జైలు అనగానే కఠినమైన ప్రదేశంగా మనకి తోస్తుంది. శాన్‌ఫ్రాన్సిస్కోకి కొద్ది దూరంలో గల చిన్న ద్వీపంలోని అల్‌కాట్జ్ అనే జైలు ప్రపంచంలోని అత్యంత కఠినమైన జైలుగా ప్రసిద్ధి చెందింది. అమెరికాలో మిగిలిన జైళ్లల్లోని క్రూరమైన కైదీలను అల్‌కాట్జ్ జైలుకి తరలించేవారు. ఆ ద్వీపంలోని ఆ జైలు నించి పారిపోయి ప్రాణాలతో బయటపడ్డవారే లేని ఘనత దానికి ఉంది.
శాన్‌ఫ్రాన్సిస్కోకి సుమారు రెండున్నర కిలోమీటర్ల దూరంలోని ఈ ద్వీపంలోని జైలు 1933 నించి 1963 దాకా ఫెడరల్ ప్రిజన్‌గా పని చేసింది. అక్కడ జైలుని మూసివేశాక ప్రస్తుతం అల్‌కాట్జ్ ద్వీపం పర్యాటక కేంద్రంగా మారింది. నిత్యం మర పడవల్లో ఇక్కడికి పర్యాటకులను తీసుకెళ్లి, ఆనాటి జైలుని చూపిస్తారు.
దీనికి వ్యతిరేకంగా క్రూరమైన ఖైదీల కోసం ప్రపంచంలో మరో దీవిలో అత్యంత సౌకర్యవంతమైన జైలు ఉండటం విశేషం. ఇది నార్వేలో ఉంది. బాస్టాయ్ ద్వీపంలోగల బాస్టాయ్ ప్రిజన్, నార్వేలోని జైళ్లలో ఒకటి. అమెరికాలాకాక నార్వే ఖైదీల విషయంలో, జైళ్ల విషయంలో చాలా ఉదారంగా ఉంటుంది. ఈ ద్వీపం భూతల స్వర్గం లాంటిది. ఓస్లో నించి గంట ప్రయాణ దూరంలో గల బాస్టాయ్ ప్రిజన్ ప్రకృతి సౌందర్యం గల ద్వీపంలో ఉంది. ఫెర్రీలోంచి దీని మీద అడుగుపెట్టాక, ఖైదీలకి గార్డులు కనపడరు. ఖైదీలే ఈ జైలుని నిర్వహిస్తూండటం విశేషం. ఇక్కడికి క్రూరమైన నేరస్థులని పంపుతూంటారు. ఈ దీవిని పర్యాటకులు కూడా సందర్శించవచ్చు. ఖైదీల కోసం వేసవిలో సన్ బేతింగ్ ఏర్పాట్లు, టెన్నిస్ కోర్టులు, సౌనాబాత్ సౌకర్యం, పిషింగ్ కోసం చిన్న సరస్సులు ఉన్నాయి. అల్‌కాట్జ్‌లోలా కాక వారు నివసించేందుకు చిన్న సెల్స్ బదులు, చెక్కతో చేసిన, కంటికి ఆహ్లాదంగా కనిపించే రంగులు వేసిన కాటేజ్‌లు నిర్మించబడ్డాయి. వారు బయటకి వెళ్లేటప్పుడు తమ కాటేజ్‌కి తాళం వేసి, తాళం చెవిని వెంట తీసుకువెళ్లొచ్చు. వారు ఎప్పుడు కావాలంటే అప్పుడు వచ్చి వెళ్లొచ్చు. ద్వీపంలో ఎక్కడా ఇనుప కంచెలు గాని, తుపాకులు ధరించిన గార్డులు కాని కనిపించరు!
డ్రగ్స్ స్మగ్లింగ్, బలాత్కారం, హత్య మొదలైన పెద్ద నేరాలు చేసిన నేరస్థులు ఇక్కడ పొందే సౌకర్యాలు సామాన్యులు డబ్బు చెల్లిస్తే కాని లభించవు. బాస్టాయ్ ప్రిజన్ వెనుకగల ఉద్దేశం, నేరస్థులని ప్రోత్సహించడమే కాక, వారిని సంస్కరించడం అని ప్రిజన్స్ గవర్నర్ ఆర్నే నీల్సన్ చెప్తాడు. ‘శిక్షించడం ప్రాచీన పద్ధతి’ అని కూడా అతను చెప్తాడు. బాస్టాయ్ జైలు వారు కోరుకున్న ఫలితాన్ని ఇవ్వడం విశేషం. స్టాటిస్టిక్స్ ప్రకారం నార్వే జైళ్ల నించి విడుదలైన నేరస్థుల్లో 80% మంది, విడుదలైన రెండేళ్లల్లో మళ్లీ నేరం చేయరు. బాస్టాయ్‌లో శిక్ష అనుభవించిన వారి శాతం 84%లో తిరిగి నేరం చేయని వారితో పోలిస్తే అమెరికాలో 2011లో జైళ్ల నించి విడుదలైన ఖైదీల్లో 43 నించి 50% మంది తిరిగి నేరాలు చేశారు.
