మహబూబ్‌నగర్, నవంబర్ 26: తెలంగాణ నగారా సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు, నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే నాగం జనార్దన్‌రెడ్డి మహబూబ్‌నగర్ జిల్లా అచ్చంపేటలో సోమవారం భరోసా యాత్రకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా అచ్చంపేటలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభకు టిజెఎసి చైర్మన్ కోదండరాం, బిజెపి సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ, ప్రజాఫ్రంట్ నాయకులు వేదకుమార్, బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.చారితో పాటు టియంయు రాష్ట్ర కార్యదర్శి అశ్వద్దామరెడ్డి, తెలంగాణ ప్రాంతంలోని వివిధ యూనివర్సిటీల విద్యార్థి జెఎసి నాయకులు, ప్రజాసంఘాల నాయకులు హాజరయ్యారు. సభలో నాగం జనార్దన్‌రెడ్డి మాట్లాడుతూ, ఎత్తిన చెయ్యి దించేది లేదని, తెలంగాణ వచ్చే వరకు ఆగేది లేదని అన్నారు. తెలంగాణ భరోసా యాత్ర అంటే గిరిగీసి బరిలో దిగడమేనని, ఇక తెలంగాణను వ్యతిరేకించేవారితో తాడోపేడో తేల్చుకునేందుకు యుద్ధం ప్రకటిస్తున్నామని, ఈ యుద్ధంలో న్యాయం గెలువకతప్పదని, వెయ్యి మంది తెలంగాణ విద్యార్థుల అమరత్వం విజయాన్ని సాధించనుందని తెలిపారు. వచ్చిన తెలంగాణను కుట్రలతో, రాజీనామాలతో అడ్డుకున్న చంద్రబాబును విడిచిపెట్టేది లేదని, పార్లమెంట్‌లో తెలంగాణ వద్దంటూ సమైక్యాంధ్ర ఉద్యమానికి జైకొడుతూ ప్లకార్డు పట్టిన జగన్ నేతృత్వంలోని వైకాపాను కూడా విడిచిపెట్టబోమని నాగం హెచ్చరించారు. తెలంగాణలో సీమాంధ్ర పార్టీలకు స్థానం లేకుండా చేయడమే లక్ష్యంగా తన ఉద్యమం సాగుతుందని నాగం చెప్పారు.
ఇక మీదట ఏ ఒక్క ప్రాణం పోకుండా కాపాడుకుంటూ ఉద్యమాన్ని కొనసాగిస్తామన్నారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకోని కాంగ్రెస్‌ను బొందపెట్టాలని ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు. కాంగ్రెస్ తెలంగాణ ఇవ్వదని తేలిపోయిందని, బిజెపి నేతృత్వంలో కేంద్రంలో ఎన్‌డిఎ అధికారంలోకి వస్తే తెలంగాణ వస్తుందనే నమ్మకం తెలంగాణ ప్రజలకు వస్తుందని నాగం వ్యాఖ్యానించారు. చంద్రబాబునాయుడు, షర్మిల అధికారం కోసమే పాదయాత్రలు చేపట్టారని, తెలంగాణ ప్రజలపై వారు దండయాత్ర చేస్తున్నారని నాగం మండిపడ్డారు. తెలంగాణ ప్రజలకు వచ్చే నీటిని రాయలసీమలో నిర్మించిన హంద్రీనీవా ప్రాజెక్టుకు తీసుకెళ్ళి సంబరాలు చేసుకుంటున్న రఘువీరారెడ్డి పాదయాత్రకు తెలంగాణ మంత్రులు హాజరవడం సిగ్గుచేటని, ప్రజలు వారి భరతం పట్టాలని నాగం పిలుపునిచ్చారు. అదే విధంగా బహిరంగ సభలో కోదండరాంతో పాటు బిజెపి సీనియర్ నేత దత్తాత్రేయ కూడా తన ప్రసంగాలలో కాంగ్రెస్, వైకాపా, టిడిపిలపై తీవ్ర స్థాయిలో విమర్శించారు. (చిత్రం) బహిరంగ సభలో ప్రసంగిస్తున్న టిఎన్‌ఎస్ అధ్యక్షుడు నాగం
కాంగ్రెస్‌ను బొందపెట్టి తీరుతాం.. ఎన్‌డిఎ వస్తేనే తెలంగాణ : ‘భరోసా యాత్ర’లో నాగం
english title:
nagam
Date:
Tuesday, November 27, 2012