస్తున్న దాంట్లో (స్టారొచ్చారు విత్ కృష్ణవేణి) ఈ మధ్య ఈ కార్యక్రమ పరంపరలో నటుడు ఆకాష్‌తో ఇంటర్వ్యూ ప్రసారం చేశారు. ప్రతి ప్రశ్నకు ముందూ, అందుకు పొందిన సమాధానం తర్వాత నవ్వుతూ (అదీ బిగ్గరగా) వుండడం కామనైపోయింది. ఈ ‘నవ్వుల’ తతంగం వల్ల పాల్గొంటున్న అభ్యర్థి చెప్పే అంశం నీరుగారిపోతుంది. అది సరిగ్గా చేరడంలేదు. ఇది సవరించుకోవాలి.
ప్రమాణాలు పెంచుకోవాలి
ఈ మధ్య ఓ ప్రముఖ సంగీత దర్శకుడు ఓ సందర్భంలో చిన్నతెరపై వస్తున్న రియాల్టీ షోల (ప్రత్యేకించి మ్యూజిక్ షోలు)పై ఓ వ్యాఖ్య చేశారు. టివిలో వచ్చే సంగీత సంబంధ షోల్లో పాడుతా తీయగా.. (ఈటివిలో వస్తున్నది) తప్ప మరే షో నిబద్ధతతో సాగడంలేదు.. అని. ఇది పూర్తిగా కాకపోయినా చాలావరకూ నిజం. ఆయనే తన వ్యాఖ్యకు కొనసాగింపుగా ‘గాయని డబ్బింగ్ చెపుతోంది.. యాంకరింగ్ చెపుతోంది.. న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తోంది.. ఇంక సంగీత సాధనకు సమయం ఎక్కడ?’ అన్నారు. దీనికీ, కార్యక్రమాలు సరిగా రాకపోవడానికి నేరుగా సంబంధం లేకపోయినా ఆ సంగీత దర్శకుడు ‘ప్రమాణాల దిగజారుడు’ అంశంతో అందరూ ఏకీభవిస్తారు. ఈ విమర్శను సకారాత్మక ధోరణిలో తీసుకుని మ్యూజిక్ షోలు ప్రమాణాల కనుగుణంగా రూపొందిస్తే అందరూ ఆనందిస్తారు.
ప్రజాసేవ కోసం స్వవిషయాలు త్యాగం చెయ్యడం నాయకుడికి అవసరమే.
english title:
y
Date:
Tuesday, November 13, 2012