బాస్టాయ్ జైల్లో నియమాలు చాలా తక్కువ. సౌకర్యాలు ఎక్కువ. ప్రతీవారు ఉదయం ఎనిమిదిన్నర నించి మధ్యాహ్నం మూడున్నర దాకా ఏదైనా పని చేయాలి. దాన్ని కూడా వారే ఎంచుకోవచ్చు. తోట పని, పొలం పని, గుర్రాల సంరక్షణ మొదలైన వాటిలో వారిష్ట ప్రకారం పని చేయవచ్చు. ఇందుకోసం రోజుకి పది డాలర్ల విలువైన మొత్తం వారికి లభిస్తుంది. దీంతో వారు పచారీ సామానుని స్థానిక దుకాణంలో కొని బ్రేక్‌ఫాస్ట్, లంచ్‌లని తామే తయారుచేసుకోవచ్చు. రాత్రి భోజనం మాత్రం జైలు వంటవారు చేస్తారు. చికెన్, పాశ్చాత్యులు బాగా ఇష్టపడే సాల్మన్ చేపలాంటి పదార్థాలు రాత్రి భోజనంలో ఉంటాయి. ఖైదీలు రోజుకి అనేకసార్లు అటెండెన్స్‌కి హాజరవ్వాల్సి ఉంటుంది. ఇందువల్ల వారు ద్వీపంలోనే ఉన్నారని గార్డులు రూఢీ చేసుకుంటారు. పారిపోవడానికి రెండున్నర కిలోమీటర్లు సముద్రంలో ఈది, లేదా పడవని దొంగిలించి ఓస్లో నగరానికి చేరుకోవచ్చు. పారిపోవాలా లేదా అన్నది వారికే వదిలేశారు. సాధారణంగా హాలిడే రిసార్ట్‌కి వచ్చినట్లుగా ఉండే బాస్టాయ్ ద్వీపం నించి పారిపోవాల్సిన అవసరం వారికి కనిపించదు. ఎవరైనా తప్పించుకుంటే, తిరిగి పట్టుబడ్డాక వారి శిక్షా కాలాన్ని పెంచి మేగ్జిమమ్ సెక్యూరిటీగల జైలుకి తరలిస్తారు. ఆ భయంతో ఎవరూ ఈ సాహసం చేయరు. రాత్రిళ్లు ఎలాంటి ఆయుధం లేని ముగ్గురు ఖైదీలు గార్డ్ డ్యూటీలో తిరుగుతూంటారు. దాంతో గార్డుగా పనిచేసిన వారికి పారిపోబుద్ధి కాదు. అక్కడి నించి పారిపోయేందుకు మనస్కరించని విధంగా ఆ ద్వీపాన్ని సౌందర్యవంతంగా తీర్చిదిద్దారు.
ఖైదీలు ఈ ద్వీపానికి మొదటిసారి రాగానే వారికి చెప్తారు. ‘ఒకవేళ మీరు పారిపోయాక చేసింది తప్పని మీకు తోస్తే, ఇరవై నాలుగు గంటల్లో కోస్ట్‌గార్డ్‌కి ఫోన్ చేయండి. అతను మిమ్మల్ని తిరిగి ఇక్కడికి తీసుకువస్తాడు. దాంతో మీరు పారిపోయిన విషయం ఎక్కడా నమోదు కాదు.’
తమ శిక్షాకాలం ముగిశాక ఖైదీలు అక్కడ నుంచి వెళ్లడానికి ఇష్టపడడానికి కారణం ‘తమ మనసుల్లో తాము ఖైదీలం’ అనే భావన ఉండటమే. తర్వాత టూరిస్టులుగా తమ తోటి ఖైదీలని పలకరించడానికి వచ్చి పోతూంటారు.
జైలు అనగానే కఠినమైన ప్రదేశంగా మనకి తోస్తుంది.
english title:
jail kani jail
Date:
Sunday, November 18, 2012