Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

ఆమె తిరిగి రాలేదు

$
0
0

‘శుక్రవారం రాత్రి నించి నా భార్య లూసీ కనపడటం లేదు’ అని మీకు ఫిర్యాదు చేశాను. ఏమైంది?’ రాబర్ట్ పోలీస్ సార్జెంట్‌ని ప్రశ్నించాడు.
‘నిజమే. కాని పద్దెనిమిదేళ్లు దాటిన వాళ్లు తప్పిపోతే, డెబ్బై రెండు గంటల తర్వాతే కేసు నమోదు చేసుకుంటాం. ఈలోగా వాళ్లు తిరిగి రావటమో లేదా వాళ్ల నించి సమాచారం అందడమో సాధారణంగా జరుగుతూంటుంది. అందుకని ఈలోగా మా సమయాన్ని మేం వృధా చేయం’ సార్జెంట్ మిల్‌హోన్ చెప్పాడు.
‘అవును. ఆ సంగతి మీరు రెండు రోజుల క్రితం చెప్పారు. ఇంకో గంటలో ఆమె మిస్ అయి డెబ్బై రెండు గంటలు పూర్తవుతాయి’ రాబర్ట్ చెప్పాడు.
‘మీరు హాస్పిటల్స్ అన్నీ వెదికారా? ఆమెకి ఏదైనా రోడ్డు ప్రమాదం సంభవించి ఉండచ్చుగా?’
‘వెదికాను. మీ సూచన ప్రకారం బేకర్స్ ఫీల్డ్‌లోని ఆమె తల్లికి కూడా ఫోన్ చేశాను. ఆమె అక్కడికి వెళ్లలేదు. వెళ్లడానికి ఆమెకి ఇంకెవరూ దగ్గరి బంధుమిత్రులు లేరు’
‘ఆమె నించి మీకు ఫోన్ ఏమీ రాలేదా?’
‘రాలేదు’
‘మీ ఇద్దరి మధ్యా ఏవైనా సమస్యలు ఉన్నాయా?’ సార్జెంట్ మిల్‌హోన్ ప్రశ్నించాడు.
‘లేవు’
‘ఆమె ఇటీవల డిప్రెషన్‌కి గురైనట్లు కానీ, లేదా ఏదైనా వింతగా ప్రవర్తించడం మీరు గమనించారా?’
‘గత రెండు నెలలుగా ఆమె కొంత రెస్ట్‌లెస్‌గా ఉంది. బహుశా పిల్లల స్కూల్స్ తెరిచి, ఖర్చులు పెరగడం వల్ల అనుకున్నాను. అంతేకాని నేను ఆమెని దీని గురించి ప్రశ్నించలేదు. ఎందుకంటే అలాంటివి ప్రశ్నిస్తే ఆమెకి కోపం’
‘లూసీకి ఆల్కహాల్ లేదా డ్రగ్స్ లాంటి అలవాట్లు ఉన్నాయా?’
‘లేవు’
‘మీ ఇద్దరి మధ్య సంబంధం బెడిసికొట్టిందా? ఈ మధ్య ఎక్కువగా ఏ విషయం మీదైనా వివాదం వస్తోందా?’
‘నా వైపు నించి ఎలాంటి సమస్య లేదు. ముగ్గురు పిల్లలు గల మాకు ప్రధానంగా డబ్బు సమస్య. ఆ విషయం మీద తనే ఏదో వివాదం రేపుతూంటుంది. మాకు కూతురు లేదు. అందుకోసం ప్రయత్నిద్దాం అంటే ఆమె ఒప్పుకోవడం లేదు’
‘మీరిద్దరూ పని చేస్తున్నారా?’
‘అవును. సంసారం ఈడ్చుకు రావడానికి తప్పదు. నేను ఫోన్ కంపెనీలో ఇన్‌స్టాలర్‌గా పని చేస్తున్నాను. ఆమె ఫైనాన్స్ కంపెనీలో సెక్రటరీగా పని చేస్తోంది. లూసీ ఎక్కడికి వెళ్లిందో నాకు అంతుపట్టడం లేదు. ఇటీవల మా మధ్య ఎలాంటి పోట్లాట కూడా జరగలేదు’ రాబర్ట్ బాధగా చెప్పాడు.
