కాకినాడ, నవంబర్ 18: రాష్ట్రంలో మెజారిటీ మీడియా ప్రతిపక్షాలకే అనుకూలంగా వ్యవహరిస్తోందని, ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం చేస్తున్న మంచిని సైతం వక్రీకరించే పరిస్థితి నెలకొన్నదని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి ఎంఎం పళ్లరాజు వ్యాఖ్యానించారు. తూర్పు గోదావరి జిల్లా కేంద్రం కాకినాడలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆదివారం మధ్యాహ్నం జరిగిన కార్యక్రమంలో పళ్లంరాజు మాట్లాడారు. రాష్ట్రంలో మీడియా సంస్థలు దాదాపు అన్నీ ప్రతిపక్ష పార్టీల చేతుల్లో ఉన్నాయన్నారు. అధికార కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నప్పటికీ వాటికి తగిన ప్రచారం లభించని పరిస్థితి ఉందన్నారు. కాంగ్రెస్ కార్యకర్తలు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడానికి కృషిచేయాలని కోరారు. మధ్యాహ్న భోజన పథకం, డ్వాక్రా సంఘాలకు రుణాల కల్పన, ఉపాధి హామీ తదితర పథకాలన్నిటికీ వెచ్చిస్తున్న నిధులను కేంద్రమే భరిస్తోందన్నారు. నిరుద్యోగ నిర్మూలనకు ప్రత్యేకించి దృష్టి సారించడంతో పాటు మానవ వనరులను సద్వినియోగం చేసుకునేందుకు ప్రత్యేకించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయని తెలిపారు.
వచ్చే మార్చి నాటికి విద్యాహక్కు చట్టం
అంతకుముందు కాకినాడ రూరల్ మండలం సర్పవరంలో ఏర్పాటుచేసిన ఓ కార్యక్రమంలో కేంద్రమంత్రి మాట్లాడుతూ 2013 మార్చి నాటికి దేశ వ్యాప్తంగా విద్యాహక్కు చట్టాన్ని అమల్లోకి తెచ్చేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. యువతను సాంకేతిక విద్యలో నైపుణ్యవంతులుగా తీర్చిదిద్దడానికి చర్యలు తీసుకున్నట్టు చెప్పారు. ప్రతి ఒక్కరికి ఉన్నత, సాంకేతిక విద్యనందించడానికి వీలుగా ఎస్‌ఐటిలు, ఐటిఐలను పెద్దఎత్తున ఏర్పాటుచేయనున్నట్టు పేర్కొన్నారు. రాజీవ్ విద్యామిషన్ ద్వారా ప్రాథమిక విద్యను అన్ని విధాలుగా పటిష్ఠం చేయడానికి ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్టు తెలియజేశారు. కేంద్ర ప్రభుత్వం బీమా విధానాల్లో కొన్ని మార్పులు తీసుకురావడం వలన తుపాన్లు, వరదల వంటి ప్రకృతి వైపరీత్యాల వలన పంటలు దెబ్బతిన్న రైతాంగానికి మరింత బీమా పరిహారం అందించే అవకాశం ఉందన్నారు.
కేంద్ర మంత్రి పళ్లంరాజు విమర్శ
english title:
ras
Date:
Monday, November 19, 2012