హైదరాబాద్, నవంబర్ 20: ‘సన్ ఫార్మా థర్మల్ ప్రాజెక్టులో నాకు వాటా లేదు, కేంద్ర మంత్రి కిశోర్ చంద్రదేవ్‌కే ఉందేమో!?’ అని పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ఎదురు దాడికి దిగారు. సన్ ఫార్మా థర్మన్ ప్రాజెక్టులో మంత్రులు బొత్స సత్యనారాయణకు, శతృచర్ల విజయరామరాజుకు వాటా ఉంది కాబట్టే జంజావతి ప్రాజెక్టు నుంచి ఆ థర్మల్ ప్రాజెక్టుకు నీటిని విడుదల చేస్తున్నారంటూ కేంద్ర మంత్రి కిశోర్ చంద్రదేవ్ ఆరోపించడంపై బొత్స మంగళవారం మీడియాతో మాట్లాడుతూ తీవ్రంగా స్పందించారు. ‘్ఢల్లీ వాళ్ళు (సంస్ధ) కాబట్టి ఉంటే కేంద్ర మంత్రికే వాటా ఉందేమో’..అని బొత్స ఎదురు దాడి చేశారు. వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ సంస్ధకు 2.5 టిఎంసిల నీటిని విడుదల చేయాలన్న నిర్ణయం జరిగిందని, అయితే రైతులను కాదని ఒక ప్రైవేటు సంస్ధకు నీరు విడుదల చేయడం బాగుండదని చెప్పి తానే ఆ జివోను నిలిపి వేయించానని బొత్స తెలిపారు. ఆ తర్వాత కె రోశయ్య ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా 1.25 టిఎంసిల నీటిని విడుదల చేయాలన్న నిర్ణయం జరిగితే తానే అడ్డుకున్నానని ఆయన చెప్పారు. అటువంటిది తానే ఆ సంస్ధకు నీరు ఎలా విడుదల చేయిస్తానని ఆయన ఎదురు ప్రశ్నించారు. నిబంధనల ప్రకారం ఎంత నీరు ఇవ్వాలో అంతే ఇవ్వాలని ఎక్కువ నీరు ఇవ్వవద్దని తాను అప్పట్లో ముఖ్యమంత్రికి మూడు సార్లు లేఖ రాశానని, 10 సార్లు చెప్పానని, 15 నుంచి 20 సార్లు మంత్రులు పొన్నాల లక్ష్మయ్య, సుదర్శన్ రెడ్డిని, ఇతర ఉన్నతాధికారులను కోరానని ఆయన తెలిపారు. స్థానిక రైతులతో అక్కడ సమావేశం నిర్వహిస్తే వాస్తవాలు ఏమిటో అప్పుడు చెబుతానని అన్నారు. ఆ సమావేశానికి కేంద్ర మంత్రిని కూడా పిలవాలని ఆయన తెలిపారు. ఆ సంస్ధకు నీరు విడుదల చేయాలని కేంద్ర మంత్రి చెప్పినా, మరెవరు చెప్పినా నీరు విడుదల చేయవద్దని అన్నారు. తాను ఇంత ఖచ్చితంగా మాట్లాడినందుకే తనకు ఆపాదించారని ఆయన ఆవేదనను, బాధను వ్యక్తం చేశారు. నీటి విడుదల చేసేందుకు ప్రభుత్వం జివో జారీ చేసిన విషయం తనకు తెలియదని బొత్స మరో ప్రశ్నకు సమాధానంగా అన్నారు.
అమీతుమీకి సిద్ధపడుతున్న బొత్స
కేంద్ర గిరిజన శాఖా మంత్రి కిశోర్ చంద్రదేవ్‌తో అమీ-తుమీ తేల్చుకునేందుకు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ సిద్ధపడుతున్నారు. సన్ ఫార్మా థర్మల్ ప్రాజెక్టులో తనకు వాటా ఉంది కాబట్టే నీరు విడుదల చేయిస్తున్నానంటూ కేంద్ర మంత్రి ఆరోపించడంపై బొత్స తన అనుయాయుల వద్ద ఆవేదన, బాధ, ఆక్రోశాన్ని వ్యక్తం చేశారని తెలిసింది.
కేంద్ర మంత్రికి జిల్లాలో ఉన్న పలుకుబడి ఎంతో అందరికీ తెలిసిందేనని, కేంద్ర మంత్రి నియోజకవర్గంలో తాను వెళ్ళి ప్రచారం చేయాల్సి వచ్చిందని ఆయన అన్నట్లు సమాచారం. కుల ధృవపత్రం కూడా వివాదానికి దారి తీసిన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేసినట్లు తెలిసింది.
కేంద్ర మంత్రి కిశోర్ చంద్రదేవ్‌కే ఉందేమో!? పిసిసి నేత బొత్స ఎదురుదాడి
english title:
a
Date:
Wednesday, November 21, 2012