మంగళగిరి, నవంబర్ 23: బాలలు బడికి వెళ్లి చదువుకుంటే భవిష్యత్‌లో ఉన్నత స్థితికి చేరుతారని గుంటూరు అర్బన్ ఎస్‌పి ఎ రవికృష్ణ అన్నారు. మంగళగిరి పట్టణ శివారులోని రత్నాలచెరువులో నివాసముంటున్న యానాది కుటుంబాలకు చెందిన పిల్లలు బడికి వెళ్లటం లేదని, ఇటీవల నీలం తుఫాన్ సందర్భంగా పర్యటించినప్పుడు గుర్తించిన ఎస్‌పి బడి ఈడు పిల్లలను బడిలో చేర్పించేందుకు ఆపరేషన్ రత్నాలచెరువు పేరిట శుక్రవారం 20 మంది పిల్లలను అక్కడి మున్సిపల్ పాఠశాలలో చేర్పించారు. స్వయంగా అక్షరాభ్యాసం చేయించి పుస్తకాలు, పలకలు, దుస్తులు అందజేశారు. పిల్లలతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. ఈ సందర్భంగా ఎస్‌పి మాట్లాడుతూ రత్నాలచెరువులో పిల్లలను రత్నాలుగా తీర్చిదిద్దాలని ఉపాధ్యాయులను కోరారు. మున్సిపల్ కమిషనర్ పి శ్రీనివాసరావు, ఎంఇవో పి శ్రీనివాసరావు, డిఎస్‌పి ఎం మధుసూధనరావు, సిఐలు రమణకుమార్, మురళీకృష్ణ, ఎస్‌ఐలు రవిబాబు, కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
పత్తిని పూర్తిస్థాయిలో కొనుగోలు చేయాలి
సిసిఐ కార్యాలయం వద్ద సిపిఐ, రైతు సంఘాల ఆందోళన
గుంటూరు , నవంబర్ 23: తక్షణమే రైతుల వద్ద నుండి సిపిఐ ద్వారా పూర్తిస్థాయిలో పత్తిని కొనుగోలు చేసి వారిని ఆదుకోవాలని, లేనిపక్షంలో అన్ని పార్టీలతో కలిసి సంఘటితంగా సిసిఐ కార్యాలయాన్ని దిగ్బంధిస్తామని సిపిఐ జిల్లా కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు హెచ్చరించారు. నగరంలోని సిసిఐ కార్యాలయం వద్ద పత్తికి కనీస మద్దతు ధర క్వింటాకు 5 వేలు చెల్లించాలని, వర్షాలకు తడిసిన పత్తిని ఎలాంటి ఆంక్షలు లేకుండా కొనుగోలు చేయాలని, జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో రైతులకు అందుబాటులో ఉండేవిధంగా సిసిఐ కేంద్రాలను ఏర్పాటు చేయాలని కోరుతూ సిపిఐ, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం అశోక్‌నగర్‌లోని సిసిఐ కేంద్రం వద్ద ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా ముప్పాళ్ల నాగేశ్వరరావు మాట్లాడుతూ నీలం తుఫాన్‌తో పత్తిపంట దెబ్బతిందని, ఇప్పటివరకు అంచనాలను వేయడంలో ప్రభుత్వం తాత్సార్యం చేస్తోందని ఆరోపించారు. నష్టపోయిన రైతులకు ఎకరాకు 10 వేలు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. బస్తా యూరియాను, రెండు బస్తాల కాంప్లెక్స్ ఎరువులను 90 శాతం సబ్సిడీతో ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రైతుసంఘ జిల్లా ప్రధాన కార్యదర్శి నరిశెట్టి గురవయ్య, అధ్యక్షులు భావన శ్రీనివాసరావు, సిపిఐ నగర కార్యదర్శి జంగాల అజయ్‌కుమార్, సిపిఐ నాయకులు సిఆర్ మోహన్, గని, జి శివాజీ, చెవుల పున్నయ్య, మల్లెబోయిన పిచ్చయ్య, దామినేని పద్మారావు, మాదల శ్రీ్ధర్ తదితరులు పాల్గొన్నారు.
