హైదరాబాద్, నవంబర్ 20: టిడిపి ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ మీడియా సమావేశంలో ఉద్వేగాన్ని ఆపుకోలేక కన్నీరు పెట్టారు. తాను టిడిపిని వీడి వెళుతున్నట్టు జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని, తనపై జరుగుతున్న కుట్రలో భాగంగా ఈ ప్రచారం జరుగుతోందని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా పలువురు టిడిపి ఎమ్మెల్యేలు పార్టీ వీడి వెళుతున్న ఈ సమయంలో పార్టీ వీడి వెళతారని పలువురు నాయకుల పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. ఇదే విధంగా పయ్యావుల కేశవ్ పేరు కూడా వచ్చింది. దీనిపై మంగళవారం ఆయన టిడిఎల్‌పి కార్యాలయంలో విలేఖరులతో మాట్లాడారు. తాను పార్టీ వీడి వెళ్లేది లేదని, చివరి వరకు టిడిపిలోనే కార్యకర్తగా ఉంటానని అన్నారు. నేను కోట్లు సంపాదించలేదు, కానీ కీర్తిని సంపాదించాను, పార్టీ వీడను అని అన్నారు. వైఎస్‌ఆర్ తండ్రిపైనే తాను పోరాటం చేశానని, ఆ పోరాటం కొనసాగిస్తానని అన్నారు. కుట్రలో భాగంగానే కొందరు తాను వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌లో చేరుతున్నట్టు ప్రచారం చేశారని అన్నారు. మీడియా వాస్తవాలు తెలుసుకొని రాయాలని, సంయమనంతో ఉండాలని అన్నారు. తాను టిడిపిని వీడి వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతానని ఆ పార్టీ నాయకులు కాణిపాకం వినాయకునిపై ప్రమాణం చేసి చెప్పగలరా? అని కేశవ్ ప్రశ్నించారు. ఇలాంటి ప్రచారానికి, బెదిరింపులకు భయపడే వ్యక్తిని కానని అన్నారు.
...............................
వైఎస్ పాలన శ్మశాన యుగం
టిడిపి ధ్వజం
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, నవంబర్ 20: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి పాలన శ్మశాన యుగం అని టిడిపి పొలిట్ బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు విమర్శించారు. వైఎస్‌ఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తీసుకున్న నిర్ణయాల వల్ల ఇప్పుడు మంత్రులు, అధికారులు, పారిశ్రామిక వేత్తలు జైలుకు వెళ్లారని, సిబిఐ ఎఫ్‌ఐఆర్‌లో వైఎస్‌ఆర్ పేరు కూడా ఉందని తెలిపారు. అలాంటప్పుడు ఆయన పాలన శ్మశాన యుగం అవుతుంది కానీ స్వర్ణయుగం ఎలా అవుతుందని ప్రశ్నించారు. వైఎస్‌ఆర్ అధికారంలోకి వచ్చిన తరువాత 14వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని, ఇది శ్మశాన యుగం కాకుంటే మరేమిటని ప్రశ్నించారు. చంద్రబాబును విమర్శిస్తూ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ అధ్యక్షురాలు విజయమ్మ చేసిన వ్యాఖ్యలను యనమల ఖండించారు. తన మామ ఎన్టీరామారావు తెలుగుదేశం పార్టీని ఏర్పాటు చేసినప్పుడు ఆయనకు సహాయంగా ఉండడానికే చంద్రబాబు కాంగ్రెస్‌ను వీడి టిడిపిలో చేరారని, అంతే తప్ప పార్టీ ఫిరాయించడం కోసం కాదని అన్నారు. కానీ ఇప్పుడు టిడిపి గుర్తుపై ఎన్నికైన ఎమ్మెల్యేలను వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌లో చేర్పించుకోవడం నైతికంగా ఎంతవరకు సబబు అని ప్రశ్నించారు. టిడిపిని ఏర్పాటు చేసినప్పుడు ఎన్టీరామారావు యువతకు అవకాశాలను కల్పించారు తప్ప ఫిరాయింపులను ప్రోత్సహించలేదని అన్నారు. జగన్ ప్యాకేజీల వల్లనే ఎమ్మెల్యేలు పార్టీ వీడి వెళుతూ వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌లో చేరుతున్నారని అన్నారు. చంద్రబాబు హయాంలో రాష్ట్రంలో గతంలో ఎప్పుడూ లేని విధంగా అభివృద్ధి జరిగిందని, హైటెక్ సిటీ నిర్మాణం జరిగిందని, మారుమూల గ్రామాలకు సైతం రోడ్లు వేశారని తెలిపారు. తీవ్రమైన కరువులోనూ ఒక్క ఎకరం కూడా ఎండిపోకుండా తొమ్మిది గంటల పాటు వ్యవసాయానికి విద్యుత్ సరఫరా చేసినట్టు తెలిపారు.
విశ్వసనీయత ఉంది
మాకు విశ్వసనీయత ఉంది కాబట్టే 2009 ఎన్నికల్లో టిఆర్‌ఎస్ టిడిపితో పొత్తు పెట్టుకుందని యనమల తెలిపారు. విశ్వసనీయత ఉంది కాబట్టే ప్రణబ్ ముఖర్జీకి లేఖ ఇచ్చామని అన్నారు. విశ్వసనీయత లేదు కాబట్టే కేంద్రం తెలంగాణపై ఇప్పటివరకు నిర్ణయం తీసుకోలేదని విమర్శించారు.
దోచుకోవడమే విశ్వసనీయతా?: బొజ్జల
రాష్ట్రాన్ని దోచుకోవడమే విశ్వసనీయతా? అని టిడిపి ఎంపి సి.ఎం. రమేష్, ఎమ్మెల్యేలు బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, గాలి ముద్దు కృష్ణమనాయుడు విమర్శించారు. చంద్రబాబుకు విశ్వసనీయత లేదని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు విజయమ్మ చేసిన వ్యాఖ్యలను ఖండించారు. రాష్ట్రాన్ని దోచుకోవడం తప్ప వైఎస్‌ఆర్ పాలనలో రాష్ట్రానికి జరిగిన మేలు ఏమీ లేదని అన్నారు.