తిరుపతి, నవంబర్ 20: కొంతమంది రాజకీయ స్వార్ధం కోసం అవిశ్వాస తీర్మానం పెట్టినా ప్రభుత్వ మనుగడకు ఎలాంటి ఢోకా ఉండదని కేంద్ర రైల్వే శాఖ మంత్రి పవన్‌కుమార్ బన్సల్ అన్నారు. శ్రీవారి దర్శనార్ధం కేంద్ర మంత్రి బన్సాల్, సహాయ మంత్రి కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డిలు మంగళవారం తిరుపతి రైల్వేస్టేషన్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా విలేఖరుల సమావేశంలో బన్సల్ మాట్లాడుతూ ఎఫ్‌డిఐలపై అవిశ్వాసం పెట్టేందుకు పిలుపునిచ్చిన నేపథ్యంలో రాజకీయ పరిణామాలు ఏ విధంగా ఉండబోతాయని అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వానికి ఎటువంటి ఢోకా లేదన్నారు. ఇదిలావుండగా తిరుపతిని బాలాజీ రైల్వే డివిజన్‌గా చేయడం ఇప్పట్లో సాధ్యం కాదన్నారు. దేశ వ్యాప్తంగా 68 డివిజన్‌లు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. వీటితో పాటు తిరుపతిలో బాలాజీ రైల్వే డివిజన్‌ను ఏర్పాటు చేయాలనే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నామన్నారు. తిరుపతి రైల్వే స్టేషన్ అభివృద్ధికి ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తామన్నారు. తిరుపతికి వీక్లీ రైళ్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. సికింద్రాబాద్ నుండి కర్నూలు మీదుగా వీక్లీ రైలును నడపనున్నట్లు తెలిపారు.
రైలు ప్రయాణికులందరికీ
భద్రత కల్పించలేం: జిఎం అస్థాన్
భారతీయ రైల్వేలో 2.34 కోట్ల మంది ప్రతిరోజు రైలు ప్రయాణం చేస్తున్నారని, అయితే వీరందరికీ భద్రత కల్పించడం కష్టసాధ్యమని రైల్వే జిఎం అస్థాన్ తెలిపారు. కేంద్ర మంత్రులతో కలసి తిరుపతి రైల్వే స్టేషన్‌లో జరిగిన విలేఖరుల సమావేశంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ తిరుపతి రైల్వేస్టేషన్‌కే కాదు ఏ స్టేషన్‌కు వెళ్లినా నాలుగైదు గేట్లు ఉంటాయన్నారు. ఈ పరిస్థితుల్లో వీరికి భద్రత కల్పించడం కష్టసాధ్యమన్నారు. టిటిడి చైర్మన్ కనుమూరి తదితరులు పాల్గొన్నారు.
బాపిరాజు, డిఆర్‌ఎం సింగ్, తిరుపతి మాజీ ఎమ్మెల్యే వెంకటరమణ, పిసి రాయల్ తదితరులు పాల్గొన్నారు.