ఇంద్రకీలాద్రి, నవంబర్ 23: ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ జగన్మాత శ్రీకనకదుర్గమ్మకు అత్యంత ప్రీతిపాత్రమైన ‘అమ్మవారి భవానీదీక్షలు’ శనివారం నుండి అత్యంత వైభవంగా ప్రారంభకానున్నాయి. ఇంద్రకీలాద్రి పై ఉన్న అమ్మవారి భవానీదీక్ష మండపంలో దేవస్థానం ఆస్ధానాచార్యుడు విష్ణు ప్రసాద్ తొలుత ఇన్‌చార్జ్ ఇవోతో గణపతిహోమం, అమ్మవారి ప్రత్యేక పూజలు చేయించిన తర్వాత దీక్షపరులకు మాలధారణ చేయించటంతో శ్రీదుర్గా మల్లేశ్వరస్వామివార్ల అమ్మవారి భవానీదీక్షలు ప్రారంభం అవుతాయి. దీనికి సంబంధించిన సకల ఏర్పాట్లును ఇప్పటికే దేవస్థానం అధికారులు పూర్తి చేశారు. కాగా ఇప్పటి వరకు దేవస్థానం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గురు భవానీలకు ఇంతవరకు దేవస్థానం ఆధ్వర్యంలో భవానీదీక్షలకు సంబంధించిన కరపత్రాలు అందక పోవటంపై విమర్శలు వినబడుతున్నాయి.
ముంపు బాధిత రైతులను ఆదుకోవాలి
గాంధీనగర్, నవంబర్ 23: ఇటీవల ప్రపంచ వ్యాప్తంగా అలజడి సృష్టించిన నీలం తుఫానుకు మన రాష్ట్రంలోని అనేక ప్రాంతాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ముఖ్యంగా రాష్ట్ర రైతాంగం ఆశలన్నీ అతలాకుతలమయ్యాయి. నిన్న, మొన్నటి వరకు సకాలంలో సరైన వర్షాలు లేక, దుర్భిక్ష పరిస్థితుల నడుమ సేద్యం చేస్తున్న రైతులకు ఈ తుఫాను ద్వారా పూర్తి నిరాశ మిగిలింది. శుక్రవారం ఉదయం గాంధీనగర్ ప్రెస్‌క్లబ్‌లో జరిగిన రైతుకూలీ సంఘం నేతల సమావేశంలో సంఘం కార్యదర్శి కె. కోటయ్య రైతులకు ప్రభుత్వాలు తీరని అన్యాయాన్ని మిగిల్చాయని అన్నారు. అంతేకాక రైతాంగం పండించిన పత్తి, మిర్చి, పసుపు, చెరకు, వేరుశనగ, మొక్కజొన్న పంటలకు క్వింటాకు సక్రమ ధర చెల్లించక రాష్ట్ర ప్రభుత్వ మంత్రులు, అధికారులు ఆటలాడుకుంటున్నారని తీవ్రంగా విమర్శించారు. కార్యక్రమంలో సంఘం సహాయ కార్యదర్శి జె. కిషోర్‌బాబు, కోశాధికారి యద్దనపూడి సోని తదితరులు పాల్గొన్నారు.
శబరిమలైకు 132 రైళ్లు!
