Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

సాగునీటి కోసం రోడ్డెక్కిన అన్నదాతలు

$
0
0

అమృతలూరు, నవంబర్ 23: పంట పొలాలకు సాగునీరు తక్షణమే విడుదల చేయాలని కోరుతూ రైతాంగ సమాఖ్య ఆధ్వర్యంలో ఐక్య కార్యాచరణ కమిటీ శుక్రవారం తెనాలి- చెరుకుపల్లి రహదారిపై అమృతలూరులోని శ్రీ ప్రసన్నాంజనేయస్వామి ఆలయం సెంటర్‌వద్ద రాస్తారోకో చేశారు. ఈసందర్భంగా రైతాంగ సమాఖ్య నాయకులు మైనేని రత్నప్రసాద్ మాట్లాడుతూ ఖరీఫ్ సీజన్ ప్రారంభమైన తరువాత ప్రభుత్వం అధికారికంగా సాగర్ నుండి సాగునీరు రైతులకు అవసరమైన మేరకు విడుదల చేయలేదని, వర్షపు నీటితోనే వ్యయ ప్రయాసాలకు ఓర్చి రైతులు ఇప్పటివరకు వరిపంటను సాగుచేయటం జరిగిందని తెలిపారు. ప్రస్తుత తరుణంలో సాగునీరు వరిపంటలకు అందకుంటే ఆశించిన దిగుబడి చేతికిరాదని, రెండవ పంటకు పదునులేక అన్నదాతలు ఇబ్బందులుపడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. అసలే మొదటి పంటకు మెడవిరుపు అనే తెగుళ్ళతో దిగుబడులు తగ్గుతాయని భావిస్తున్న రైతులకు సాగునీరు సకాలంలో అందకపోవటంతో ఆకాస్త దిగుబడికూడా చేతికందని పరిస్థితి ఎదురౌతోందని చెబుతున్నారు. అనంతరం తెనాలి - చెరుకుపల్లి రహదారిపై బైటాయించిన రైతులు పంట పొలాలకు నీటిని విడుదల చేయాలని కోరుతూ కాంగ్రెస్ ప్రభుత్వంకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈకార్యక్రమంలో రైతాంగ సమాఖ్య నాయకులు గొట్టిపాటి భానుగంగాధర్, పరుచూరి శ్రీనివాసరావు, రవీంద్రనాధ్‌బాబు, జయప్రకాష్, కైతేపల్లి రాంబాబు, పర్వతాలు, శరణు రాజా, నాగళ్ళ ఆనందబాబు, చిలువోలులంక రామచంద్రరావు, కొడాలి రవీంద్రనాథ్, కొత్తపల్లి భాను, వౌలాలి, అనీఫ్, శ్రీరామమూర్తి, గణేష్, నందమూరి యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

సమన్వయంతో పనిచేస్తే శిశు మరణాలు తగ్గించవచ్చు
మంగళగిరి, నవంబర్ 23: వివిధ ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పనిచేస్తే శిశు మరణాలు తగ్గించవచ్చని జిల్లా కలెక్టర్ ఎస్ సురేష్‌కుమార్ అన్నారు. పట్టణంలోని మార్కండేయ కల్యాణ మండపంలో శుక్రవారం ఎన్‌ఆర్‌హెచ్‌ఎం నిర్వహించిన మార్పు కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. డిఎంహెచ్‌ఓ గోపీనాయక్ అధ్యక్షత వహించారు. కలెక్టర్ సురేష్‌కుమార్ తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ పుట్టిన ప్రతి వెయ్యి మంది శిశువుల్లో 50 మంది చనిపోతున్నారని, ఐదేళ్లలోపు చిన్నారులు 60 మంది వరకూ చనిపోతున్నారని, దీనికి కారణం గర్భం దాల్చిన మహిళల్లో రక్తహీనత ఎక్కువమందికి ఉండటమేనని ఆయన అన్నారు. పారిశుద్ధ్య సమస్య, పోషకాహార లోపం, తక్కువ వయస్సులో వివాహం చేసుకోవటం లాంటి వాటిపై మహిళలను చైతన్యవంతం చేయాలని ప్రభుత్వం ఇచ్చిన 20 సూత్రాలు పాటించే విధంగా అంగన్‌వాడీ కార్యకర్తలు కృషిచేయాలని కలెక్టర్ అన్నారు. ఆడపిల్లకు 18 ఏళ్లు నిండాకే వివాహం జరిగేలా అవగాహన కల్పించాలని కోరారు. జిల్లా ఎస్‌పి ఎ రవికృష్ణ మాట్లాడుతూ బాల్య వివాహాలు నియంత్రించటానికి, మెరుగైన సమా జం కోసం అందరం కలిసి పనిచేద్దామని అన్నారు. ఎమ్మెల్యే కాండ్రు కమల మాట్లాడుతూ మహిళలు చైతన్యవంతమైతేనే అభివృద్ధి వేగవంతం అవుతుందన్నారు. ఐసిడిఎస్ పిడి నిర్మల, ఎంపిడివో శ్యామలాదేవి, మున్సిపల్ కమిషనర్ పి. శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

