న్యూఢిల్లీ, జనవరి 27: విశాఖపట్నంలోని ఈనాడు కార్యాలయానికి సంబంధించిన భూవివాదం కేసులో చైర్మన్ చెరుకూరి రామోజీరావుకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. లీజు గడువు ముగిసినప్పటికీ తమ ఆస్తిని తిరిగి అప్పగించేందుకు నిరాకరించటమేకాక తమకు తెలియకుండా కొంత భూమిని రహదారి విస్తరణకు ఇచ్చి తమని మోసగించారని భూ యజమాని కుమార్‌వర్మ విశాఖ త్రీటౌన్ పోలీసు స్టేషన్‌లో చీటింగ్ కేసు దాఖలు చేసిన విషయం విధితమే. అలాగే లీజును పొడిగించేందుకు ఆయన నిరాకరిస్తున్నారు. అయితే లీజును పొడిగించటంతో పాటు గతంలో తాను దాఖలు చేసిన కౌంటర్‌లో కొన్ని సవరణలు చేయటానికి అనుమతించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ రామోజీరావు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. కేసుకు సంబంధించి కౌంటర్‌లో సవరణలు చేపేట్టేందుకు సుప్రీం కోర్టు అనుమతి నిరాకరించింది. ఇంత జాప్యం జరిగిన తరువాత సవరణలకు అనుమతి ఇవ్వాలని కోరటంలో అర్థం లేదని జస్టిస్ లోదా, జస్టిస్ గోఖ్లేతో కూడిన బెంచి అభిప్రాయపడింది. తనకు జరిగిన అన్యాయాన్ని సాక్ష్యాధారాలతో రుజువు చేసిన పిటిషనర్ కుమార్‌వర్మ ప్రయోజనాలకు విఘాతం కలిగించలేమని న్యాయమూర్తులు స్పష్టం చేశారు. అంతేకాక రామోజీరావుపై బనాయించిన క్రిమినల్ కేసు పరిణామాలను ఎదుర్కోక తప్పదని న్యాయమూర్తులు స్పష్టం చేశారు. ఈనాడు కార్యాలయం ప్రారంభానికి తాను పదకొండువేల చదరపు అడుగుల స్థలం ఇచ్చినట్టు కుమార్‌వర్మ తన పిటిషన్‌లో తెలియచేశారు. అయితే తనకు కుమార్‌వర్మ 9200 చదరపు అడుగులే ఇచ్చారని, మిగిలిన 1800 చదరపు అడుగుల భూమి తనదేనని రామోజీరావు తన కౌంటర్‌లో తెలియచేశారు. రామోజీరావుకు అసలు భూమే లేనప్పుడు 1800 చదరపు అడుగుల భూమి ఎలా వచ్చిందో విచారణ చేయించాలని కుమార్‌వర్మ డిమాండ్ చేశారు. రికార్డులను పరిశీలించిన అధికారులు రామోజీరావుకు ఒక్క అంగుళం భూమిలేదని తేల్చారు. తాను తప్పు లెక్కలు వేశానని ఒప్పుకుంటూ, 11వేల చదరపు అడుగుల భూమిని కుమార్‌వర్మ ఇచ్చారని అంగీకరిస్తూ రామోజీరావు కోర్టుకు అఫిడవిట్‌లో తెలియచేశారు. అయితే రాష్ట్ర హైకోర్టు సహా అన్ని న్యాయస్థానాలూ రామోజీరావు విజ్ఞప్తులను త్రోసిపుచ్చుతూ, ఇచ్చిన తీర్పులను తాము సమర్థిస్తున్నామని జస్టిస్ గోఖలే, జస్టిస్ దత్తు స్పష్టం చేశారు.
కౌంటర్ పిటిషన్ సవరణకు నిరాకరించిన సుప్రీం
english title:
ramojeeki
Date:
Saturday, January 28, 2012