హైదరాబాద్, జనవరి 27: ఎమ్మార్ ప్రాపర్టీస్ కుంభకోణం కేసులో జ్యుడిషియల్ రిమాండ్‌లో ఉన్న సునీల్‌రెడ్డిని రెండున్నరోజుల పాటు సిబిఐ కస్టడీకి అప్పగిస్తూ సిబిఐ కేసుల ప్రత్యేక న్యాయస్థానం శుక్రవారం ఆదేశించింది. నిందితుడిని తమకు 15రోజుల పాటు కస్టడీకి అప్పగించాలని సిబిఐ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన కోర్టు శనివారం ఉదయం కస్టడీకి తీసుకుని తిరిగి సోమవారం మధ్యాహ్నం కోర్టులో హాజరు పర్చాలని ఆదేశించింది. ఈ సందర్భంగా కోర్టులో సునీల్‌రెడ్డి, సిబిఐ తరఫు న్యాయవాదులు కస్టడీ పిటిషన్‌పై పెద్దఎత్తున వాదోపవాదాలు జరిపారు. సునీల్‌రెడ్డి తరఫు న్యాయవాది సుశీల్‌కుమార్ వాదిస్తూ
నోటీసు ఇవ్వకుండానే అరెస్టు చేశారని, సెర్చ్ మెమో లేకుండా ఎలా ఆయన నివాసంలో సిబిఐ సోదాలు చేసిందని ప్రశ్నించారు. సోదాల్లో ఏం స్వాధీనం చేసుకున్నారో వాటి వివరాలను కోర్టుకు వెల్లడించలేదని చెప్పారు. అదీకాకుండా అవినీతి నిరోధక చట్టం సెక్షన్లు విధించేందుకు సునీల్‌రెడ్డి ప్రభుత్వ ఉద్యోగి కాదని, చట్ట ప్రకారం ఆ సెక్షన్లు చెల్లవని అన్నారు. కేవలం తుమ్మల రంగారావు వాంగ్మూలాన్ని ఆధారం చేసుకుని ఎలా అరెస్టు చేస్తారని అడిగారు. ఉదయం 6.50 గంటలకు అదుపులోకి తీసుకుని సాయంత్రం 6.50 గంటలకు అరెస్టు చూపించారన్నారు. అరెస్టు చేసిన 24 గంటల్లో కోర్టులో హాజరు పర్చాల్సి ఉండగా తర్వాత రోజు మధ్యాహ్నం కోర్టులో హాజరుపర్చారని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఇందుకు సిబిఐ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ గత కొన్ని రోజులుగా సునీల్‌రెడ్డి ఇళ్ళు మారుస్తూ తప్పించుకు తిరుగుతున్నారన్నారు. 24న స్వయంగా ఆయనే దిల్‌కుషా అతిథి గృహానికి వచ్చారని, అనంతరం అన్ని ఆధారాలు ధృవీకరించుకున్నాకే అరెస్టు చేశామని చెప్పారు. విల్లాల విక్రయాలకు సంబంధించి సునీల్‌రెడ్డికి పెద్ద ఎత్తున నగదు చేరిందని, నగదు ఎక్కడికి వెళ్లిందీ, దీని వెనుక ఎవరు ఉండి నడిపించిందీ వివరాలను రాబట్టాల్సిన అవసరం ఉందని కోర్టుకు వివరించారు. 15 రోజులపాటు కస్టడీకి అప్పగిస్తే పూర్తిస్థాయిలో విచారణ చేసి వాస్తవాలను బయటకు తీస్తామన్నారు. ఎమ్మార్ కేసులో 2002కి ముందు నుంచీ విచారణ చేస్తున్నామని సిబిఐ అధికారులు వివరించారు. అప్పటి నుంచి ఉన్న అన్ని లింకులను పరిశీలించాలంటే నగదు ఏవిధంగా చేతులు మారిందీ తేలాల్సి ఉందన్నారు. ఇందుకు సునీల్‌రెడ్డి కీలకమైనందున తమ కస్టడీకి ఇవ్వాలని వాదించారు. దీంతో సునీల్‌రెడ్డిని రెండున్నరోజుల పాటు సిబిఐ కస్టడీకి ఇస్తూ కోర్టు ఆదేశించింది.
రెండున్నర రోజులు విచారణకు కోర్టు అనుమతి
english title:
cbi
Date:
Saturday, January 28, 2012