వినుకొండ, నవంబర్ 23: ఎన్నికలు ఎప్పుడొచ్చినా వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి కావడం తథ్యమని వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ రాష్ట్ర నాయకులు అంబటి రాంబాబు అన్నారు. శుక్రవారం రాత్రి స్థానిక పల్నాడురోడ్డులో జరిగిన బహిరంగసభలో మాట్లాడారు. సభకు వైఎస్సార్ సీపీ నేత చెన్నకేశవరెడ్డి అధ్యక్షత వహించారు. దివంగత ప్రధాని ఇందిరాగాంధీ మరణిస్తే, ఆమె కుమారుడు రాజీవ్‌గాంధీ ప్రధాని అయ్యాడని, రాజీవ్‌గాంధీ మరణిస్తే సోనియాగాంధీ కేంద్రంలో చక్రం తిప్పుతుండగా, ప్రజా హృదయాలను చూరగొన్న వైఎస్ రాజశేఖరెడ్డి మరణిస్తే, ఆయన కుమారుడు వైఎస్ జగన్మోహన్‌రెడ్డికి ముఖ్యమంత్రి అయ్యే అర్హత లేదా అని ప్రశ్నించారు. కాంగ్రెస్‌పార్టీకి ఎదురు తిరిగినందుకు కాంగ్రెస్ ప్రభుత్వం జగన్‌ను జైల్లో పెట్టించిందన్నారు. కాంగ్రెస్, తెలుగుదేశంపార్టీలు కుమ్మక్కై జగన్‌ను అకారణంగా జైల్లో పెట్టించారని దుయ్యబట్టారు. నారా చంద్రబాబు పాదయాత్రలు చేస్తుంటే, ఆ పార్టీలోని ఎమ్మెల్యేలు బాబుపై విశ్వాసం లేక వైఎస్సార్ సీపీలోకి వలసయాత్రలు చేస్తున్నారని, ఎన్నికల్లో జిల్లాలో టిడిపికి ఒక్కసీటు కూడా దక్కదని అంబటి జోస్యం చెప్పారు. బెల్టుషాపులకు శ్రీకారం చుట్టిన బాబు వాటిని ఎత్తేస్తామనడం హాస్యాస్ప దమన్నారు. వైఎస్సార్ సీపీ జిల్లా కన్వీనర్ మర్రి రాజశేఖర్ మాట్లాడుతూ జగన్‌ను సిఎం చేయడమే తమ ధ్యేయమన్నారు. రానున్న ఎన్నికల్లో చంద్రబాబుకు ఘోర ఓటమి తప్పదన్నారు. అనంతరం సభలో వినుకొండ నియోజకవర్గంలోని పట్టణ, మండల కన్వీనర్లచే జిల్లా కన్వీనర్ మర్రి రాజశేఖర్ ప్రమాణస్వీకారం చేయించారు. తొలుత లాయర్స్‌వీధిలో వైఎస్సార్ సీపీనేత డాక్టర్ నన్నపనేని సుధ ఏర్పాటుచేసిన వైఎస్సార్ సీపీ కార్యాలయాన్ని రాజశేఖర్ ప్రారంభించారు. స్థానిక బాలాజీ ఎస్టేట్‌నుండి వైఎస్సార్ సీపీ నాయకులను కార్యకర్తలు, అభిమానులు సభావేదిక వద్దకు ర్యాలీగా తోడ్కొని వచ్చారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ నాయకులు ఆళ్ళ రామకృష్ణారెడ్డి, సాయిబాబు, నన్నపనేని సుధ, రేవతి, హనుమానాయక్, డాక్టర్ లతీష్‌రెడ్డి, బాజీ, వి సుబ్బారారెడ్డి, ఆర్ పుల్లారెడ్డి, చికెన్‌బాబు, కె కృష్ణారెడ్డి, దస్తగిరి పాల్గొన్నారు.
‘కృషిమార్ట్’ పసుపు పొడి తయారీ ప్రారంభం
దుగ్గిరాల, నవంబర్ 23: సహాయ సంఘాల ఆధ్వర్యంలో పసుపు పొడి తయారీని శుక్రవారం ప్రారంభించారు. స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డులో స్వయం సహాయక సంఘాల రాష్ట్ర డైరెక్టర్ శ్రీనివాసబాబా సభ్యులతో శుక్రవారం సమావేశమైయ్యారు. పసుపుపొడి మార్కెట్ సమర్థవంతంగా నిర్వహించేందుకుగాను యార్డు అధికారులు ప్రోత్సాహం అందించి సహకరించాలని కోరారు. 10-15మంది సభ్యులతో కమిటీగా ఏర్పడితే శ్రీనిధి ద్వారా వారికి కొనుగోలుకు నిధులు అందిస్తామని ఆయన అన్నారు. గతంలో అమరావతి బ్రాండ్ పేరిట ప్రారంభమై లాభాల్లో పయనించినా... పసుపుపొడి ప్యాకింగ్‌ను అర్ధాంతరంగా నిలిపివేశారు. ధరలు ప్రస్తుతం తక్కువగా ఉండటంతో పునఃప్రారంభించారు. స్వయం సహాయక గ్రూపుల ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్న ఉత్పత్తులు కృషి మార్ట్‌పేరిట మార్కెటింగ్ చేస్తున్నారు. ఈనేపథ్యంలో ఇకపై పసుపుపొడి కూడా అదేబ్రాండ్‌తో విక్రయించాలని నిర్ణయించారు. కార్యక్రమంలో డిఆర్‌డిఏ పిడి బి వెంకటరెడ్డి, యార్డుకార్యదర్శి శారదారాణి, ఏరియా కో-ఆర్డినేటర్ ఆర్ రాజ్యలక్ష్మి, డిసిఎం మార్కెట్ అశోక్, ప్రమీలారాణి, సంతోషం, మండలసమాఖ్య అధ్యక్షురాలు లోకం శివపార్వతి పాల్గొన్నారు.
