మంగళగిరి, నవంబర్ 23: మంగళగిరిలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ఏర్పాటు అంశంపై ముఖ్యమంత్రి ఏర్పాటుచేసిన ఉన్నత స్థాయి కమిటీ శుక్రవారం పట్టణ శివారులోని టిబి శానిటోరియం స్థలాన్ని సందర్శించింది. వైద్య, ఆరోగ్యశాఖ చీఫ్ సెక్రటరీ కె రత్నకిషోర్, జిల్లా కలెక్టర్ ఎస్ సురేష్‌కుమార్, ఎన్టీఆర్ వైద్య విజ్ఞాన విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ఐవి రావు, తదితరులతో కూడిన కమిటీ శానిటోరియాన్ని సందర్శించి స్థలానికి సంబంధించిన హద్దులు, భౌగోళిక స్వరూపాన్ని పరిశీలించారు. మ్యాప్ ద్వారా రెవెన్యూ అధికారులు, సర్వేయర్లు కమిటీకి స్థలం గురించి వివరించారు. ఈ సందర్భంగా చీఫ్ సెక్రటరీ ఎ రత్నకిషోర్ మాట్లాడుతూ మంగళగిరిలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ఏర్పాటుకు ముఖ్యమంత్రి సుముఖంగా ఉన్నారని చెప్పారు. ఆసుపత్రి కోసం స్థలం కేటాయించేందుకు అనువైన ప్రాంతాన్ని గుర్తించేందుకు తాము ఇక్కడకు వచ్చినట్లు చెప్పారు. భవిష్యత్‌లో మెడికల్ కళాశాల ఏర్పాటు ప్రతిపాదన కూడా ఉందని ఆయన చెప్పారు. శానిటోరియం స్థలం నుంచి జాతీయ రహదారి వైపునకు రహదారిని ఏర్పాటు చేసే అంశం పరిశీలిస్తామని స్థానిక ఎమ్మెల్యే కాండ్రు కమలకు ఆయన హామీ ఇచ్చారు. సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని మంగళగిరిలోనే ఏర్పాటుచేస్తామని, శాసనమండలిలో ప్రభుత్వం హామీ ఇచ్చింది. హామీని అమలుచేయాలని కోరుతూ ఇటీవల ఇక్కడికి వచ్చిన శాసనమండలి హామీల అమలు కమిటీ చైర్మన్ టిజివి కృష్ణారెడ్డి, ఎమ్మెల్సీల బృందం ఆసుపత్రి ఇక్కడే ఏర్పాటుచేయాలని ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి ఉన్నత స్థాయి కమిటీని నియమించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో వెంకటరమణ, మంగళగిరి, తాడేపల్లి తహశీల్దార్లు పాల్గొన్నారు.
మంగళగిరిలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ఏర్పాటు అంశంపై
english title:
sanitorium
Date:
Saturday, November 24, 2012