హైదరాబాద్, నవంబర్ 20: రాష్ట్రంలో ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రమాణాల తనిఖీలను ఈ నెల చివరి నుండి మరింత ముమ్మరం చేయనున్నట్టు సాంకేతిక విద్యా కమిషనర్ అజయ్‌జైన్ వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం నియమించిన వృత్తివిద్యా శాఖ టాస్క్ఫోర్సు కమిటీ సమావేశం జరిగింది. అనంతరం అజయ్‌జైన్ మాట్లాడుతూ ఈ నెల 26వ తేదీ నుండి డిసెంబర్ 1వ తేదీ వరకూ 200 కాలేజీలను తనిఖీ చేస్తామని వెల్లడించారు. డిసెంబర్ 10వ తేదీ నుండి డిసెంబర్ 15 వరకూ 180 కాలేజీలను, డిసెంబర్ 26 నుండి డిసెంబర్ 30 వరకూ 139 కాలేజీలను తనిఖీ చేయాలని షెడ్యూలు రూపొందించినట్టు వెల్లడించారు. కాలేజీల జాబితా, తనిఖీ తేదీలను సైతం వెబ్‌సైట్‌లలో ఒక రోజు ముందు ఉంచుతుంటామని, వీటిని డిటిఇఎపి డాట్ ఎన్‌ఐసి డాట్ ఇన్, ఎపిఎస్‌సిహెచ్‌ఇ డాట్ సిజిజి డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్‌సైట్లలో చూడవచ్చని అన్నారు. తొలి దశలో 46 కాలేజీలను, రెండో దశలో 119 కాలేజీలను టాస్క్ఫోర్సులు తనిఖీ చేశాయని ఆయన వివరించారు. ఐదో దశ పూర్తయ్యేనాటికి 684 కాలేజీల తనిఖీ పూర్తవుతుందని చెప్పారు. రెండు దశల్లో తనిఖీ చేసిన 165 కాలేజీల నివేదికను ప్రభుత్వానికి పంపిస్తున్నామని, అలాగే రెండో దశ నివేదికను సైతం ప్రభుత్వానికి పంపించామని వివరించారు. ఈ నివేదికల ఆధారంగా ప్రభుత్వం తగు చర్యలు చేపడుతుందని చెప్పారు.
ప్రధానంగా భవనాలు, సిబ్బంది కొరత ఎక్కువగా కనిపిస్తోందని స్పష్టమవుతోందని వివరించారు. రంగారెడ్డి, చిత్తూరు, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల్లో అత్యధిక సంఖ్యలో కాలేజీలు ఉన్నందున అదనంగా రీజనల్ టాస్క్ఫోర్సులను నియమించి వాటి ద్వారా ఎక్కువ సంఖ్యలో తనిఖీలు చేపట్టాలని నిర్ణయించినట్టు అజయ్‌జైన్ తెలిపారు. వచ్చే ఏడాది జనవరి నుండి పార్మసీ, ఎంబిఎ, ఎంసిఎ కాలేజీల్లో కూడా తనిఖీలు చేస్తామని చెప్పారు. కాలేజీల్లో ప్రమాణాలను పెంచడానికి యాజమాన్యాలకు సరిపడా గడువును ఇది వరకే ఇవ్వడం జరిగిందని అన్నారు. ఇప్పటికీ ఏమైనా లోపాలు ఉంటే వాటిని వెంటనే సరిదిద్దుకోవాలని సూచించారు.
ప్రభుత్వం కక్ష సాధింపునకు దిగుతోందని, ఎఐసిటిఇ తదితర జాతీయ సంస్థలు అనుమతి మంజూరు చేసిన తర్వాత, యూనివర్శిటీల అధికారులు వచ్చి చూసిన తర్వాత మరో మారు టాస్క్ఫోర్సుల పేరుతో తనిఖీలు ఏ మాత్రం సరికాదని యాజమాన్యాలు వ్యాఖ్యానిస్తున్నాయి.
మొత్తం 519 కాలేజీల రికార్డుల పరిశీలన చర్యలకు సిద్ధమవుతున్న ప్రభుత్వం అమీతుమీకి సిద్ధమంటున్న యాజమాన్యాలు టాస్క్ఫోర్స్ సమావేశంలో నిర్ణయం
english title:
tani
Date:
Wednesday, November 21, 2012