* అయ్యప్ప భక్తుల కోసం విశేష ఏర్పాట్లు
పాయకాపురం, నవంబర్ 23: శబరిమలై వేళ్లేందుకు భక్తుల సౌకర్యార్ధం 132 ప్రత్యేక రైళ్లను వివిధ ప్రాంతాల నుండి దక్షిణ మధ్య రైల్వే నడపనున్నట్లు డివిజనల్ రైల్వే మేనేజర్ శుక్రవారం తెలిపారు. హైదరాబాదు, కాకినాడ టౌన్, నిజామాబాద్, విజయవాడ, మచిలీపట్నం, నరసాపూర్, సిరిపూర్ కాగజ్‌నగర్, కరీంనగర్, ఔరంగాబాద్, అదిలాబాద్, లక్నోల నుండి కొల్లం వరకు ప్రత్యేక రైళ్లను నడపనున్నారు. ఈ రైళ్లు డిసెంబరు 7వ తేదీ నుండి జనవరి 18వ తేదీ వరకు ప్రయాణీకుల రద్దీని దృష్టిలో ఉంచుకుని నడపనున్నట్లు ఆయన తెలిపారు. విజయవాడ నుండి కొలంకు వెళ్లే శబరిమలై ప్రత్యేక రైలు (వెళ్లేటపుడు రైలు నెంబరు 07210, తిరుగు ప్రయాణంలో రైలు నెంబరు 07220) తిరుపతి మీదుగా కొల్లం వెళ్తుంది. ఈ రైలు నాలుగు సర్వీసులుగా నడుస్తుంది. 07219 ఈ రైలు విజయవాడ నుండి జనవరి 3వ తేదీన రాత్రి 11.55కు, జనవరి 9వ తేదీన బయలుదేరి మరుసటి రోజు అర్ధరాత్రి 12.15కు కొల్లం చేరుకుంటుంది. 07220 కొల్లం నుండి విజయవాడకు తిరుగుప్రయామైయ్యే రైలు కొల్లంలో జనవరి 5వ తేదీ, 11వ తేదీల్లో తెల్లవారుజామున 2.15కు బయలుదేరి మరుసటి రోజు తెల్లవారుజామున 3 గంటలకు విజయవాడ చేరుకుంటుంది. ఈ ప్రత్యేక రైలులో సెకండ్ ఎసి, స్లీపర్‌క్లాస్, జనరల్ సెకండ్ క్లాస్ బోగీలుంటాయి. మచిలీపట్నం నుండి కొల్లం బయలుదేరే శబరిమలై ప్రత్యేక రైలు 07221 మచిలీపట్నంలో జనవరి 6, 12 తేదీల్లో రాత్రి 11.45 గంటలకు బయలుదేరి మరుసటి రోజు అర్ధరాత్రి 12.15కు కొల్లం చేరుకుంటుంది. ఇదే రైలు తిరుగు ప్రయాణంలో 07222గా కొల్లంలో జనవరి 8, 14 తేదీల్లో తెల్లవారుజామున 2.15కు బయలుదేరి మరుసటి రోజు తెల్లవారుజామున 4 గంటలకు మచిలీపట్నం చేరుకుంటుంది. ఈ రైలులో సెకండ్ ఎసి, స్లీపర్, జనరల్ సెకండ్ క్లాస్ బోగీలుంటాయి. విజయవాడ నుండి కొల్లంకు బయలుదేరే శబరిమలై ప్రత్యేక 07213 రైలు డిసెంబర్ 8, 12, 19 తేదీల్లో విజయవాడ నుండి రాత్రి 11.45కు బయలుదేరి మరుసటి రోజు కొల్లంకు తెల్లవారుజామున 3.45కు చేరుకుంటుంది. ఇదే రైలు తిరుగుప్రయాణంలో 07214గా మారి కొల్లం నుండి డిసెంబర్ 10, 14, 21 తేదీల్లో తెల్లవారుజామున 5.50 గంటలకు బయలుదేరి విజయవాడకు మరుసటి రోజు తెల్లవారుజామున 5.30 గంటలకు చేరుకుంటుంది. ఈ ప్రత్యేక రైలులో సెకండ్ ఏసి, స్లీపర్ క్లాస్, జనరల్ సెకండ్ క్లాస్ బోగీలుంటాయి. మచిలీపట్నం నుండి కొల్లంకు వెళ్లే రైలు నెంబరు 07215 డిసెంబర్ 15, 22, 29 తేదీల్లో మచిలీపట్నంలో రాత్రి 10 గంటలకు బయలుదేరి మరుసటి రోజు తెల్లవారుజామున 3.45 గంటలకు కొల్లం చేరుకుంటుంది. ఇదే రైలు తిరుగుప్రయాణంలో 07216గా మారి కొలం నుండి డిసెంబర్ 17, 24, 31 తేదీల్లో తెల్లవారుజామున 5.50కు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 8.45గంటలకు మచిలీపట్నం చేరుకుంటుంది. ఈ రైలులో సెకండ్ ఏసి, స్లీపర్‌క్లాస్, జనరల్ సెకండ్ క్లాస్ బోగీలుంటాయి. ఇదే క్రమంలో పలు ప్రాంతాల నుండి కొల్లంకు ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు డిఆర్‌ఎం తెలియజేశారు.