* * *
సార్జెంట్ మిల్‌హోన్, రాబర్ట్ భార్య లూసీ పని చేసే డౌన్‌టౌన్‌లోని ఆఫీస్‌కి వెళ్లాడు. దాని మేనేజర్ మిసెస్ మెర్రీ మేన్‌ని కలిశాడు.
‘మీరు మిస్టర్ సోదర్‌లాండ్‌తో మాట్లాడండి. సోదర్‌లాండ్, ఆమె మంచి ఫ్రెండ్స్. నాకంటే అతనికి ఆమె గురించి బాగా తెలుసు’ అతను సోదర్‌లాండ్‌ని ప్రశ్నించాడు.
‘శుక్రవారం రాత్రి లూసీ ఆఫీస్ నించి బయలుదేరాక బేబీ సిట్టర్ ఇంటికి వెళ్లి, ఆఖరి కొడుకుని తీసుకెళ్లలేదని రాబర్ట్‌కి బేబీ సిట్టర్ నించి ఫోన్ వచ్చింది. ఇంతదాకా ఆమె ఇంటికి వెళ్లలేదు. ఏం జరిగిందో మీకేమైనా తెలుసా?’
‘మా ఆడిటర్ నాలుగు రోజుల క్రితం చేసిన ఆడిట్‌లో లూసీ ఐదు లక్షల డాలర్లు ఆఫీస్ నించి దొంగిలించిందన్న సంగతి బయటపడింది. ఇంకో బేంక్‌లో కంపెనీ పేరున అకౌంట్ ఓపెన్ చేసి, పది చెక్కులని అందులో డిపాజిట్ చేసింది. క్రితం శుక్రవారం సాయంత్రం ఆ డబ్బుని విత్‌డ్రా చేసింది. పాస్‌బుక్ ఆమె టేబుల్ కింది డ్రాయర్‌లో కనిపించింది. ఆ పాస్‌బుక్‌ని నేను ఇందాకే చూశాను. రాబర్ట్ ఆ రాత్రి నాకు ఫోన్ చేసి తన భార్య ఇంటికి రాలేదని చెప్పినప్పుడే నాకు ఆమె మాయం అవడానికి కారణం ఇదని అనిపించింది’ సోదర్‌లాండ్ చెప్పాడు.
సార్జెంట్ మిల్‌హోన్ లూసీ డెస్క్‌ని వెదికాడు. కొద్దికాలం క్రితం ఆమె ఓ హాస్పిటల్‌కి డబ్బు చెల్లించిన రసీదు, ఇతర వ్యక్తిగత కాగితాలతో పాటు కనిపించింది. సార్జెంట్ అక్కడి నించి ఉమెన్స్ హెల్త్ సెంటర్‌కి వెళ్లాడు. తన బేడ్జ్‌ని లూసీ డెస్క్‌లో దొరికిన రసీదుని చూపించి, ఆ మొత్తం దేనికి చెల్లించిందో చెప్పమని కోరాడు. పది నిమిషాల్లో రిసెప్షనిస్ట్ కంప్యూటర్‌లో తనిఖీ చేసి, రెండు ప్రింటవుట్స్ తీసి స్టేపుల్ చేసి ఇచ్చింది. దాన్ని బట్టి లూసీ, ట్యూబెక్టమీ ఆపరేషన్ చేయించుకుందని సార్జెంట్‌కి తెలిసింది.
సార్జెంట్ లూసీ కంపెనీ పేరున దొంగ అకౌంట్ తెరిచిన మోంట్‌బెలోని బ్యాంక్ బ్రాంచ్‌కి వెళ్లాడు. మళ్లీ తన బేడ్జ్‌ని కేషియర్‌కి చూపించి ప్రశ్నించాడు.
‘క్రితం శుక్రవారం వెల్‌వర్త్ ఫైనాన్స్ కంపెనీ అకౌంట్ నించి ఐదు లక్షల డాలర్లని లూసీ అనే ఆమె డ్రా చేసింది. అంత నగదు ఒక్కసారిగా డ్రా చేస్తూంటే మీరు ఎలా ఇచ్చారు?’
