జీవితంలో మనిషిని వెన్నంటి, బాధించే భావనల్లో అపరాధ భావమొకటి. ‘ఒకప్పుడు గతంలో నీవు చేసిన దానికో-లేక చేయవలసినది చేయనందుకో, అపరాధం జరిగిందనే భావనతో బ్రతుకుతుంటావా?’ అని అడుగుతాడు ఎక్‌హార్ట్‌టోల్. ‘ఈ విషయమై ఇంత మాత్రం కచ్చితంగా చెప్పవచ్చు: అప్పటి నీ చైతన్య స్థాయిననుసరించో, లేక నీ అవ్యక్త చేతనావస్థ స్థాయిననుసరించో నువ్వలా చేశావు. అప్పటికి నీవంతకన్నా మరింత ఎఱుక కలిగి ఉన్నట్లైతే, నీ చర్య మరో రకంగా ఉండి ఉండేది.’
అపరాధ భావం మోస్తూ ఉండడమనేది, అహం చేసే మరో ప్రయత్నం: తద్వారా తనకొక ప్రత్యేక స్థానం కల్పించుకోడానికి, ఒక ‘స్వ’ను పెంచి పోషించుకోడానికి చూస్తుంటుంది. ఆ ‘స్వ’ సకారాత్మకమైనదా, నకరాత్మకమైనదా అనేది అహానికి అంత ముఖ్యం కాదు. నువ్వానాడు చేసిన కృత్యం కానీ, లేక నెరవేర్చకుండా ఉండిపోయిన మరో విషయం గానీ, అవ్యక్త చైతన్యం యొక్క వ్యక్తీకరణం-మానవ అవ్యక్త చేతనావస్థ. కానీ అహం మాత్రం దానిని తనకు ఆపాదించుకోవాలి. ‘నేనప్పుడు అట్లా చేశాను’ అంటుంది. అందుచేత నువ్వు చెడ్డవాడివనే మనో చిత్రం మోస్తూ తిరుగుతుంటావ్.
మానవ చరిత్ర చూచినప్పుడు లెక్కకు మిక్కుటంగా మనుష్యులు ఒకరినొకరు హింసించుకున్నారు, క్రౌర్యంతో ప్రవర్తించారు; ఇప్పటికీ అవే అకృత్యాలు చేస్తూనే ఉన్నారు. అందుకని వారందరినీ ఖండిస్తూ ఉందామా? వారందరూ అపరాధులు, నేరస్థులు అని పేర్కొంటూ ఉందామా? లేక ఆ భయంకర కృత్యాలన్నీ వారి అచేతనావస్థను వ్యక్తీకరిస్తున్నై, అందామా? పరిణామ క్రమంలో అలాంటి దశనుండి మానవాళి ఎదుగుతుందని ఆశిద్దామా?
జీసస్ తన ప్రాణం తీస్తున్నవారిని గురించి ‘‘వారేమి చేస్తున్నారో వారికి తెలియదు కాబట్టి, వారిని క్షమించు భగవాన్’’ అనిన మాటలు నీకూనాకూ వర్తిస్తాయేమో!
బౌద్ధం యొక్క లోతైన అర్థం ఏమిటని ఎవరో అడిగినప్పుడు, బౌద్ధగురువు, ‘స్వ’ లేకపోతే సమస్య లేదు’ అన్నాడని గుర్తుంచుకో.
ఇప్పుడు, ‘ఈక్షణ’మనేది ఇలా వున్నదంటే, ఇది మరో రకంగా ఉండే అవకాశం లేదు కాబట్టే ఇలా ఉన్నదంటాడు ఎక్‌హార్ట్‌టోల్ (అంటే ప్రపంచంలోని సమస్తమూ ‘ఈ క్షణ పరిస్థితికి’ దోహదంచేసినవన్న మాట) బౌద్ధులు చిరకాలంగా ఎరిగినదీ, భౌతిక శాస్తవ్రేత్తలు ఈనాడు రూఢి పరుస్తున్న విషయమేమిటంటే, మరి దేనితోనూ సంబంధం లేకుండా పూర్తిగా వేరుపడి ఉండిపోయిన వస్తువులుగానీ, సంఘటనలు గానీ, ఏవీ ఉండవు అనే సత్యం. స్థూలాకారంలో ఏదైనా వేరుగా కనిపించే దాని క్రింద అన్నీ కూడా పరస్పర సంబంధం, పరస్పర ఆధారం కలిగి ఉంటాయనీ తేల్చారు. ఈ విశ్వంలో భాగంగా, ఈ ప్రస్తుత క్షణం పొందిన ఆకారానికి ఈ మొత్తం కారణభూతమై ఉన్నది.
ఇప్పుడున్నది (వాట్ ఈజ్) అంటే కనిపిస్తున్న దానిని శిరోధార్యమని అంగీకరించామంటే, జీవితం యొక్క ‘శక్తి, తెలివి’తో మనం జతపడ్డామన్న మాట. అలాంటి సందర్భంలోనే మనం ‘ప్రపంచంలో సకారాత్మక మార్పునకు దోహదం చేయగలిగి ఉంటాం.
మనుష్యుల్లో అధిక శాతం ‘ఇప్పుడు’ అనేదానిని, ‘ఇప్పుడు జరిగెడిది’ అని పొరబడుతుంటారు. కానీ ‘ఇప్పుడు’ అనేది అది కాదు; ‘ఇప్పుడు’ సంభవిస్తున్న దానికన్నా లోతైనది. ‘ఇప్పుడు’ అనే ప్రదేశంలో జరుగుతున్నటువంటిది.
అందుచేత ఈ క్షణంలో ఉన్నటువంటి దానిని-విషయమైనా, వస్తువైనా, భావమైనా-‘ఇప్పుడు’తో గందరగోళపరుచుకోకూడదు. ఇప్పుడు వెలువడిన ఏ విషయముకన్నా, వస్తువుకన్నా, ‘ఈ క్షణం’ మరెంతో లోతైనది.
నీలంరాజు లక్ష్మీప్రసాద్
english title:
neelamraju notebook
Date:
Sunday, November 18, 2012