రైల్వే కార్మికులకు ప్రత్యేక వేజ్‌బోర్డు
* ధర్నాలో రైల్వే కార్మిక సంఘ నేతల డిమాండ్
విజయవాడ, నవంబర్ 23: రైల్వే కార్మికుల కోసం ప్రత్యేక వేజ్‌బోర్డును ఏర్పాటుచేయాలని కాలయాపనకు తావు లేకుండా ఏడో పే కమిషన్‌ను నియమించాలని, లంచ్ ఎలవెన్స్ ఏర్పాటుచేసి, నూతన పెన్షన్ స్కీమ్‌ను రద్దుచేయాలని దక్షిణ మధ్య రైల్వే కార్మిక సంఘ్ నేతలు నాగేశ్వరరావు, పీటర్ సన్ భారతీయ రైల్వే మజ్దూర్ సంఘ నేతలు స్వయంభువు పిఎన్ అవతారం డిమాండ్ చేశారు. డివిజనల్ రైల్వే మేనేజర్ కార్యాలయం ఎదుట శుక్రవారం జరిగిన ధర్నాలో వారు ప్రసంగించారు. పిఎఫ్‌ను ప్రైవేట్ షేర్లలో పెట్టుబడిగా పెట్టటం వలన షేర్ రేటు పడిపోతే కార్మికులు నష్టపోతారన్నారు. అందుకే ఆ సొమ్ముతో ప్రత్యేక బ్యాంక్ ఏర్పాటు చేయాలన్నారు. కార్మిక సంఘ్ అదనపు ప్రధాన కార్యదర్శి పిఎస్ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ దేశభక్తి కల్గిన కార్మికులందరినీ ఒకే త్రాటిపైకి తీసుకురావటం ద్వారా తమ కోర్కెలను సాధించగలమన్న ధీమా వ్యక్తం చేసారు. ప్రధాన కార్యదర్శి టివి సుబ్బరామయ్య మాట్లాడుతూ గుర్తింపు పొందిన సంఘాల నేతల పనితీరు బాగా లేదన్నారు. దీనివల్ల ఏ ఒక్క డిమాండ్‌ను కూడా సాధించుకోలేకపోతున్నామన్నారు. తొలుత సంఘ్ ముఖ్య సంరక్షకులు పివిఎల్‌ఎన్ శర్మ, భారతమాత, అంబేద్కర్ ఇతర నేతల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
దుర్గగుడి ఇన్‌చార్జి ఇవో - ఎన్‌ఎంఆర్‌ల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం?
ఇంద్రకీలాద్రి, నవంబర్ 23: శ్రీదుర్గా మల్లేశ్వరస్వామివార్ల దేవస్థానం ఇన్‌చార్జ్ ఇవో విష్ణుప్రసాద్‌తో దుర్గగుడి యన్‌యంఆర్‌లు ప్రచ్ఛన్నయుద్ధం చేయటానికి రంగం సిద్ధం చేసుకున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా లభించిన కీలకసమాచారం. ప్రస్తుతం ఇన్‌చార్జ్ ఇవో యన్‌యంఆర్‌లకు జీతాలు నిలిపివేయటంతోపాటు వారికి సక్రమంగా ఉత్తర్వులు లేనికారణంగా వారిని అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు గుర్తించటానికి రంగం సిద్ధం చేయటమే ఈ ఉద్యోగులు ఈ యుద్ధం ప్రకటించటానికి ముఖ్యకారణంగా తెలిసింది. అమ్మవారి సన్నిధిలో పనిచేసిన పలువురు ఇవోలు యన్‌యంఆర్‌లు చేస్తున్న సేవలను గుర్తించి ఎవరు వీరి జీతాల విషయంలో అడ్డు చెప్పకుండా వారికి జీతాలు చెల్లించారు. కాగా డిసెంబర్ నెలలో పదవీ విరమణ చేయనున్న విష్ణుప్రసాద్ మాత్రం ఉత్తర్వులు సక్రమంగాలేని యన్‌యంఆర్ ఉద్యోగులకు ఎటువంటి పరిస్థితుల్లో కూడ జీతాలు చెల్లించే అవసరంలేదని తేగేసి చెప్పటంతో జీతాలు సైతం నిలిపివేశారు. శ్రీ దుర్గామల్లేశ్వరస్వామివార్ల దేవస్థానం చరిత్రలో తొలిసారిగా యన్‌యంఆర్‌లకు జీతాలు నిలిపివేయటం ఇదే తొలిసారి. నియమ నిబంధలు గురించి పదే