రొంపిచర్ల, నవంబర్ 23: అధార్‌కార్డుల నమోదుప్రక్రియను జిల్లాలో సోమవారం నుండి ప్రారంభించనున్నట్లు జిల్లా జాయింట్ కలెక్టర్ యువరాజ్ తెలిపారు. శుక్రవారం స్థానిక తహశీల్దార్ కార్యాలయంవద్ద ఆయన విలేఖరులతో మాట్లాడుతూ జిల్లాలో బ్లూమ్ సర్వీస్ ద్వారా 120 అధార్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామన్నా రు. గతంలో జారీచేసిన అధార్‌కార్డుల పేర్లల్లో తప్పులు దొర్లాయని, ప్రస్తుతం తప్పులు జరగకుండా రిటైర్డ్ విఆర్‌ఓ, ఇతర ప్రభుత్వ ఉద్యోగులను పర్యవేక్షణాధికారులుగా నియమించామన్నారు. దీపం పథకానికి ఎంపికైన లబ్థిదారుల వివరాలు రచ్చబండలో జారీచేసిన రేషన్ కార్డుల కూపన్‌దారులకు గ్యాస్ కనెక్షన్లను మంజూరుచేయాలని ఏజన్సీలను ఆదేశించారు. 2012-13 సంవత్సరంలో దీపం పథకం ద్వారా జిల్లాలో 28212 గ్యాస్ కనెక్షన్లు మంజూరయ్యాయని, ఇప్పటివరకు 27వేల మంది లబ్థిదారులను ఎంపిక చేశామన్నారు. రైస్‌మిల్లులు అవసరమైన లైసెన్స్‌లను పొందాలన్నారు. సివిల్ సప్లయిస్ కార్పొరేషన్ ద్వారా నాణ్యమైన బియ్యం, పప్పుదినుసులను మార్కెట్ ధరకన్నా తక్కువ ధరకే ప్రజలకు అందించడానికి చర్యలు తీ సుకుంటున్నామన్నారు. స్థానిక తహశీల్దార్ కార్యాలయ రికార్డులను పరిశీలించారు. జెసి యువరాజ్ వెంట తహశీల్దార్ కె లలిత, సిబ్బంది ఉన్నారు.
విశ్వసనీయత అంటే అధికారాన్ని అడ్డుపెట్టుకుని దోచుకోవడమేనా?
గుంటూరు , నవంబర్ 23: వైఎస్ రాజశేఖరరెడ్డి అధికారంలో ఉన్నప్పుడు జగన్ వేల కోట్ల అవినీతికి పాల్పడి రాష్టస్రంపదను దోచుకున్నారని, విశ్వసనీయత అంటే ఇదేనా అని పొన్నూరు ఎమ్మెల్యే దూళిపాళ్ల నరేంద్రకుమార్ ప్రశ్నించారు. శుక్రవారం జిల్లా పార్టీ కార్యాలయం ఎన్‌టిఆర్ భవన్‌లో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైఎస్ రాజశేఖరరెడ్డి పాలనలో రాష్ట్రంలో 12 వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని తెలిపారు. రాష్ట్రంలో జగన్ నాటకం నడుస్తుందని, అందులో సూత్రధారి జగన్ అయితే పాత్రధారులుగా విజయమ్మ, షర్మిల వ్యవహరిస్తున్నారన్నారు. ఉప ఎన్నికల ముందు తన భర్తను కాంగ్రెస్‌కు చెందిన వారే చంపారని, విజయమ్మ ఆరోపణలు చేసి సానుభూతి ఓట్లు పొందారన్నారు. ఢిల్లీలో సోనియా, మన్మోహన్‌లను కలిసినప్పుడు భర్త మరణంపై ఎలాంటి వినతిపత్రం ఇవ్వకపోవడాన్ని చూస్తే విజయమ్మ నాటకం అర్థమవుతుందని తెలిపారు. షర్మిల పాదయాత్రలో తన కుటుంబ సభ్యులు అవినీతికి పాల్పడిన సొమ్ముపై సమాధానమివ్వాలని డిమాండ్ చేశారు.
చంద్రబాబు చేస్తున్న పాదయాత్రకు అనూహ్య స్పందన వస్తుండటంతో వైఎస్‌ఆర్ సిపి, కాంగ్రెస్ నేతల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయన్నారు. 2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రానుందని జోస్యం చెప్పారు. ఈ సమావేశంలో బోనబోయిన శ్రీనివాసయాదవ్, మన్నవ సుబ్బారావు, కసుకుర్తి హనుమంతరావు, చిట్టాబత్తుని చిట్టిబాబు తదితరులు పాల్గొన్నారు.