‘నాకు ఆమె గుర్తుంది. రియల్ ఎస్టేట్ వ్యాపారికి దాన్ని అర్జెంట్‌గా ఇవ్వాలని చెప్పి తీసుకుంది. నేను మా మేనేజర్‌ని సంప్రదించే ఆ మొత్తాన్ని ఇచ్చాను. పైగా ఆ చెక్‌ని తిరస్కరించడం నేరం’
‘ఆమె మీకు వ్యక్తిగతంగా తెలుసా?’
‘తెలీదు. అనేక మంది కస్టమర్స్‌లో ఆమె ఒకరు’
సార్జెంట్ రాబర్ట్ ఆఫీస్‌కి వెళ్లి అతన్ని కలిసి ఆమె చేసిన మోసం గురించి చెప్పాడు. రాబర్ట్ నివ్వెరబోతూ చెప్పాడు.
‘లూసీకి డబ్బంటే ప్రేమ ఉన్నా, ఆమెలో దొంగబుద్ధి ఉందని అనుకోలేదు. ఇది కేవలం ఆమె మీద వచ్చిన నిందేమో? నిజానిజాలు మీరు పరిశోధించాలి’
‘ఆమె తన వెంట దుస్తులు తీసుకువెళ్లిందా? అది అడగటం మరిచాను’
‘ఓ సూట్‌కేస్‌లో కొన్ని బట్టలని తీసుకువెళ్లింది అని మొదటిసారే చెప్పినట్లు గుర్తు’
‘దాన్నిబట్టి ఆమె ప్రమాదానికి గురి కాలేదని, ఆఫీస్‌లో ఆడిటర్స్ తన రహస్యం కనుక్కోవడంతో కావాలని మాయమైందని అర్థవౌతోంది. ఈ ఆధారంతో ఇప్పుడు ఆమె కోసం వెదకడం తేలిక. లుక్ అవుట్ నోటీస్‌ని అన్ని పోలీసుస్టేషన్లకి పంపుతాను. బహుశా ఆమె కంపెనీ మేనేజర్ త్వరలో ఆమె చేసిన దొంగతనం గురించి మాకు ఫిర్యాదు చేయవచ్చు’
‘లూసీ ఈ పని చేసిందంటే నమ్మలేకపోతున్నాను’
సార్జెంట్ పాన్‌ఎం, డెల్టా, అమెరికన్ ఎయిర్‌లైన్స్ మొదలైన విమాన సంస్థల అధికారులను కలిసి లూసీ ఏకర్‌మేన్ గత శుక్రవారం నించి ఏదైనా ఊరు వెళ్లిందా అని వాకబు చేశాడు. ఆమె లాస్‌ఏంజెలెస్‌కి అమెరికన్ ఎయిర్‌లైన్స్‌లో నగదు ఇచ్చి టిక్కెట్ కొన్నది కానీ, దాన్ని ఆమె వాడలేదని తెలిసింది. అది పోలీసులని తప్పుదారి పట్టించడానికి లూసీ వేసిన ఎత్తా? ఏ గ్రేహౌండ్ బస్‌లోనో, కారులోనో ఇంకేదైనా ఊరు వెళ్లిందా? లేక ఆమె నిజంగా వెళ్లలేకపోయిందా? అన్నది సార్జెంట్ మిల్‌హోన్ తేల్చుకోలేకపోయాడు.
అతను ఊహించినట్లుగానే, మర్నాడు లూసీ మీద ఆమె పని చేసే కంపెనీ నించి ఫిర్యాదు అందింది. ఆమెకి ఎవరైనా ప్రేమికుడు ఉన్నాడా అని మిల్‌హోన్ ఆమె కొలీగ్స్ అందర్నీ మళ్లీ కలిసి తరచి తరచి ప్రశ్నించాడు. అలాంటిది ఏమీ లేదనే జవాబు వచ్చింది. వెంటనే అన్ని పోలీసుస్టేషన్లకి లుక్ అవుట్ నోటీస్ పంపించాడు. కార్లు అద్దెకిచ్చే కంపెనీలన్నీ తిరిగి, లూసీ అద్దె కారు తీసుకుందా అని కూడా విచారించాడు. లేదనే జవాబే వచ్చింది.