1.80 కోట్లతో కాలనీల్లో అంతర్గతరోడ్లు
అచ్చంపేట, నవంబర్ 23: మంత్రి కన్నా లక్ష్మీనారాయణ సహకారంతో పెదకూరపాడు నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు డిసిసి ఉపాధ్యక్షుడు పక్కాల సూరిబాబు పేర్కొన్నారు. ఆయన అచ్చంపేటలో శుక్రవారం ఒసి, బిసి కాలనీల్లో 12 లక్షల రూపాయల అంచనా వ్యయంతో నిర్మించే అంతర్గత రోడ్లు, మురుగుకాల్వల నిర్మాణాలకు శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ వేల్పూరు, వైకుంఠపురం వాటర్‌స్కీం, డెవలప్‌మెంట్‌కు 60 లక్షలు మంజూరయ్యాయన్నారు. ఇప్పటికే కాలనీల్లో పలు అభివృద్ధి పనులు జరుగుతున్నట్లు తెలిపారు. అనంతరం సూరిబాబు మాదిపాడు గ్రామంలో 8 లక్షలతో నిర్మిస్తున్న 4 అంతర్గతరోడ్ల నిర్మాణానికి కంచుబోడు తండాలో 3 లక్షల రూపాయలతో నిర్మిస్తున్న కమ్యూనిటీ హాలు నిర్మాణాలకు శంకుస్థాపనలు చేశారు. ఈ పర్యటనలో భాగంగా పుట్లగూడెం గ్రామంలో కోటకొమ్ముల సత్యనారాయణ ఇంట్లో జరిగిన వివాహ కార్యక్రమానికి హాజరై వధూవరులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమాలలో డాక్టర్ ఎం మధుసూధనరావు, ఎన్‌జి రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయ పాలకవర్గ సభ్యులు ఎన్ చంద్రబాబు, క్రోసూరు వ్యవసాయమార్కెట్ యార్డు చైర్మన్ సాయిరెడ్డి, కాంగ్రెస్ నాయకులు వై స్వామి, జి కోటేశ్వరరావు, బి సాంబశివరావు, పి వెంకట్రావ్, ఎస్ శ్రీనివాసరావు, చంద్రయ్య, వెంకయ్య, టి మర్రెడ్డి, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

