హైదరాబాద్, నవంబర్ 26: వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని తెలంగాణ సాధన కోసం అనుసరించాల్సిన వ్యూహంపై టిఆర్‌ఎస్‌లో చర్చ సాగుతోంది. ఒకవైపు వైఎస్‌ఆర్ దూకుడును అడ్డుకోవడంతో పాటు మరోవైపు టిడిపి తిరిగి లేవకుండా చావు దెబ్బతీయాలనే వ్యూహంతో టిఆర్‌ఎస్ ముందుకు వెళుతుందని ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు. ఈ నెల 30న టిఆర్‌ఎస్ కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించి, భవిష్యత్తు ఉద్యమానికి సంబంధించి వ్యూహ రచన చేస్తారు. తెలంగాణలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్, టిడిపిలను రాజకీయంగా కోలుకోని విధంగా ఎదుర్కోవాలని టిఆర్‌ఎస్ నాయకులు చెబుతున్నారు. తెలంగాణలో మిగిలిన రాజకీయ పక్షాల కన్నా టిడిపికి కార్యకర్తల బలం ఎక్కువగా ఉంది, అయితే కేవలం కార్యకర్తల బలం వల్ల ఒక పార్టీ విజయం సాధించలేదని 2004 నుంచి ఇప్పటి వరకు పలు సందర్భాల్లో తెలంగాణలో టిడిపికి తెలిసి వచ్చిందని టిఆర్‌ఎస్ నాయకులు చెబుతున్నారు. సీమాంధ్రలో కాంగ్రెస్, టిడిపి శ్రేణులు వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌లో చేరుతున్నారు. తెలంగాణలో ఇదే పరిస్థితి వస్తే టిఆర్‌ఎస్ ఇబ్బంది పడాల్సి వస్తుందని, అలా జరగకుండా చూడాలని టిఆర్‌ఎస్ నాయకలు చెబుతున్నారు. బాన్సువాడ ఉప ఎన్నికల్లో టిడిపి పోటీ చేయకపోయినా ఆ ఓట్లు కాంగ్రెస్‌కు పడ్డాయి. టిడిపి, కాంగ్రెస్‌లు గెలిచే అవకాశం లేదని భావించినప్పుడు ఇద్దరిలో ఎవరు బలంగా ఉంటే అటువైపు మరో పార్టీ ఓట్లు వెలితే టిఆర్‌ఎస్ నష్టపోవలసి వస్తుందని అలా జరగకుండా చూడాలని టిఆర్‌ఎస్ నాయకులు భావిస్తున్నారు. దీని కోసం ఒకవైపు టిడిపిని పూర్తిగా నిర్వీర్యం చేయడం అదే సమయంలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ వైపు తెలంగాణలో నాయకులు ఆసక్తి చూపకుండా చేయడం అవసరం అని చెబుతున్నారు. తెలంగాణలో బలమైన సామాజిక వర్గం వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పట్ల ఆసక్తి చూపుతోందని, సాధారణంగా తెలంగాణలో కులం కన్నా తెలంగాణ వాదం బలంగా పని చేస్తుందని, ఇదే ఆనవాయితీ ఈ ఎన్నికల్లో సైతం కనిపించేట్టు చేయాలనేదే మా వ్యూహం అని టిఆర్‌ఎస్ నాయకులు చెబుతున్నారు. సూర్యపేట బహిరంగ సభను విజయవంతం చేయడం ద్వారా ఆ సామాజిక వర్గం వారిని సైతం ఆలోచనలో పడేసినట్టు పార్టీ వర్గాలు తెలిపారు. తెలంగాణ ఉద్యమ ప్రభావం లేకుండా సాధారణ పరిస్థితిలో అయితే సీమాంధ్రతో పాటు తెలంగాణలో సైతం వైఎస్‌ఆర్ కాంగ్రెస్ గాలి వీచేదని కానీ తెలంగాణ అంశం వల్ల వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పట్ల ఆసక్తి చూపుతున్న సామాజిక వర్గం సైతం ఆలోచనలో పడిందని టిడిపి నాయకులు తెలిపారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ తెలంగాణపై ఎలాంటి ప్రకటన చేయనప్పుడు తెలంగాణ వాదులమని చెప్పుకున్న కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు ఏం చెప్పి ఆ పార్టీలోకి వెళతారని టిఆర్‌ఎస్ నాయకులు ప్రశ్నిస్తున్నారు. కేంద్రంలో ముందస్తు ఎన్నికలకు అవకాశం ఉందని, అదే విధంగా రాష్ట్రంలో ప్రభుత్వం ఎప్పుడు పడిపోతుందో తెలియని పరిస్థితిలో తెలంగాణ సాధన కోసం వ్యూహాత్మకంగా వ్యవహరించాలని టిఆర్‌ఎస్ భావిస్తోంది. అసెంబ్లీ సమావేశాల్లో ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళికకు మద్దతు ఇవ్వాలని అదే సమయంలో తెలంగాణ వాదం వినిపించాలని టిఆర్‌ఎస్ నాయకత్వం భావిస్తోంది.
అసెంబ్లీ సమావేశాలను దృష్టిలో పెట్టుకొని ఈ నెల 30న టిఆర్‌ఎస్ కార్యవర్గ సమావేశం నిర్వహిస్తారు. ముందుగా అనుకున్న దాని ప్రకారం మంగళవారం ఈ సమావేశం జరగాల్సి ఉండేది. అదే విధంగా గతంలో 30వ తేదీ నుంచి నిర్వహించాలని అనుకున్న పల్లెబాటను డిసెంబర్ 5వ తేదీ నుంచి నిర్వహించాలని నిర్ణయించారు.
తెరాస వ్యూహ రచన.. 30న కార్యవర్గం
english title:
ysrcp, tdp
Date:
Tuesday, November 27, 2012