రోగుల పట్ల మానవతా దృక్పథంతో మెలగాలి
రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి రత్నకిషోర్
గుంటూరు, నవంబర్ 23: ప్రత్యక్ష దైవాలుగా పిలుచుకునే వైద్యులు ఆసుపత్రులకు వచ్చే రోగుల పట్ల మానవతా దృక్పథంతో వ్యవహరిస్తూ వైద్య సేవలు అందించాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి కె రత్నకిషోర్ హితవు పలికారు. శుక్రవారం స్థానిక మెడికల్ కళాశాలలోని జింఖానా ఆడిటోరియంలో వైద్యాధికారులతో ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా రత్నకిషోర్ మాట్లాడుతూ రాష్ట్రప్రభుత్వం ఏటా 18 నుంచి 20 వేల కోట్ల రూపాయలు ప్రజారోగ్య విభాగానికి ఖర్చుచేస్తోందని తెలిపారు. గుంటూరు వైద్యకళాశాల చాలా పురాతనమైనదని, దీనికి వౌలిక వసతుల కల్పనకు అధిక ప్రాధాన్యత కల్పించాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. గుంటూరులోని వైద్య కళాశాలలో ప్రస్తుతం 150 సీట్లు ఉన్నాయని, అదనంగా మరో 50 సీట్ల అనుమతికై భారత వైద్యమండలి మరో మూడు నెలల్లో తనిఖీని రానుందన్నారు. గుంటూరు వైద్యకళాశాలలో నిర్మాణంలో ఉన్న మిలీనియం బ్లాకును వచ్చే ఏడాది జూన్ నాటికి పూర్తి చేసేలా చర్యలు చేపడతామని తెలిపారు. వైద్యశాలలో గల ముఖ్యమైన విభాగాలకు సంబంధించి ప్రజలకు తెలిసేలా బోర్డులు పెట్టాలని, రక్షిత మంచినీటిని అందించాలని, అలాగే జనరిక్ మెడిసిన్స్ అందుబాటులో ఉండేలా చూడాలని ఆయన అధికారులకు సూచించారు. అత్యవసర సేవలకు సంబంధించి, క్యాజువాలిటీ శాఖలకు సరైన భద్రత కల్పించాలని ఆదేశించారు. పారిశుద్ధ్యం విషయమై ప్రిన్సిపల్ సెక్రటరి రత్నకిషోర్ మాట్లాడుతూ స్థానికంగా సెంట్రలైజ్ కాంట్రాక్టర్ ద్వారా కట్టుదిట్టంగా పారిశుద్ధ్య పనులు చేపట్టేలా చూడాలని అధికారులకు ఆయన సూచించారు. గుంటూరు ప్రభుత్వ వైద్యశాలకు, కళాశాలకు మంచిపేరు వచ్చేలా చూడాలన్నారు. ప్రసూతి విభాగం పెండింగ్‌లోనున్న పనులపై ఆయన అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ ఆరోగ్య శ్రీ నిధులలో రూ. 65 కోట్లు మెడికల్ కాలేజీ హాస్టల్స్‌కు కేటాయించామన్నారు. కర్ణాటక రాష్ట్రంలో మెడికల్ సీట్లలో 5 శాతాన్ని ఇతర రాష్ట్రాలకు కేటాయించాలన్న యుజిసి ఆదేశాలు ఇప్పటికీ అమలవుతున్నాయని, త్వరలో వచ్చే సంవత్సరం నుండి ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఈ నిబంధన వర్తిస్తుందని తెలిపారు. ఇక నుండి ప్రతి నెలా జిల్లాలలోని హాస్పటల్స్‌పై సమీక్షలు నిర్వహించనున్నట్లు ఆయన చెప్పారు. కలెక్టర్ సురేష్‌కుమార్ మాట్లాడుతూ ప్రభుత్వాసుపత్రికి మంచి రెప్యుటేషన్ ఉందని భవిష్యత్తులోనూ ఇదేవిధంగా కొనసాగించాలని సూచించారు. ప్రభుత్వ వైద్యశాలలపై నమ్మకం ఉంచి వైద్య చికిత్సకై వస్తున్న ప్రజలకు మెరుగైన సేవలు అందించడానికి వైద్యాధికారులు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ కెఎస్ వరప్రసాద్, ప్రభుత్వ వైద్యశాల పర్యవేక్షకులు డాక్టర్ సిహెచ్ మోహనరావు, మెడికల్ కాలేజీ వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ వి సూర్యకుమారి, కోఆర్డినేటర్ డాక్టర్ సుధాకరరావు, డిఎంహెచ్‌ఒ డాక్టర్ ఎం గోపీనాయక్, జిఎంసి ఎఎన్‌ఎ భాస్కరరావువివిధ విభాగాధిపతులు తదితరులు పాల్గొన్నారు.