హైదరాబాద్, నవంబర్ 26: తెలంగాణలో ఉత్పత్తి జరిగే పాలకు అన్యాయం జరుగుతోందని, సీమాంధ్రలో పాలసేకరణకు పెద్ద పీట వేస్తున్నారని తెలంగాణ రాష్ట్ర సమితి శాసనసభ్యుడు హరీష్‌రావు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ముఖ్యమంత్రిని కలిసి తెలంగాణలో పాల సమస్యలపై వినతిపత్రం అందించారు. హెరిటేజ్, జెర్సీ, తిరుమల వంటి పాల సేకరణ కేంద్రాలు సిండికేట్‌గా ఏర్పడి తెలంగాణ పాలకు అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. అదిలాబాద్, మెదక్, నల్లగొండ ప్రాంతాల్లో నెలకు మూడు రోజులపాటు పాల సేకరణ నిలిపివేయాలని ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు తెలంగాణ ప్రాంతంలో పాల ఉత్పత్తి దారులకు నష్టం కలిగిస్తున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రాంతంలో తెలంగాణ ప్రాంతం పాలను కొనుగోలు చేసిన తరువాతే సీమాంధ్ర పాలను కొనుగోలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. సీమాంధ్రలోని పాల సేకరణ కేంద్రాలు లీటరుకు రెండు రూపాయలు తగ్గించి రైతులకు ఇస్తూ, వినియోగదారులకు మాత్రం సాధారణ ధరలకే పాలు విక్రయిస్తున్నారని ఆయన ముఖ్యమంత్రికి వివరించారు. ఈ నేపథ్యంలో తెలంగాణలో గర్భిణీలకు మధ్యాహ్న పాల విధానం అమలు చేయాలని, తెలంగాణలో పాలపొడి కర్మాగారాన్ని ఏర్పాటుచేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఇక్కడి పాల ఉత్పత్తి దారులకు రెండు రూపాయల ప్రోత్సాహకం ఇవ్వాలని కోరారు. తెలంగాణలో పాల ఉత్పత్తిదారుల తరఫున తమ పార్టీ ఉద్యమిస్తుందని వెల్లడించారు.
ఎబివిపి పాదయాత్రలు ప్రారంభం
హైదరాబాద్, నవంబర్ 26: ప్రత్యేక తెలంగాణను తక్షణం ఏర్పాటు చేసేందుకు వీలుగా పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టాలని కోరుతూ, కాంగ్రెస్ మోసపూరిత వైఖరిని ఎండగడుతూ ఎబివిపి తెలంగాణ ప్రాంతంలో విద్యార్ధి మహాపాదయాత్రలు సోమవారం నాడు ఘనంగా ప్రారంభమయ్యాయి. కరీంనగర్, భూపాలపల్లి, బోధన్, నారాయణ్‌పేట, కోదాడలలో ఈ యాత్రలు ప్రారంభమయ్యాయి. ఈ యాత్రలన్నీ చివరికి హైదరాబాద్ ఉస్మానియా యూనివర్శిటీకి ఆరోతేదీనాటికి చేరుకుంటాయి. కరీంనగర్‌లో శాతవాహన విశ్వవిద్యాలయం యూనివర్శిటీ ప్రిన్సిపాల్ కోమల్‌రెడ్డి, ఎబివిపి రాష్ట్ర పూర్వ అధ్యక్షుడు మంగు నర్సింహాద్రి ప్రారంభించారు. అక్కడి నుండి ప్రారంభమైన యాత్ర కరీంనగర్‌లోని తెలంగాణ చౌక్‌కు చేరుకుంది. ఈ సభలో పొలిటికల్ జెఎసి చైర్మన్ మల్లేపల్లి లక్ష్మయ్య, కాకతీయ యూనివర్శిటీ రిటైర్డ్ ప్రొఫెసర్ కూరపాటి వెంకటనారాయణ, ప్రొఫెసర్ సీతారాం నాయక్, ఎబివిపి తెలంగాణ రాష్టక్రార్యదర్శి పాండురంగారెడ్డిలు పాల్గొన్నారు. భూపాలపల్లిలో తెలంగాణ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు విఠల్, ఉస్మానియా యూనివర్శిటీ పూర్వ విసి తిరుపతిరావు, విద్యుత్ జాక్ కార్యదర్శి శివాజీ, కాకతీయ వర్శిటీ టీచర్సు అసోసియేషన్ అధ్యక్షుడు దామోదర్‌రావులు పాల్గొన్నారు. బోధన్‌లో పాదయాత్రల ప్రారంభోత్సవ సభలో అడ్వకేట్ జాక్ అధ్యక్షుడు రాజేందర్‌రెడ్డి, జూలూరి గౌరీశంకర్, ప్రొఫెసర్ లక్ష్మణ్, ఎబివిపి నేత మూల రాములు పాల్గొన్నారు. నారాయణ్‌పేట్‌లో సత్యనారాయణ చౌరాస్తాలో జరిగిన బహిరంగ సభలో తెలంగాణ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాస్‌గౌడ్, శైలేష్‌రెడ్డి, వెంకటాచార్య, ఎబివిపి నేతలు కరేంద్రనాధ్ తదితరులు పాల్గొనగా, కోదాడలో జాక్ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్, తెలంగాణ ఫిలిం ఛాంబర్స్ చైర్మన్ విజయేందర్‌రెడ్డి, అఖిల భారత బార్ కౌన్సిల్ సభ్యుడు ఎన్ రామచంద్రరావు, ఎబివిపి జాతీయ కార్యదర్శి కడియం రాజు, క్షేత్ర సహ సంఘటనా కార్యదర్శి గుంతా లక్ష్మణ్‌లు పాల్గొన్నారు.
మక్కా పేలుళ్ల నిందితులకు బెయిల్ మంజూరు
హైదరాబాద్, నవంబర్ 26: మక్కామసీదు పేలుళ్ల కేసులో నిందితులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న దేవేంద్రగుప్తా, లోకేశ్‌శర్మలకు నాంపల్లి కోర్టు సోమవారం బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసుల్లో వీరు అరెస్టు అయి చంచల్‌గూడ జైల్లో జ్యుడిషియల్ రిమాండ్‌లో ఉన్నారు.