నందిగామ, నవంబర్ 23: తడిసిన పత్తిని సైతం సిసిఐ ద్వారా కొనుగోలు చేసేందుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఎమ్మెల్యే తంగిరాల ప్రభాకరరావు సహా తెలుగుదేశం, వామపక్షాల నేతలు శుక్రవారం మార్కెట్ కమిటీ వద్ద బైఠాయించి ఆందోళన నిర్వహించారు. పత్తి కొనుగోలు కేంద్రాన్ని సిసిఐ ఎత్తివేయడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారని, పక్కనే కంచికచర్లలో సిసిఐ పత్తి కొనుగోళ్లు నిర్వహిస్తుండగా నందిగామలో ఎందుకు ఎత్తివేశారని ప్రశ్నించారు. తడిసిన పత్తికి సైతం ధర నిర్ణయించి కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని నేతలు డిమాండ్ చేశారు. రైతులు సహా నేతలు ఆందోళన చేస్తున్న సమయంలో సిసిఐ బయ్యర్ అలెగ్జాండర్ అక్కడకు చేరుకోగా రైతులు, నేతలు ఆయన్ను నిలదీశారు. దీంతో ఆయన మాట్లాడుతూ తన చేతిలో ఏమి లేదని, సిసిఐ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తాను విధులను నిర్వహిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా సిసిఐ జిఎం (గుంటూరు) పాణిగ్రాహికి ఎమ్మెల్యే తంగిరాల ప్రభాకరరావు ఫోన్ చేసి పత్తి రైతులు ఎదుర్కొంటున్న దుస్థితిని వివరించి తడిసిన పత్తిని కొనుగోలు చేసేందుకు ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. దీనిపై ఆయన ఈ నెల 26న కేంద్ర, రాష్ట్ర ప్రతినిధులతో సమావేశం ఉందని, ఆ సమావేశంలో తీసుకునే నిర్ణయాలకు అనుగుణంగా తాము వ్యవహరిస్తామని తెలియజేశారు. ఈ ఆందోళన మండల టిడిపి అధ్యక్షుడు చిరుమామిళ్ల శ్రీనివాసరావు, ఎస్‌సి సెల్ జిల్లా అధ్యక్షుడు కనె్నకంటి జీవరత్నం, తెలుగుదేశం, వామపక్షాలకు చెందిన నేతలు కొండూరు వెంకట్రావు, చుండూరు సుబ్బారావు, చనుమోలు సైదులు, మల్లెపాక మధు, ఖాసిం, వైఎస్‌ఆర్‌సిపికి చెందిన ముక్కపాటి శివాజీ తదితరులు పాల్గొన్నారు.
శాంతి భద్రతల పరిరక్షణలో..
ఎస్పీ జయలక్ష్మి సేవలు భేష్
* కలెక్టర్ బుద్ధప్రకాష్ ప్రశంస
మచిలీపట్నం, నవంబర్ 23: శాంతి భద్రతలను పరిరక్షించటంలో జిల్లా ఎస్పీగా ఆర్ జయలక్ష్మి గణనీయమైన కృషి చేశారని జిల్లా కలెక్టర్ డా. బుద్ధప్రకాష్ ఎం జ్యోతి ప్రశంసించారు. జయలక్ష్మి బదిలీ అయిన సందర్భంగా శుక్రవారం రాత్రి పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ ఎంతకాలం పని చేశామనేది కాకుండా ఎంత బాగా పని చేశామనేది ముఖ్యమన్నారు. మూడేళ్లకు ఒకసారి బదిలీ అయినా, సంవత్సరంలో మూడుసార్లు బదిలీ అయినా సక్సెస్ ఫుల్ అధికారులకు గుర్తింపు ఉంటుందన్నారు. జయలక్ష్మి ముక్కుసూటిగా వ్యవహరించి నిజాయితీతో బాధ్యతలు నిర్వర్తించారన్నారు. అక్రమాల పట్ల కఠినమైన చర్యలు తీసుకున్నారని ప్రశంసించారు. ఏలూరు రేంజ్ డిఐజి సూర్యప్రకాశరావు మాట్లాడుతూ జయలక్ష్మి ఎస్పీగా ఏడునెలలు ఇక్కడ పనిచేసినా సమర్థవంతంగా బాధ్యతలు నిర్వర్తించారన్నారు. జయలక్ష్మి స్పందిస్తూ తాను విధి నిర్వహణలో ముక్కుసూటిగా వ్యవహరిస్తూ విధి నిర్వహణలో అలక్ష్యం చూపిన అధికారులకు మెమోలు ఇచ్చానని, ఇది వ్యక్తిగత కక్షతో చేసింది కాదన్నారు. వృత్తిరీత్యా వారి ఎదుగుదల కోసమే అలా వ్యవహరించానన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా పోలీస్ యంత్రాంగాన్ని అప్రమత్తం చేశానని చెప్పారు. జిల్లా జడ్జి మానవేంద్రనాథ్ రాయ్ అధ్యక్షతన జరిగిన ఈ సభలో అదనపు ఎస్పీ వి ప్రేమ్‌కుమార్, అదనపు ప్రత్యేక జడ్జి పార్థసారథి, రీజనల్ సర్వీసెస్ అథారిటీ సెక్రటరీ కాశీవిశే్వశ్వరరావు, ఆర్డీవో ఐ వెంకటేశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు. జయలక్ష్మిని పలువురు అధికారులు ఘనంగా సత్కరించారు. కాగా, ఎస్పీ జయలక్ష్మి బదిలీ అయిన సందర్భంగా స్థానిక పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో శుక్రవారం జిల్లా ఆర్మ్‌డ్ పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ విధి నిర్వహణలో పోలీసులు ప్రజల మన్ననలు పొందాలన్నారు. అదనపు ఎస్పీ ప్రేమ్‌కుమార్, ఎఆర్ డిఎస్పీ బి చంద్రశేఖర్, నందిగామ, అవనిగడ్డ, బందరు, గుడివాడ డిఎస్పీలు, వివిధ హోదాల్లోని అధికారులు పాల్గొన్నారు.
