హైదరాబాద్, నవంబర్ 26: కొల్లేరు సమస్య మళ్లీ తెరపైకి వస్తోంది. ముంపు సమస్యతోపాటు, మూడో కాంటూరు పరిధిలోకి కొల్లేరును తీసుకురావడంపై చర్చ తీవ్రతరమవుతోంది. ప్రకృతి వైపరీత్యాల సమయంలో ఈ ప్రాంతం ముంపునకు గురికావడం, పంటకు తీవ్ర నష్టం వాటిల్లుతుండడంతో ఇప్పుడు ప్రభుత్వం మళ్లీ పునరాలోచన చేసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఇదే సమయంలో కొల్లేరు ప్రాంతంలో మళ్లీ చేపల చెరువులు పుట్టుకొస్తుండడం అధికారుల్లో ఆందోళనకు కారణమవుతోంది. ఇప్పుడు కొల్లేరును రెండు అంశాలు వేధిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం ఉన్న ఐదో కాంటూరు పరిధి నుంచి మూడో కాంటూరు పరిధికి మార్పు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు విఫలం కావడం ఒక సమస్యగా ఉంటే గతంలో సుప్రీంకోర్టు ఆదేశాలతో తొలగించిన చేపల చెరువులు మళ్లీ పుట్టుకొస్తుండడం ఇంకో సమస్యగా మారుతోంది. ఈ రెండు అంశాలు అత్యంత కీలకంగా మారుతుండడంతో అధికారులు తలపట్టుకుంటున్నారు. కొల్లేరు సరస్సును ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోయిన చేపల చెరువులను కోర్టు ఆదేశాలతో తొలగించడంతో కొంతవరకు నీటి ప్రవాహానికి దారి ఏర్పడింది. ఇదే సమయంలో ఐదో కాంటూరు నుంచి మూడో కాంటూరుకు మార్పు చే యాలని తీ సుకున్న నిర్ణ యం మా త్రం బెడిసికొట్టింది. జాతీ య వైల్డ్‌లైఫ్ బోర్డు ఐదో కాంటూరుపై స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడంతోపాటు రాష్ట్ర బోర్డు నుంచి వివరణ కోరింది. అయితే రాష్ట్ర బోర్డు నుంచి కాకుండా నేరుగా శాసనసభలో మూడో కాంటూరుపై తీర్మానం చేస్తూ కేంద్రానికి పంపించడంతో కథ అడ్డం తిరిగింది. దీనిని ఆమోదించని కేంద్ర బోర్డు శాసనసభ తీర్మానాన్ని కూడా తిరస్కరిస్తూ దానిని రాష్ట్ర బోర్డుకు పంపించివేసింది. అప్పటి నుంచి ఈ తీర్మానం రాష్ట్ర బోర్డు వద్దనే మురిగిపోయింది.
ఇక గతంలో తొలగించిన చేపల చెరువులు నెమ్మది నెమ్మదిగా మళ్లీ ఊపందుకుంటున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఉపగ్రహ ఛాయాచిత్రాల్లో కూడా కొత్త చెరువులు కనిపిస్తున్నట్లు వారు అంటున్నారు. ఐదో కాంటూరు ప రిధి నుంచి మూడో కాం టూరు పరిధిలోకి ఈ ప్రాం తాన్ని తీసుకువచ్చేందుకు ప్రభుత్వం చే స్తున్న ప్రయత్నాలతో మళ్లీ అక్రమార్కు ల్లో ఆశలను పెంచుతున్నట్లు అధికారులే అభిప్రాయపడుతున్నారు. దీంతో ఇప్పుడు మళ్లీ కొత్త చెరువుల సమస్య చుట్టుకుంటోందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
గతంలో చెరువుల కారణంగా సరస్సులో, కాలువలు, నదుల్లో నీటి ప్రవాహానికి ఇబ్బందులు తలెత్తగా, తరువాత చెరువులను తొలగించడంతో కొంత ఉపసమనం కలిగింది. తాజాగా మళ్లీ పాత సమస్యే పునరావృతమవుతుండడంతో నీటి ప్రవాహ సమస్య కూడా నెలకొనే ప్రమాదం ఉన్నట్లు వారు అంచనా వేస్తున్నారు. ఈ సమస్య ప్రకృతి వైపరీత్యాల సమయంలో మరింత ఎక్కువగా ఉంటుందని కూడా వారు అభిప్రాయపడుతున్నారు. ఇటీవల సంభవించిన నీలం తుపాను సమయంలో ఏలూరు చుట్టుపక్కల ప్రాంతాలతోపాటు, కొల్లేరు ప్రాంతంలో కూడా నీరు పెద్దగా నిల్వ ఉండిపోవడాన్ని ఇందుకు ఉదాహరణగా అధికారులు చెబుతున్నారు. కొల్లేరు నుంచి అదనపు నీరు సముద్రంలోకి వెళ్లిపోయేందుకు ఒకే వాగు ఉండడం, అది కూడా అక్రమణల కారణంగా పూడికలు పెరిగి సముద్రపు నీరే వెనుకకు తన్నుకువచ్చే ప్రమాదం ఉంటుందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వాస్తవ పరిస్థితులను మరోసారి అంచనా వేసి కొల్లేరుపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరాన్ని కూడా అధికారులు గుర్తుచేస్తున్నారు. దీనికోసం ముఖ్యమంత్రి దృష్టికి కూడా ఈ సమస్యను తీసుకువెళ్లాలని అటవీశాఖ, వైల్డ్ లైఫ్ బోర్డు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.
మళ్లీ పుట్టుకొస్తున్న చెరువులు కదలని మూడో కాంటూరు ఫైలు అటకెక్కిన నాటి అసెంబ్లీ తీర్మానం నీటి ప్రవాహానికి తొలగని అడ్డంకులు వెనుకకు వస్తున్న సముద్రపు నీరు
english title:
kolleru
Date:
Tuesday, November 27, 2012