హైదరాబాద్, నవంబర్ 20: తెలంగాణకు అనుకూలమైతే సకల జన సమ్మెలో ఎందుకు పాల్గొలేదని టిడిపి అధినేత చంద్రబాబును టిఆర్‌ఎస్ శాసనసభా పక్షం ఉప నాయకుడు టి హరీష్‌రావు నిలదీశారు. వచ్చిన తెలంగాణను అడ్డుకొని, తెలంగాణకు తాను వ్యతిరేకం కాదని చంద్రబాబు మొసలి కన్నీరు కారుస్తున్నారని ఆయన విరుచుకుపడ్డారు. మెదక్ జిల్లా పర్యటనలో టిఆర్‌ఎస్‌కు ప్రజల సమస్యలు పట్టవని చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై హరీష్‌రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తెలంగాణ భవన్‌లో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, తెలంగాణలో విద్యుత్ కోతలపై ఉద్యమం చేసిందీ, మెడికల్ కాలేజి సీట్లలో జరిగిన అన్యాయాన్ని ప్రశ్నించిందీ, కృష్ణాడెల్టాకు నీళ్లు వదిలి తెలంగాణ రైతులకు నష్టం కలిగేలా వ్యవహరించిన సర్కార్‌ను నిలదీసిందీ టిఆర్‌ఎస్సా? టిడిపినా? చెప్పాలని నిలదీశారు. నీలం తుపాను వల్ల తెలంగాణ ప్రాంతంలో జరిగిన నష్టంపై కనీసం మాట మాత్రానికైనా చంద్రబాబు స్పందించారా? అని ఆయన ప్రశ్నించారు. ఒకవైపు తెలంగాణ ఉద్యమం, మరోవైపు ప్రజల సమస్యలపై నిరంతరం పోరాడుతున్నది తమ పార్టీయేనని ఆయన పేర్కొన్నారు. విద్యుత్ కోతల వల్ల తెలంగాణ రైతులు తీవ్రంగా నష్టపోతే ట్రాన్స్‌కో కార్యాలయాన్ని ముట్టడించి ఆందోళన చేసింది టిఆర్‌ఎస్ కాదా అని ఆయన విమర్శించారు. విద్యుత్ సమస్యపై తాము ఆందోళనకు దిగిన తర్వాతనే తమను టిడిడి నేతలు కాపికొట్టారని ఆయన విమర్శించారు.
తెలంగాణకు వ్యతిరేకం కాదని చెబుతోన్న చంద్రబాబు మరి వచ్చిన తెలంగాణను ఎందుకు అడ్డుకున్నారని ఆయన ప్రశ్నించారు. తెలంగాణపై అఖిల పక్షం సమావేశం అవసరం లేదని కేంద్ర హోంమంత్రే స్వయంగా ప్రకటించాక కూడా మళ్లీ అఖిల పక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలని కోరడం తెలంగాణకు అనుకూలం ఎలా అవుతుందని ఆయన ధ్వజమెత్తారు. ఎన్నికలు వస్తున్నాయంటే చంద్రబాబుకు ప్రజల సమస్యలు గుర్తుకు రావడం కొత్తేమి కాదని ఆయన విమర్శించారు. ప్రజల్లో చంద్రబాబుకు విశ్వసనీయత లేదని ఆయన దుయ్యబట్టారు. రాజకీయాల్లో అనుభవం పెరిగే కొద్ది వాస్తవాలు మాట్లాడాలి, విశ్వసనీయతను పెంచుకోవాలని హరీష్‌రావు హితవు పలికారు. అయితే చంద్రబాబుకు ఈ రెండు లోపించాయని ఆయన ధ్వజమెత్తారు. తెలంగాణ టిడిపి ఫోరమ్ నేతలు నకిలీ ఉద్యమకారులని, వారిని జనం నమ్మె పరిస్థితి లేదని హరీష్‌రావు దుయ్యబట్టారు.
తెలంగాణకు అనుకూలమైతే సకల జన సమ్మెలో ఎందుకు పాల్గొలేదని టిడిపి అధినేత చంద్రబాబును
english title:
t
Date:
Wednesday, November 21, 2012