పదే చెబుతున్న ఇన్‌చార్జ్ ఇవో ఆర్‌జెసి యం రఘునాథ్‌కు ట్రిబ్యునల్‌లో అనుకూలంగా స్టే వచ్చినప్పటికీ ప్రభుత్వం నుండి ఉత్తర్వులు రాలేదని సాకు చెప్పి ఆయన మాత్రం ఇవోసీటుకు అతుక్కుపోయి ఉండటం నిబంధలకు వ్యతిరేకం కాదా అని యన్‌యంఆర్ ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. నెలరోజుల వ్యవధి మాత్రమే ఉన్న విష్ణు ప్రసాద్ దుర్గగుడిలో ఉద్యోగులను ఎందుకు అంతర్గత బదిలీలు చేయటంలో ఉద్దేశ్యం ఏమిటో స్పష్టం చేయాలని ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. సక్రమంగా ఉత్తర్వులు లేని ఉద్యోగులకు మాత్రమే జీతాలను నిలిపివేసినట్లు విష్ణు ప్రసాద్ వర్గీయులు తెలిపారు. వెంకట్రామిరెడ్డి కమీషన్ గతంలో దేవాదాయ ధర్మాదాయశాఖకు కొన్ని సూచనలు చేయగా వాటిలో కొన్నింటిని ఈ శాఖ అధికారులు అమలు చేసిప్పటికీ యన్‌యంఆర్ ఉద్యోగులను రెగ్యులర్ చేస్తే విషయంలో సరైన రీతిలో స్పందన కరువుకావటంతో ఈ విషయం కార్యరూపం దాల్చలేదు. గతంలో దేవాదాయ ధర్మాదాయశాఖ కు ఇన్‌చార్జ్ ఇవో పరిపాలనలోని లోపాలను ఎత్తిచూపుతూ యన్‌యంఆర్ ఉద్యోగులు ఇప్పటికే దేవాదాయ శాఖ మంత్రి, ప్రిన్సిపాల్ సెక్రటరీ, కమీషనర్ తదితరులకు వినతి పత్రాలను సమర్పించినట్లు సమాచారం.
అంతర్ జిల్లా నేరస్థుని అరెస్టు భారీగా చోరీ సొత్తు స్వాధీనం
విజయవాడ , నవంబర్ 23: ఇళ్ళల్లో దొంగతనాలకు పాల్పడే అంతర్ జిల్లా పాత నేరస్థుడిని వన్‌టౌన్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుని వద్ద నుంచి ఐదు లక్షల రూపాయలు విలువైన బంగారు, వెండి నగలు స్వాధీనం చేసుకున్నట్లు వెస్ట్ ఏసిపి హరికృష్ణ తెలిపారు. ప్రకాశం జిల్లా చీరాలకు చెందిన దాసరి ముఖేష్ (30) అనే వ్యక్తి 2002 నుంచి దొంగతనాలు చేయడం మొదలెట్టాడు. నిందితునిపై విజయవాడ నగర కమిషనరేట్‌తోపాటు పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు, భీమవరం, తూర్పు గోదావరి జిల్లా మండపేట, గుంటూరు జిల్లా పొన్నూరు, బాపట్ల, చిత్తూరు జిల్లా తిరుపతిలో తదితర చోట్ల కేసులున్నాయని, రాత్రి వేళల్లో ఇళ్ళ తాళాలు పగులగొట్టి నేరాలకు పాల్పడేవాడని ఏసిపి తెలిపారు. గతంలో పలు కేసుల్లో రాజమండ్రి జైలులో కూడా ఉన్నాడని, 2012 జనవరి 21న బెయిల్‌పై విడుదలై మళ్లీ నేరాలకు ఉపక్రమించాడు. ఈక్రమంలో వన్‌టౌన్ పోలీస్టేషన్ పరిథిలోని హెచ్‌బి కాలనీ, విద్యాధరపురం అదేవిధంగా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఐదు చోట్ల ఇళ్ళల్లో దొంగతనాలకు పాల్పడినట్లు ఏసిపి తెలిపారు. నిందితుని వద్ద నుంచి ఐదు లక్షలు రూపాయలు విలువైన 155గ్రాముల బంగారు నగలు, కిలో వెండి వస్తువులు స్వాధీనం చేసుకున్నటు తెలిపారు. వన్‌టౌన్ సిఐ హనుమంతరావు నేతృత్వంలో క్రైం ఎస్‌ఐ దుర్గారావు సిబ్బంది అరెస్టు చేసినట్లు తెలిపారు.