ప్రపంచవ్యాప్తంగా ప్రసారమవనున్న
పుట్టకోట ‘పల్లెగోవిందం’
ఫిరంగిపురం, నవంబర్ 23: ప్రజల్లో భక్త్భివాన్ని ఆధ్యాత్మిక చింతనతో పాటు ఆలయాల పరిరక్షణ కోసం తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో రాష్ట్రంలో తొలిసారిగా జూన్ 24 నుండి 26 వరకు యడ్లపాడు మండలం పుట్టకోట గ్రామంలో పల్లెగోవిందం కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తిరుమల తిరుపతి దేవస్థానాలు, హిందూ ధర్మ ప్రచార పరిషత్, మండల శాఖ ధార్మిక సేవా మండలి ఉపాధ్యక్ష, కార్యదర్శులు నారాయణం ప్రసాదాచార్య, టివి భాస్కర్ తెలిపారు. శుక్రవారం ఫిరంగిపురంలోని సిరి సంస్థ కార్యాలయంలో జరిగిన విలేఖర్ల సమావేశంలో వారు మాట్లాడుతూ ఈ పల్లెగోవిందం కార్యక్రమం ప్రపంచవ్యాప్తంగా ఈనెల 24,28, డిసెంబర్ 1,5,8,12 తేదీల్లో శ్రీ వెంకటేశ్వర భక్త్ఛినల్ ద్వారా ప్రసారమవుతుందన్నారు. ఈనెల 24 శనివారం ఉదయం 9.30 గంటలకు తిరిగి 28వ తేదీ రాత్రి 11.30 గంటలకు యడ్లపాడు మండలం పుట్టకోట గ్రామంలోని వివిధ ఆలయాల విశిష్టత, శిల్పదర్శనం, శోభాయాత్రపై మొదటి భాగం ప్రసారమవుతుందన్నారు. రెండవ భాగం డిసెంబర్ 1వ తేదీన అక్షరాభ్యాసం దీపోత్సవ కార్యక్రమం, 8వ తేదీ ఉదయం 9.30 గంటలకు, 12వ తేదీ రాత్రి 11.30 నిముషాలకు యడ్లపాడు మండలం పుట్టకోట గ్రామంలో వేంచేసియున్న బొలమోర వెంకటేశ్వరస్వామి వారి దేవాలయంలో జరిగిన శాంతి కల్యాణ మహోత్సవ కార్యక్రమాలు ప్రసారమవుతాయని చెప్పారు. ఫిరంగిపురం, అమీనాబాదు గ్రామాల్లో రెండవ విడత పల్లెగోవిందం కార్యక్రమాలను డిసెంబర్‌లో టిటిడి ఆధ్వర్యంలో నిర్వహించేందుకు చురుగ్గా ఏర్పాట్లు చేస్తున్నట్లు నారాయణం ప్రసాదాచార్య, టివి భాస్కర్ తెలిపారు.

కుక్కల దాడిలో 14 గొర్రెలు మృతి
మాచర్ల, నవంబర్ 23: గొర్రెల కొట్టంపై కుక్కలు దాడి చేసి 14 గొర్రెలను హతమార్చిన సంఘటన మండల పరిధిలోని జమ్మలమడకలో శక్రవారం తెల్లవారు ఝామున ఆలస్యంగా వెలుగు చూసింది. వివరాలలోకి వెళ్తే గ్రామానికి చెందిన గంగబోయిన వెంకటేశ్వర్లు తనకు చెందిన గొర్రెలను ఇంటి సమీపంలోని కొట్టంలో ఉంచాడు. రోజు వాటికి కాపలాగా ఉండే వెంకటేశ్వర్లు ఆరోగ్యం సరిగా లేకపోవడంతో గురువారం రాత్రి కాపలా లేకుండా ఇంట్లోనే నిద్రించాడు. తెల్లవారే సరికి కొట్టంలోని జీవాలు మృతి చెంది ఉండటాన్ని గమనించిన గ్రామస్థులు వెంకటేశ్వర్లుకు విషయం తెలిపారు. దీంతో హుటాహుటిన కొట్టం దగ్గరుకు వెళ్లి చూడగా 14 గొర్రెలు మృతి చెంది మరికొన్ని తీవ్ర గాయాలపాలై ఉండటాన్ని గమనించి కన్నీరు మున్నీరై విలపించసాగాడు. మృతి చెందిన గొర్రెలు విలువ సుమారు రూ.80 వేలు దాకా ఉంటుందని బాధితుడు వెంకటేశ్వర్లు తెలిపాడు.

పంట పొలాలకు సాగునీరు తక్షణమే విడుదల చేయాలని కోరుతూ
english title: 
irrigation water

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>