రాబర్ట్ నించి తీసుకున్న ఆమె క్రెడిట్ కార్డ్ వివరాలతో దాన్ని జారీ చేసిన కంపెనీకి వెళ్లి, ఆమె దాన్ని ఇటీవల ఉపయోగించిందా అని ప్రశ్నించాడు. వారిచ్చిన ప్రింటవుట్ ప్రకారం శుక్రవారం మధ్యాహ్నం లంచ్‌కి ఆమె రెడ్‌బాబ్‌స్టర్ రెస్టారెంట్‌లో దాన్ని ఆఖరిసారి ఉపయోగించిందని, ఆ తర్వాత మళ్లీ వాడలేదని తెలిసింది. ఐదు లక్షల డాలర్లు నగదు రూపంలో ఉన్నప్పుడు, ఆ కార్డ్‌ని ఆమె ఉపయోగిస్తుందని కూడా అతను భావించలేదు.
మర్నాడు రాబర్ట్ సార్జెంట్‌ని కలిసి దీనంగా అడిగాడు.
‘లూసీ గురించి ఏమైనా సమాచారం తెలిసిందా?’
‘ఇంకా లేదు’

‘ముగ్గురు పిల్లలతో నేనొక్కడినే అవస్థ పడుతున్నాను. జాన్ నా ఆఖరి కొడుకు. నేను ఆఫీస్‌కి వెళ్లేప్పుడు వాడి బేబీ సిట్టింగ్ కోసం చాలా ఖర్చవుతోంది. లూసీని మీరు సాధ్యమైనంత త్వరగా వెదికి పట్టుకుంటే నాకు మేలు చేసిన వారవుతారు’
‘మీ భార్యకి ఓ ప్రేమికుడు ఉన్నాడని నా నమ్మకం. మీకు తెలిస్తే దాచకుండా చెప్పండి’
‘ఆఫీస్ కొలీగ్స్‌లో సోదర్‌లాండ్ గురించి ఎక్కువ మాట్లాడుతూంటుంది’’
‘మీరతన్ని చూశారా?’
‘లేదు’
‘చూసి ఉంటే ఈ మాట అనరు. ఆయన వయసు అరవై రెండు. లూసీ వయసు ఇరవై ఏడు. అది మీ అనుమానం మాత్రమే’ సార్జెంట్ హామీ ఇచ్చాడు.
‘ఏ మెక్సికోకో లూసీ వెళ్లిపోయి ఉండచ్చని నాకు భయంగా ఉంది. అక్కడి నించి ఏ అర్జెంటీనాకో వెళ్లొచ్చు. ఆ దేశంకి అమెరికాకి నేరస్థులని అప్పజెప్పే ఒప్పందం లేదు. కాబట్టి అమెరికన్ నేరస్థులు అక్కడికే వెళ్తూంటారు. ఐదు లక్షల డాలర్లతో ఆమె అక్కడ జీవితాంతం సుఖంగా జీవించవచ్చు’
‘లూసీ మరణించిందని నేను అనుకుంటున్నాను. లేదా ఏ మారుమూల ప్రాంతంలోనో మారుపేరుతో జీవిస్తూండి ఉండవచ్చు’ సార్జెంట్ చెప్పాడు.
‘ఈ రెంటిలో ఏది జరిగినా మనకి లూసీ గురించి తెలిసే అవకాశమే లేదు’ రాబర్ట్ బాధగా చెప్పాడు.
‘మీకు ప్రియురాలు ఉందా?’ సార్జెంట్ ప్రశ్నించాడు.
రాబర్ట్ ఆ ప్రశ్నకి ఉలిక్కిపడ్డాడు. అతని మొహం పాలిపోయింది.
‘ఆ కారణంగా లూసీ నన్ను వదిలి వెళ్లిందని మీరు అనుకుంటే, అది నిజం కాదు’
మరో వారం తర్వాత సార్జంట్ మిల్‌హోన్ ఇతర కేసుల్లో పడి, లూసీ కేసుని నిర్లక్ష్యం చేశాడు. రాబర్ట్ కూడా సార్జెంట్‌కి ఫోన్ చేయడం మానేశాడు. ఇక లూసీ తనకి లభించదని రాబర్ట్ రాజీ పడ్డాడని సార్జెంట్ భావించాడు.
