ఇంఫాల్, జనవరి 27: మిలిటెంట్ల బాంబు దాడుల పడగ నీడన మణిపూర్‌లో శనివారం అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. దీంతో ఉత్తరప్రదేశ్, పంజాబ్ సహా అయిదు రాష్ట్రాల్లో కీలకమైన ఓటింగ్ ఘట్టం ప్రారంభమవుతుంది. కొన్ని తీవ్రవాద గ్రూపులు పోలింగ్ ప్రక్రియను భగ్నం చేయడానికి ప్రయత్నించవచ్చన్న వార్తలు వచ్చిన నేపథ్యంలో శనివారం పోలింగ్ జరగనున్న మణిపూర్‌లో శాంతిభద్రతల పరిస్థితిపై భద్రతా దళాలు గట్టి నిఘా పెట్టి ఉన్నాయి. అరవై అసెంబ్లీ స్థానాలకు మొత్తం 279 మంది అభ్యర్థులు రంగంలో ఉన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద కాపలాకు కేంద్ర పారా మిలిటరీ సిబ్బందిని మాత్రమే నియమిస్తామని, రాష్ట్ర పోలీసులు ఎవరూ ఉండరని అధికార వర్గాలు శుక్రవారం ఇక్కడ చెప్పాయి. అయితే అవసరమైన పక్షంలో రాష్ట్ర పోలీసులు కూడా పోలీసు స్టేషన్ల వద్ద కాపలా కోసం నియమిస్తారని ఆ వర్గాలు తెలిపాయి.
మిగిలిన నాలుగు రాష్ట్రాల్లో పంజాబ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో పోలింగ్ ఈ నెల 30న జరగనుండగా, గోవాలో మార్చి 3న పోలింగ్ జరుగుతుంది. కాగా, ఏడు విడతలుగా జరిగే ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ చివరిఘట్టం కూడా అదే రోజు ముగుస్తుంది. అయిదు రాష్ట్రాల్లోను వోట్ల లెక్కింపు మార్చి 8న జరుగుతుంది.
కాగా, మణిపూర్‌లో పోలింగ్ సిబ్బంది, భద్రతా సిబ్బందిలో చాలామంది ఇప్పటికే రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చేరుకున్నట్లు రాష్ట్ర ఎన్నికల కార్యాలయం తెలియజేసింది. ఇంఫాల్ తూర్పు, ఇంఫాల్ పశ్చిమ జిల్లాల్లో ఎన్నికల సిబ్బంది ఈ రాత్రికి చేరుకుంటారు. మొత్తం 2,357 పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికల నిర్వహణకు 12,867 మంది సిబ్బందిని నియమించినట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. పోలింగ్ ఉదయం 7 గంటలకు ప్రారంభమై సాయంత్రం 4 గంటలకు ముగుస్తుంది. మొత్తం 17, 40, 576 మంది ఓటర్లు ఉండగా, వారిలో 8,82,236 మంది మహిళా ఓటర్లు.
గత కొద్ది రోజులుగా రాష్ట్రంలో వరసగా బాంబు పేలుళ్లు జరుగుతున్న నేపథ్యంలో తీవ్రవాద సంస్థలు కొంతమంది అభ్యర్థులపై దాడి చేసే అవకాశముందని రాష్ట్ర రాజధానికి వార్తలు వస్తున్నాయి. శుక్రవారం ఉదయం మణిపూర్ పశ్చిమ జిల్లా తంగ్‌మీబండ్‌లో మాజీ ప్రభుత్వ అధికారి ఇంటిముందు బాంబు పేలడంతో ఒక వ్యక్తి గాయపడ్డాడు. వైద్యురాలయిన విలాసినీ దేవి ఇంటిపైకి మిలిటెంట్లు బాంబు విసిరినట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఆమె భర్త గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసారు. నిన్న గణతంత్ర దినోత్సవం నాడు మిలిటెంట్లు ఇంఫాల్‌లోని క్యాపిటల్ కాంప్లెక్స్‌లో శక్తివంతమైన బాంబును పేల్చారు. అయితే ఈ పేలుడులో ఎవరూ చనిపోలేదు. అంతకుముందు రోజు రాత్రి కూడా మిలిటెంట్లు ఇంఫాల్ పశ్చిమ జిల్లాలోని కక్వా వద్ద రెండు శక్తివంతమైన బాంబులను పేల్చారు.
మొదలు కానున్న అయిదు రాష్ట్రాల ఓటింగ్ ప్రక్రియ
english title:
manipoorlo nedu poling
Date:
Saturday, January 28, 2012