హైదరాబాద్, నవంబర్ 26: రాష్ట్రంలో పర్యాటక రంగానికి మంచి భవిష్యత్తు ఉందని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కె చిరంజీవి అన్నారు. సోమవారం ఆయన పర్యాటక భవన్‌ను సందర్శించి వివిధ పర్యాటక ప్రాజెక్టుల పని తీరును సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన అధికారులను ఉద్దేశించి మాట్లాడుతూ తనకు అత్యంత ఇష్టమైన పర్యాటక శాఖ పోర్ట్ఫులియోను ప్రధాని మన్మోహన్ సింగ్ కేటాయించడం ఆనందంగా ఉందన్నారు. తాను దేశమంతా తిరిగి పర్యాటక రంగం విశిష్టతను ప్రజలకు తెలియజేస్తానన్నారు. మన దేశంలో పర్యాటక రంగంలో అపారమైన వనరులున్నాయని, కాని వీటి వినియోగం సరిగా లేదన్నార. పర్యాటక రంగాన్ని ఇతర దేశాలతో ధీటుగా అభివృద్ధి చేసి యువతకు ఉపాధి కల్పించవచ్చన్నారు. పార్లమెంటు సమావేశాలు ఉన్నప్పటికీ తాను ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ ఇచ్చిన ఆహ్వానాన్ని అందుకుని, తన స్వరాష్ట్రంలో పర్యాటక రంగం అభివృద్ధికి చర్యలు తీసుకోవాలనే సంకల్పంతో ఉన్నట్లు చెప్పారు. ఇటీవల తాను జమ్ముకాశ్మీర్ రాష్ట్రాన్ని సందర్శించి అక్కడి పర్యాటక రంగం అభివృద్ధి తీరు తెన్నులను తెలుసుకున్నానన్నారు. గతంలో ఆ రాష్ట్రం పర్యాటక రంగంలో నష్టపోయిన తీరును తెలుసుకున్నానన్నారు. పర్యాటక రంగంలో ఉన్న ఇబ్బందులు, సవాళ్లను అధిగమించేందుకు కేంద్ర రాష్ట్రప్రభుత్వాలు ఉమ్మడిగా పనిచేస్తాయన్నారు. రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి వట్టి వసంతకుమార్ మాట్లాడతూ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్ధ 1976లో ఏర్పాటైందని చెప్పారు. ఈ రంగంలో వౌలిక సదుపాయాల కల్పన,సర్క్యూట్ అభివృద్ధి, కొత్త ప్రాజెక్టులను నిర్మించడం, పర్యాటక ఆస్తుల యాజమాన్యం తదితర లక్ష్యాలతో పనిచేస్తున్నామన్నారు. ఈ సంస్ధ పరిధిలో రాష్ట్రంలో 44 వసతిసదుపాయాల భవనాలు, 13 కేటరింగ్ యూనిట్లు ఉన్నాయన్నారు.పర్యావరణ పర్యాటక రంగం, సాంస్కృతిక ఉత్సవాలు ఇతర కార్యక్రమాలను భారీ ఎత్తున నిర్వహిస్తున్నామన్నారు. కొత్త ప్యాకేజీలతో ప్రజలను ఆకట్టుకునేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ కార్యక్రమంలో పర్యాటక శాఖ ముఖ్య కార్యదర్శి చందనాఖాన్‌తో పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. (చిత్రం) పర్యాటక భవన్‌లో జరిగిన సమీక్షా సమావేశంలో మాట్లాడుతున్న చిరంజీవి
సమీక్షా సమావేశంలో కేంద్ర మంత్రి చిరంజీవి
english title:
chiranjeevi
Date:
Tuesday, November 27, 2012