* * *
లూసీ మాయమైన పదమూడో రోజు ఆమె శవం దొరికింది. ఊరి బయట ఓ కుటుంబం వీకెండ్‌కి పిక్నిక్‌కి వెళ్లి, టెంట్ వేసుకున్నారు. వారి పెంపుడు కుక్క డాబర్‌మేన్ కనపడలేదు. వాళ్లు వెదికితే, ఓ చోట అది వాసన చూస్తూ తిరుగుతూండటం గమనించారు. అక్కడ తవ్వి పూడ్చినట్లుగా గడ్డి లేదు. వెంటనే వారు కొద్దిగా తవ్వితే ఓ కాలు కనిపించింది. తక్షణం పోలీసులకి ఫిర్యాదు చేశారు. పోలీసులు అక్కడ తవ్వి చూస్తే, ఓ మహిళ శవం, ఓ సూట్‌కేస్ కనిపించాయి. ఆ సూట్‌కేస్‌ని చూసి రాబర్ట్ అది లూసీదిగా నిర్ధారించాడు.
‘మీ ఆవిడ సూట్‌కేస్‌తో మాయమైంది అని చెప్పారు. హతురాలి వయసు కూడా ఇరవై ఏడే. ఫోరెన్సిక్ రిపోర్ట్ ప్రకారం శుక్రవారం రాత్రే మరణించింది. దాంతో మిమ్మల్ని పిలిపించాను. ఇంతకీ ఆ ఐదు లక్షల డాలర్లు ఏం చేశారు?’ సార్జెంట్ ప్రశ్నించాడు.
ఆ ప్రశ్నకి రాబర్ట్ నిర్ఘాంతపోయాడు. జవాబు చెప్పడానికి కొంత తడబడ్డాడు.
‘ఏమిటి మీరనేది?’ తేరుకుని ప్రశ్నించాడు.
‘మీ భార్యని హత్య చేశారు. అది ఇంకెవరి పనో అని చెప్పడానికి ఆమె స్వయంగా ఇంట్లోంచి మాయమైందనే సాక్ష్యం కోసం ఆమె సూట్‌కేస్‌ని కూడా శవంతోపాటు పాతిపెట్టారు. ఆ శవం ఎవరి కంటయినా పడే చోట పాతిపెట్టడానికి కారణం, బహుశా ఆమె డెత్ సర్ట్ఫికెట్ అవసరం మీకు ఉండి ఉండాలి. బహుశా ఆమె ఇన్సూరెన్స్ సొమ్ముని కూడా రాబట్టాలని మీ పథకం అయి ఉండాలి.’
‘మీరు చెప్పేది కట్టుకథ. అసలు హంతకుడ్ని విచారించి పట్టుకునే బదులు నెపం నా మీద వేసి, మీరు చేతులు దులుపుకోవాలి అనుకుంటున్నారు. కోర్టులో మీ కేసు నిలబడదు’ రాబర్ట్ కోపంగా చెప్పాడు.
‘మీరు ఓ కూతుర్ని కోరుకుంటున్నారు కదా?’ సార్జెంట్ ప్రశ్నించాడు.
‘అవును’
‘కానీ మీ ఆవిడ అందుకు ఇష్టంలేక ట్యూబెక్టమీ చేయించుకుందని మీకు తెలీదు. దాంతో మీరు ఆమె సూట్‌కేస్‌లో ఆమె వాడే గర్భనిరోధక సాధనం డయాఫ్రమ్ పాకెట్‌ని ఉంచారు. నిజంగా లూసీనే ఆ సూట్‌కేస్‌ని సర్దుకొని ఉంటే వాటిని తీసుకువెళ్లేది కాదు.’
రాబర్ట్ మొహం వాడిపోయింది. అతనింట్లో పోలీసులకి ఆ డబ్బు మొత్తం దొరికింది.
(సుగ్రాఫ్టన్ కథకి స్వేచ్ఛానువాదం)

మల్లాది మిరియాలు
english title: 
malladi miriyalu
author: 
మల్లాది వెంకట కృష్ణమూర్తి

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>