‘డెల్టా’ దుస్థ్థితికి కాంగ్రెసే కారణం
* జిల్లా టిడిపి అధ్యక్షుడు ప్రత్తిపాటి
రొంపిచర్ల, నవంబర్ 23: నూట ఏభైఏళ్ళ చరిత్ర కలిగిన డెల్టాకు సాగునీరు అందించని దౌర్భాగ్యస్థితికి కాంగ్రెస్‌పార్టీయే కారణమని జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. మండలంలోని సుబ్బయ్యపాలెంలో తెలుగుయువత రాష్టక్రార్యదర్శి శాఖమూరి శ్రీనివాసరావుతండ్రి సత్యనారాయణ వర్థంతి కార్యక్రమానికి శుక్రవారం ఆయన విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్సార్ పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్ ద్వారా రాయలసీమప్రాంతానికి సాగునీటిని అందించారని దీనివల్ల నాగార్జునసాగర్ ప్రాజెక్టు పరిధిలోని రైతాంగం సాగునీటి ఎద్దడిని ఎదుర్కొందన్నారు. రైతులు 48గంటలపాటు రోడ్డెక్కితే ప్రభుత్వం దిగి వస్తుందన్నారు.
రబీలో ఆరుతడి పంటలకు నీరు అందించేంతవరకు తమపార్టీ పోరాడుతుందన్నారు. వర్థంతి కార్యక్రమంలో రాష్ట్ర టిడిపి అధికార ప్రతినిధి డాక్టర్ కోడెల శివప్రసాదరావు, ఎమ్మెల్యేలు జీవీ ఆంజనేయులు, టి ప్రభాకర్, సినీనటి కవిత పాల్గొన్నారు. దివంగత శాఖమూరి సత్యనారాయణ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు.
ఘనంగా సత్యసాయి జయంతి
దుగ్గిరాల, నవంబర్ 23: మండలకేంద్రం దుగ్గిరాల రైలుపేటలోని శ్రీపత్తిసాయి 87వ జయంతి వేడుకలను అత్యంతవైభవంగా శుక్రవారం నిర్వహించారు. ఈసందర్భంగా ఉదయం గ్రామ సంకీర్తన అనంతరం బాబాకు ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. అనంతరం 87మంది అనాథలు, పేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు. అలాగే హైదరాబాద్‌కు చెందిన చుండూరు భాస్కరావు,స్థానిక చెన్నకేశవ నగర్‌లోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు తాగునీటికోసం మోటారు, ట్యాంకును విరాణంగా అందచేశారు.
3 ఇసుక ట్రాక్టర్లు సీజ్
కొల్లిపర, నవంబర్ 23: కృష్ణానది నుండి ఇసుకను అక్రమంగా తరలిస్తున్న మూడు ట్రాక్టర్లను సీజ్ చేసినట్లు ఎస్‌ఐ కె వెంకటేశ్వరావు శుక్రవారం తెలిపారు. నదిలో వల్లభాపురం రేవునుండి ఇసుకను అక్రమంగా ట్రాక్టర్లపై తరలిస్తుండగా వంతెనవద్ద వాటిని స్వాధీనం చేసుకున్నట్లు ఎస్‌ఐ వివరించారు. అనంతరం భూగర్భగనుల శాఖాధికారులకు ట్రాక్టర్లను అప్పగిస్తామన్నారు.
పోలీసు సెలక్షన్ అభ్యర్థులకు అసౌకర్యం కల్గించొద్దు
గుంటూరు , నవంబర్ 23: నగరపాలక సంస్థ ప్రత్యేక అధికారి సురేష్‌కుమార్ సూచనల మేరకు పోలీసు సెలక్షన్స్ సందర్భంగా అభ్యర్థులకు ఎటువంటి అసౌకర్యం కల్గించకుండా చర్యలు తీసుకోవాలని నగరపాలక సంస్థ కమిషనర్ కె సుధాకర్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం నగర పర్యటనలో భాగంగా ఇన్నర్ రింగురోడ్డులో పర్యటించి రోడ్డుకు ఇరువైపులా ఉన్న చెత్తకుప్పలు, మట్టిదిబ్బలను తొలిగించి పోలీసు సెలక్షన్స్‌కు సహకరించాలన్నారు. రెడ్డిపాలెం తదితర ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణాలకు అంచనాలు సిద్ధం చేయాలన్నారు. గోరంట్ల, విద్యానగర్, గుజ్జనగుండ్ల, వికాస్ నగర్ తదితర ప్రాంతాల్లో యధేచ్ఛగా రోడ్లపై తిరుగుతున్న ఆవులను నగరపాలక సంస్థ బందెల దొడ్డికి తరలించి సంబంధిత యజమానులపై జరిమానా విధించాలన్నారు. సంజీవయ్యనగర్‌లో చెత్తకుప్పలను తరలించాలని ఆదేశించారు. ఈ పర్యటనలో అసిస్టెంట్ ఇంజనీర్ కృష్ణారెడ్డి శానిటరీ ఇన్స్‌పెక్టర్లు పాల్గొన్నారు.