హైదరాబాద్, నవంబర్ 26: రాష్ట్ర ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ పార్టీని తన కనుసన్నల్లో నడిపించడం తప్ప ఎవరో చెబితే తాను ఆచరించబోనని, తాను చేయాల్సింది చేస్తానని ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి విస్పష్టంగా చెబుతున్నారు. పార్టీ నేతల నుంచి, ప్రభుత్వ యంత్రాంగం నుంచి తనకు సహకారం లభించడం లేదన్న విమర్శలను పట్టించుకోబోనని ఆయన స్పష్టం చేశారు. తనకు నచ్చింది చేస్తానని, ఎదుటి వ్యక్తి చెప్పినట్టు చేయాలన్నది తన కర్తవ్యం కాదని ఆయన అన్నారు. తన రెండేళ్ళ పాలనలో రాష్ట్రం సాధించిన ప్రగతి గురించి ప్రజల్లో విస్తత్రంగా ప్రచారం చేయడానికి కాంగ్రెస్ కార్యకర్తలను పురమాయిస్తానన్నారు. కాంగ్రెస్ అధిష్టానం తనను ముఖ్యమంత్రిగా ప్రకటించిన నాడు ఏమి చెప్పానో అదే చేస్తున్నానని ఆయన చెప్పారు. ఈ విషయంలో మరొకరికి అకాశం ఇవ్వబోనంటూ ఆయన పరోక్షంగా పార్టీ సీనియర్ నేతలను హెచ్చరిస్తున్నారు. పరిపాలనలో ఇక నుంచి దూకుడుగా వ్యవహరిస్తానని, పార్టీ అధిష్టానం ఒక లక్ష్యంతో తనకు ముఖ్యమంత్రి పీఠాన్ని అప్పగించిందని, ఆ లక్ష్యాన్ని నెరవేర్చేందుకు శాయశక్తులా కృషి చేస్తానని కిరణ్‌కుమార్ రెడ్డి పేర్కొన్నారు. ఎస్సీ,ఎస్టీ వర్గాల అభివృద్ధి ఇప్పటి వరకు కాగితాలకే పరిమితమైందని, ఆ వర్గాల సంక్షేమం కోసం ఉద్ధేశించిన నిధులను పూర్తిగా ఖర్చు చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నానని వెల్లడించారు. విద్యార్థుల ఫీజు రీయంబర్స్‌మెంట్ చెల్లించడంలో కొంత ఆలస్యమైనా వారి చదువులకు ఇబ్బందులు లేకుండా చూస్తున్నానని చెప్పుకొచ్చారు. గత రెండు సంవత్సరాలుగా ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నానని, ఇక నుంచి అలాంటివి పునరావృతం కాకుండా జాగ్రత పడతానని ముఖ్యమంత్రి అన్నారు.
ఎవరో చెప్పింది చేయను* విమర్శలను పట్టించుకోను * రెండేళ్ల పాలనపై కిరణ్
english title:
ika dookude
Date:
Tuesday, November 27, 2012