హైదరాబాద్, నవంబర్ 26: భవిష్యత్తులో సమాజ అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని సాంప్రదాయేతర ఇంధన వనరులపై దృష్టి కేంద్రీకరించాల్సి ఉందని శాసనసభ సభాపతి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. జూబ్లీ హాలులో సోమవారం ఏర్పాటు చేసిన భారత పారిశ్రామిక, వాణిజ్య అభివృద్ధి మండలి 36 వ వార్షిక సదస్సులో మాట్లాడుతూ, పారిశ్రామికంగా ఆంధ్రప్రదేశ్ గణనీయమైన ప్రగతి సాధిస్తోందన్నారు. సాంప్రదాయ ఇంధన వనరులు తగ్గిపోతున్నందు వల్ల సాంప్రదాయేతర ఇంధన వనరులపై దృష్టి కేంద్రీకరించాల్సి ఉందన్నారు. మన రాష్ట్రంలో విద్యుత్తు ఉత్పత్తికి-వినియోగానికి తేడా ఉంటోందన్నారు. దీన్ని భర్తీ చేయడం కష్టమని, అందువల్ల సాంప్రదాయేతర ఇంధనవనరులను వినియోగించాల్సి ఉందన్నారు. అభివృద్ధి చెందుతున్న దేశాలతో పాటు, అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా గాలి, సౌరశక్తి తదితర సాంప్రదాయేత ఇంధన వనరులను పూర్తిస్థాయిలో వినియోగించుకుంటున్నారన్నారు. మన రాష్ట్రంలో సైతం ఈ దిశలో ప్రభుత్వం-ప్రైవేట్ రంగం కలిసి ముందుకు వెళ్లాల్సి ఉందన్నారు.
అసెంబ్లీ స్పీకర్ మనోహర్ పిలుపు
english title:
renewable energy sources
Date:
Tuesday, November 27, 2012