మచిలీపట్నం , నవంబర్ 23: విశ్వమంతా ఉండే విశ్వహిందూ పరిషత్‌ను ఏర్పాటు చేసి 50ఏళ్ళు పూర్తయిందని విశ్వహిందూ పరిషత్ జిల్లా అధ్యక్షులు డా. బి ధన్వంతరి ఆచార్య అన్నారు. స్థానిక నాగపోతురావు సెంటరులోని శ్రీ సత్యనారాయణస్వామి ఆలయంలో శుక్రవారం హిందువుల కలయిక, హితచింతకుల సమ్మేళనాన్ని ఘనంగా నిర్వహించారు. తొలుత భారతమాతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈసందర్భంగా డా. బి ధన్వంతరి ఆచార్య మాట్లాడుతూ హిందూ జాతి కోసం విశ్వహిందూ పరిషత్ అనేక ఉద్యమాలు చేపట్టిందన్నారు. పల్లపాటి సుబ్రహ్మణ్యం, మిన్నకంటి హనుమంతరావు, చినముత్తేవి సూర్యప్రకాశరావు, డా. మారుతి శర్మ, చేవూరి రమేష్, జి అరుణజ్యోతి, గుమ్మడి కృష్ణ, తురగా ప్రసాద్, ఎబివిపి నాయకులు బి సుజయ్‌కుమార్, కె వెంకట రత్నం పాల్గొన్నారు.
అటవీ భూముల్లో ఆక్రమణదారులుంటే తరిమేస్తాం
మైలవరం, నవంబర్ 23: అటవీ భూములలో ఆక్రమణదారులెంతటి వారున్నా తరిమేసి అటవీ సంపదను కాపాడటంతోపాటు అర్హత కలిగిన పేదలకు చట్టప్రకారం భూములను అప్పగిస్తామని చీఫ్ కన్సర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ (సీసీఎఫ్) విజిలెన్స్ అధికారి స్వర్గం శ్రీనివాస్ హెచ్చరించారు. శుక్రవారం ఆయన మండలంలోని పొందుగల అటవీ భూములను రాజమండ్రి సీసీఎఫ్ కృష్ణ, కృష్ణాజిల్లా స్క్వాడ్ డీఎఫ్‌ఓ బెనర్జీ, జిల్లా డీఎఫ్‌ఓ జె హరిబాబులతో కలసి పరిశీలించారు. ఈ భూముల విషయమై ఎంతోకాలంగా కొనసాగుతున్న వివాదంపై అధికారులు పరిశీలించారు. అటవీ భూములను ఆక్రమించుకుని సాగు చేసుకుంటున్నారనే అభియోగం మోస్తున్న భూస్వామి నాగరాజు ఈసందర్భంగా ఈ ఏరియాలో తనకున్న భూములకు సంబంధించిన ఆధారాలను అధికారులకు చూపించాడు. కాగా ఈ ఆధారాలన్నీ అభూత కల్పనలని గిరిజన సంఘం నేతలు అధికారుల ముందు వాగ్వాదానికి దిగారు. ఈసందర్భంగా అధికారులు అటవీ భూములను పరిశీలించిన అనంతరం శ్రీనివాస్ విలేఖర్లతో మాట్లాడుతూ... పొందుగల ఏరియాలో 6,730 ఎకరాల అటవీ భూమి ఉందని ప్రస్తుతం ఇది కొంత ఆక్రమణలలోనూ, మరికొంత సరిహద్దు వివాదంలోనూ ఉందన్నారు. దీనిని గతంలో రెండుమార్లు ఆర్డీఓ, అటవీ అధికారులు కలిసి సరిహద్దులను పరిశీలించినా సరైన క్లారిటీ రాలేదని, ఈ కారణంగానే ఈ సమస్య పరిష్కారమవలేదని అన్నారు. త్వరలో ల్యాండ్ సర్వే, అటవీ, రెవెన్యూ శాఖల సంయుక్త ఆధ్వర్యంలో సర్వే నిర్వహించి అటవీ భూములు ఎంత ఉండాలో అంత మొత్తాన్ని స్వాధీనం చేసుకుంటామన్నారు. ఈ క్రమంలో ఆయా భూములలో భూస్వాములు ఎంతటి వారున్నప్పటికీ బయటికి పంపుతామని స్పష్టం చేశారు. అక్కడి నుండి అధికారులు తిరిగి వస్తుండగా పొందుగల తండాలో గిరిజన సంఘం ఆధ్వర్యంలో పేదలు అధికారుల జీపులను అడ్డగించి తమకు న్యాయం చేయాలని ధర్నాకు దిగారు. అటవీ భూములలో తిష్టవేసుకున్న భూస్వాములను తక్షణమే బయటికి పంపివేసి ఆ భూములను పేదలకు పంపిణీ చేయాలని గిరిజనులు డిమాండ్ చేశారు. ఇందుకు స్పందించిన అధికారులు త్వరలో అటవీ భూములలో పూర్తిస్థాయిలో సర్వే నిర్వహింపజేసి అర్హత కలిగిన పేదలకు చట్టప్రకారం భూములను ఇస్తామని హామీ ఇవ్వటంతో గిరిజనులు శాంతించారు. కన్సర్వేటర్ సూర్యనారాయణ, మైలవరం రేంజర్ జగన్‌మోహనరావు పాల్గొన్నారు.
శక్తిహీనమైన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు
అవనిగడ్డ, నవంబర్ 23: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు శక్తిహీనమై విధాన నిర్ణయాలు తీసుకోలేక పోతున్నాయని జిల్లా తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి బచ్చుల అర్జునుడు విమర్శించారు. పార్టీ ఆధ్వర్యంలో పాదయాత్రల నిర్వహణ కార్యక్రమాన్ని ప్రకటించటానికి శుక్రవారం ఇక్కడకు వచ్చిన ఆయన విలేఖర్లతో మాట్లాడారు. అభివృద్ధి, సంక్షేమాలను ఆయా ప్రభుత్వాలు మరిచి కేవలం పదవులు నిలుపుకోవడం కోసమే పాలక పార్టీ నాయకులు పని చేస్తున్నారన్నారు. ముఖ్యమంత్రి మాటలు నమ్మి వరి సాగుచేసే వారు తీవ్ర నష్టాలకు గురయ్యారని, వారికి పరిహారం ప్రకటించటంలో ప్రభుత్వం వెనుకబడి ఉందని విమర్శించారు. నిత్యావసర ధరలపై నియంత్రణ లేదని, డీజిల్, పెట్రోల్ ధరల నిర్ణయం ఆయా కంపెనీలకే వదిలేశారన్నారు. పాలకులు కేవలం కీలుబొమ్మలుగా పని చేస్తున్నారన్నారు. పలు కుంభకోణాలకు అవినీతిమయంగా మారిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పాలన చేసే అవకాశం లేదని, చివరకు సోనియా అల్లుడు కూడా అవినీతిలో కూరుకుపోయాడని, ఆయన మీద మాత్రం చట్టపరమైన చర్యలు లేవన్నారు. ఈనేపథ్యంలో సమర్థవంతమైన నాయకత్వం కావాలంటే చంద్రబాబును తిరిగి అధికారంలోకి తేవాల్సిన అవసరం ఉందన్నారు. గతంలో ఆయన కేంద్రంపై పోరాటం చేసి పలు సంక్షేమ పథకాలు తీసుకొచ్చారని ఆయన గుర్తుచేశారు. చంద్రబాబు పాదయాత్రకు మద్దతుగా దివిసీమలో కార్యరక్తలు పాదయాత్రలు నిర్వహిస్తారని పేర్కొన్నారు. సమావేశంలో బచ్చు వెంకట నాగప్రసాద్, లింగం ప్రసాద్, బండే శ్రీనివాసరావు, ఎ సాయి, దిలీప్‌కుమార్ పాల్గొన్నారు.