విజయవాడ, నవంబర్ 23: ప్రతి పేద మహిళకు సామాజిక భద్రత కల్పించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని, ఆర్థిక స్వావలంబన కల్పించేందుకు ప్రభుత్వం అమలుచేస్తున్న పథకాలను పట్టణ ప్రాంత మహిళలకు చేరువ చేయాలన్నదే మెప్మా ప్రధాన ఉద్దశ్యమని రాష్ట్ర సామాజిక భద్రత నిపుణురాలు పి. గీత అన్నారు. అభయహస్తం, జనశ్రీ, బీమాయోజన, స్వావలంబన, రుణ బీమా పథకాలపై అవగాహన కల్పించేందుకు శుక్రవారం ఉదయం రాష్ట్ర ప్రభుత్వ అతిధి గృహంలో బీమా మిత్రాలతో రాష్ట్ర సామాజిక భద్రత నిపుణురాలు పి. గీత ప్రాంతీయ సదస్సును నిర్వహించారు. సదస్సులో ఆమె మాట్లాడుతూ పట్టణ ప్రాంతాలకు చెందిన నిరుపేద మహిళలకు ఆర్థిక స్వావలంబన కల్పించేందుకు ప్రవేశపెట్టిన పథకాలపై బీమా మిత్రాలు పూర్తి అవగాహనను కలిగి వుండాలన్నారు. మెప్మా ద్వారా మహిళలకు బ్యాంకు లింకేజి రుణాలు అందించటం అతి తక్కువ ప్రీమియంతో బీమా పథకం అమలుతోపాటు 50 శాతం ప్రభుత్వం చెల్లించేలా పథకాలను అమలు చేస్తుందన్నారు. అభయహస్తం పథకంలో చేరిన లబ్ధిదారుల పిల్లలకు స్కాలర్‌షిప్‌లు మంజూరు, జనశ్రీ బీమా యోజన వారి పిల్లలకు రూ. 1200లు చెల్లించటం జరుగుతుందన్నారు. సాధారణంగా పాలసీదారుడు మరణిస్తే రూ. 30వేలు, ప్రమాదవశాత్తు మరణిస్తే రూ. 75వేలు, శాశ్వత అంగవైకల్యం అయితే రూ. 37,500 చెల్లించటం జరుగుతుందన్నారు. అమలుచేసే పథకాలు ద్వారా పేద మహిళలకు ఆర్థిక స్వావలంబన దోహదపడతాయని వాటిని సద్వినియోగం చేసుకునేలా బీమా మిత్రాలు మరింత కృషిచేయాలని గీత సూచించారు. మెప్మా ప్రాజెక్టు డైరక్టర్ కోట్ల శివశంకర్ మాట్లాడుతూ జిల్లాలో 11,735 మంది అభయహస్తం, 23,264 మంది జనశ్రీ యోజనా పథకం, 26 మంది స్వావలంబనా పథకం లబ్ధిదారులు వున్నారన్నారు. రానున్న డిసెంబర్ మాసం నుండి అమల్లోకి రానున్న రుణబీమా పథకంపై పేద మహిళలకు అవగాహన కల్పించనున్నామన్నారు. పట్టణ ప్రాంత పేద మహిళలకు అవగాహనా సదస్సులు నిర్వహించి ప్రభుత్వం అమలుచేస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకునేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాలకు చెందిన బీమా మిత్రలకు నిర్వహించిన ఈ అవగాహన సదస్సులో జిల్లాలకు చెందిన మెప్మా ఐబి స్పెషలిస్ట్ ఫణికుమార్, లైవ్ లీ హుడ్ స్పెషలిస్ట్ మాధవి, వివిధ జిల్లాలకు చెందిన జిల్లా సామాజిక భద్రతా నిపుణులు వెంకటేశ్వరరావు, భారతి, పిడి బాబు, రత్నం శ్రీనివాస్, సుధాకర్, శ్యామల తదితరులు పాల్గొన్నారు.
* రాష్ట్ర సామాజిక భద్రత నిపుణురాలు గీత
english title:
social security
Date:
Saturday, November 24, 2012