రాష్టస్థ్రాయి ఖోఖో చాంప్స్ కృష్ణా, విజయనగరం జట్లు
గుడివాడ, నవంబర్ 23: గుడివాడ ఎన్టీఆర్ స్టేడియంలో మూడు రోజులుగా జరుగుతున్న 46వ ఆంధ్రా సీనియర్ ఖోఖో రాష్టస్థ్రాయి పోటీల్లో మహిళల విభాగంలో కృష్ణా జిల్లా, పురుషుల విభాగంలో విజయనగరం జిల్లా జట్లు చాంపియన్లుగా నిలిచాయి. శుక్రవారం మధ్యాహ్నం హోరాహోరీగా జరిగిన ఫైనల్స్ పోటీలో మహిళల విభాగంలో విశాఖ జట్టుపై కృష్ణా జట్టు, పురుషుల విభాగంలో విశాఖ జట్టుపై విజయనగరం జట్టు విజయం సాధించాయి. కృష్ణా, విజయనగరం జిల్లాల జట్లు అద్భుతమైన ప్రతిభను కనబర్చి అన్ని విభాగాల్లో రాణించాయి. విజేతలకు మున్సిపల్ కమిషనర్ ఎన్ ప్రమోద్‌కుమార్, ఖోఖో అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు యలవర్తి శ్రీనివాసరావు బహుమతులను అందజేశారు. ఈసందర్భంగా జరిగిన సభలో ప్రమోద్‌కుమార్ మాట్లాడుతూ... ప్రతి యువతీ యువకుడు క్రీడలకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. విద్యావ్యవస్థలో మార్కులకు మాత్రమే ప్రాముఖ్యం ఇవ్వడం సరికాదన్నారు. రాష్టస్థ్రాయి పోటీల్లో ప్రతిభ కనబర్చి జాతీయ స్థాయికి ఎంపికైన క్రీడాకారులు అక్కడ కూడా రాణించి రాష్ట్రానికి మంచిపేరు తేవాలన్నారు. అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు యలవర్తి మాట్లాడుతూ 13జిల్లాల నుండి ఖోఖో జట్లు వచ్చాయని చెప్పారు. అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి టిఎస్‌ఆర్‌కె ప్రసాద్ మాట్లాడుతూ పోటీలు విజయవంతంగా ముగిశాయని, జాతీయ పోటీల్లో పాల్గొనే రాష్ట్ర జట్టును త్వరలో ప్రకటిస్తామన్నారు. అనంతరం ఖోఖో అభివృద్ధికి కృషి చేస్తున్న పలువురిని సన్మానించారు. కాగా మహిళల విభాగంలో విశాఖ జట్టు ద్వితీయ స్థానం, విజయనగరం, పశ్చిమగోదావరి జట్లు సంయుక్తంగా తృతీయ స్థానం, పురుషుల విభాగంలో విశాఖ జట్టు ద్వితీయ స్థానం, ప్రకాశం, పశ్చిమగోదావరి జిల్లాల జట్లు సంయుక్తంగా తృతీయ స్థానంలో నిలిచాయి. కార్యక్రమంలో అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కె నాగేశ్వరరావు, జిల్లా కార్యదర్శి మడకా ప్రసాద్, డిఎస్‌డివో రామకృష్ణ, ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడు కెపి రావు, చీఫ్ ప్యాట్రన్స్ ఎం పుల్లారెడ్డి, సత్యనారాయణ, స్టేడియం కమిటీ సభ్యులు బొగ్గరపు తిరుపతయ్య, పొట్లూరి వెంకట కృష్ణారావు, పిన్నమనేని సాంబశివరావు పాల్గొన్నారు.