హైదరాబాద్, నవంబర్ 26: ఆ అపార్టుమెంటు వాసులకు ఆ రాత్రి కాళరాత్రి అయ్యింది. సెలవు రోజు పిల్లలతో సరదాగా గడుపుతున్న క్షణాలు ఒక్కసారిగా కారుమబ్బులు కమ్మాయి. ఏం జరిగిందో తెలుసుకునే లోపే మృత్యువు తలుపు తట్టింది. ఫలితంగా ఆరు నిండు ప్రాణాలు పోయాయి. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండల పరిధిలోని పుప్పాలగూడ వద్ద ఆదివారం రాత్రి జరిగిన ఘోర అగ్నిప్రమాదం పది రోజుల చిన్నారి సహా ఆరుగురిని బలిగొంది. ఒక నిర్లక్ష్యం ఆరు ప్రాణాలను మింగేయడం అందరిని విషాదంలో ముంచింది. సీరియల్ షూటింగ్ కోసం ఏర్పాటు చేసిన ఒక షెడ్డులో సంభవించిన మంటలు పెద్దవై పక్కనే ఉన్న బాబా నివాస్ అపార్టుమెంటులోకి వ్యాపించడంతో ఒక్కసారిగా ప్రమాదం చుట్టుముట్టింది. పార్టుమెంట్‌లోని నాలుగు అంతస్తుల్లో ఏడు ఫ్లాట్లలో ఉన్న వారు ఈ ప్రమాదంలో చిక్కుకున్నారు. కొందరు ప్రాణాలతో బయటపడగా, ఆరుగురు మృత్యువాత పడ్డారు. అపార్టుమెంట్‌లో నివసించే మహాలక్ష్మి (84), వెంకటసుబ్బయ్య (59), అపార్టుమెంట్ వాచ్‌మెన్ భాస్కరరావు, శ్రీహరిరావు, ఆయన భార్య అరుణ, వేణుగోపాలరావు అనే వ్యక్తికి ఇటీవలే జన్మించిన ఇద్దరు మగ కవలపిల్లల్లో ఒకరు చనిపోయారు. అపార్టుమెంటులో అగ్నిప్రమాదం జరిగిందని తెలియగానే కాపాడేందుకు వెళ్లిన వాచ్‌మెన్ భాస్కరరావు కరెంటు పోవడంతో లిఫ్పులోనే ఉండిపోయాడు. లిఫ్పు కదలకపోవడంతో మంటలు, పొగ వ్యాపించి ఊపిరాడక చనిపోయాడు. కాపాడబోయి తానే ప్రాణాలు విడిచిన వాచ్‌మెన్ స్వస్థలం తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం. పొరుగూరు నుంచి పొట్ట చేతబట్టుకుని వచ్చిన భాస్కరరావు భార్య, పిలల్లతో ఉంటూ అపార్టుమెంట్‌లో వాచ్‌మెన్‌గా పని చేస్తున్నాడు. మగదిక్కును కోల్పోవడంతో ఆ కుటుంబం తీవ్రంగా రోధిస్తోంది. ఫ్లాట్‌లో నివశించే వేణుగోపాలరావుకు ఇద్దరు కవల పిల్లలు జన్మించారు. బాలింతగా ఉన్న ఆయన భార్య మరో బాలికను, కవలల్లో ఒకరిని తీసుకుని అక్కడ నుంచి బయటపడింది. వీరిని బయటకు తీసుకెళ్లాక మరో కవల పిల్లవాడిని తీసుకెళదామని ప్రయత్నించింది. కానీ అప్పటికే జరగాల్సింది జరిగిపోయి ఒక మగబిడ్డ అగ్నికి ఆహుతైపోయాడు. దీంతో తల్లి ఆవేదన వర్ణనాతీతం. ఈ సంఘటనకు కారణమైన టివి సీరియల్ సెట్టింగ్స్ సామాన్లు ఉంచిన షెడ్డు యజమాని విజయ్‌కుమార్ పరారీలో ఉన్నాడు. ఈ సంఘటనపై 304 ఎ సెక్షన్ కింద కేసు నమోదు చేసినట్లు సైబరాబాద్ కమిషనర్ ద్వారకా తిరుమలరావు చెప్పారు. అగ్నిప్రమాదం ఎలా జరిగిందనే కోణంలో నిపుణులను పిలిపించి విచారణ చేయిస్తున్నారు. సమగ్ర నివేదిక అందిన తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని సిపి తెలిపారు. అపార్టుమెంట్‌లోకి మంటలు వ్యాపించడంతో వంటగదిలో ఉన్న గ్యాస్ సిలిండర్లు పేలడంతో మంటలు మరింతగా వ్యాపించి ఉండవచ్చని భావిస్తున్నట్లు తెలిపారు. అసలు టివి సీరియల్ షూటింగ్ సామాగ్రి ఉన్న షెడ్డులో ప్రమాదం ఏర్పడడానికి ఉన్న కారణాలను అనే్వషిస్తున్నట్లు చెప్పారు. నిపుణుల పరిశీల తర్వాత నివేదిక ఉన్నతాధికారులకు సమర్పిస్తామని చెప్పారు.
ఈ దుర్ఘటనపై ముఖ్యమంత్రి ఎన్.కిరణ్‌కుమార్‌రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తమ ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఈ సంఘటనపై సమగ్ర నివేదిక ఇవ్వాలని అగ్నిమాపక శాఖ డిజిని సిఎం ఆదేశించారు. ప్రమాదానికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కూడా సిఎం ఆదేశించారు.
అగ్ని కీలల రూపంలో తలుపుతట్టిన మృత్యువు.. సిఎం దిగ్భ్రాంతి.. సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశం
english title:
black night
Date:
Tuesday, November 27, 2012