హైదరాబాద్, నవంబర్ 20: రైతుల రుణాల రీ షెడ్యూలుపై సాధారణ వడ్డీ విధించాలని బ్యాంకర్లను కేంద్ర ఆర్థిక మంత్రి చిదరంబరం ఆదేశించారు. రాష్ట్రంలో ప్రకృతి వైపరీత్యాల వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయారని, రైతుల రుణాల రీ షెడ్యూలుకు సాధారణ వడ్డీ వసూలు చేయాలని కోరుతూ ముఖ్యమంత్రి కె. కిరణ్‌కుమార్‌రెడ్డి కేంద్ర ఆర్థిక మంత్రి పి చిదంబరానికి విజ్ఞప్తి చేశారు. దీనికి కేంద్ర మంత్రి అంగీకరించి, బ్యాంకర్లకు ఈ మేరకు ఆదేశాలు జారీ చేసినట్టు ముఖ్యమంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. బెంగళూరులో మంగళవారం జరిగిన దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రభుత్వరంగ బ్యాంకుల, ఆర్థిక సంస్థల ముఖ్య కార్యనిర్వహణ అధికారుల సమావేశంలో ముఖ్యమంత్రి విజ్ఞప్తి మేరకు కేంద్ర ఆర్థిక మంత్రి ఈ ఆదేశాలు జారీ చేసినట్టు తెలిపారు. రైతులకు సాధారణ రుణాలకు వడ్డీ ఏడు శాతం కాగా, రీ షెడ్యూల్ రుణాల వడ్డీ రేటు 12 నుంచి 14 శాతం వరకు ఉంటుంది. అయితే ఈ ఆదేశాలతో రీ షెడ్యూల్ రుణాలకు సైతం ఏడు శాతం వడ్డీ వసూలు చేస్తారు. అదే విధంగా మైనార్టీలు, ఎస్సీ, ఎస్టీలకు ఉద్దేశించిన లక్ష్యాలను పూర్తి చేయడానికి కృషి చేయాలని ఆర్థిక మంత్రి బ్యాంకర్లను ఆదేశించారు. సకాలంలో రుణాలు చెల్లించే రైతులకు రాష్ట్ర ప్రభుత్వం మూడు శాతం రాయితీ ఇస్తోంది. అంటే సకాలంలో రుణాలు చెల్లించే రైతులకు రీ షెడ్యూల్ రుణాలకు సైతం నాలుగు శాతం వడ్డీ చెల్లిస్తే సరిపోతుంది. దీని వల్ల ప్రకృతి వైపరీత్యాలతో దెబ్బతిన్న లక్షలాది మంది రైతులకు ప్రయోజనం కలుగుతుందని తెలిపారు. నీలం తుపాను వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయినందున ముందస్తుగా రబీ వేసుకోవడానికి వీలుగా రుణ సహాయాన్ని తక్షణమే అందించాలని, ఎటువంటి జాప్యం జరిగినా సహించేది లేదని కేంద్ర మంత్రి చిదంబరం బ్యాంకర్లను ఆదేశించారు. రాష్ట్రంలో లైసెన్స్‌డు సాగు రైతులకు ఈ ఏడాది నిర్దేశించిన రెండువేల కోట్ల రూపాయల రుణ పంపిణీ లక్ష్యాన్ని పూర్తి చేయాలని, ఇప్పటికి కేవలం రెండువందల కోట్ల రూపాయల పంపిణీ మాత్రమే జరగడం పట్ల మంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. రైతులందరికీ నోఫ్రిల్ అకౌంట్లను ప్రారంభించాలని మంత్రి ఆదేశించారు. గిరిజన ప్రాంతాలు, వెనుకబడిన ప్రాంతాల్లో కనీసం 30 బ్యాంకు శాఖలను తెరవాలని బ్యాంకర్లను ఆదేశించారు.
సిఎం కిరణ్ విజ్ఞప్తికి చిదంబరం అంగీకారం
english title:
re
Date:
Wednesday, November 21, 2012