నల్లగొండ, నవంబర్ 27: ప్రజల ఆహార భద్రత లక్ష్య సాధనకు రాష్ట్ర ప్రభుత్వం వికేంద్రీకరణ విధానం ద్వారా ధాన్యం..బియ్యం సేకరణ కార్యక్రమాన్ని ఏడు జిల్లాల్లో ప్రయోగాత్మకంగా చేపట్టామ రాష్ట్ర పౌరసరఫరాల శాఖ డిఎం వరప్రసాద్ తెలిపారు. మంగళవారం నల్లగొండ జిల్లాలో వికేంద్రీకరణ విధానం పురోగతిని అధికారులు, మిల్లర్లతో కలిసి సమీక్షించారు. వికేంద్రీకరణ ద్వారా ఎఫ్‌సిఐ ప్రమేయం లేకుండా రైతు నుండి నేరుగా సన్నరకం ధాన్యాన్ని, అలాగే బియ్యాన్ని కూడా నేరుగా మిల్లర్ల నుండి సివిల్ సప్లయ్ శాఖనే కొనుగోలు చేసి పిడిఎస్ అవసరాలకు సరఫరా చేస్తుందన్నారు. ఈ విధానంతో స్థానికంగా లభించే నాణ్యమైన ధాన్యంతో సేకరించిన నాణ్యమైన బియ్యాన్ని రేషన్ దుకాణాల ద్వారా పేదలకు సరఫరా చేయడంతో పాటు బహిరంగ మార్కెట్‌లో సైతం అమ్మకాలు సాగించడంతో సన్నరకం బియ్యం ధరలకు కళ్లెం వేయడం..సన్న రకాలు పండించే రైతులకు తగిన మద్ధతు ధరను అందించడం ప్రభుత్వ లక్ష్యమన్నారు. రాష్ట్రంలో ఈ ఖరీఫ్‌లో 13.71 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం, 15లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని సేకరించాలని లక్ష్యంగా పెట్టుకుని ముందుకు సాగుతున్నామన్నారు. నల్లగొండ, వరంగల్, కరీంనగర్, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో వికేంద్రీకరణ పాలసీని అనుసరించి పచ్చి బియ్యాన్ని సివిల్ సప్లయ్, ఉప్పుడు బియ్యాన్ని ఎఫ్‌సిఐ సేకరిస్తుందన్నారు. ఎఫ్‌సిఐ, సిడబ్ల్యుసి, మార్కెటింగ్ శాఖల గిడ్డంగులను అద్దే తీసుకోవడం ద్వారా 6 లక్షల మెట్రిక్ టన్నుల నిల్వకు ఏర్పాట్లు చేశామని, అదనంగా మార్కెటింగ్ శాఖ ద్వారా 500 కోట్లతో కొత్తగా 439 మండలాల్లో గోదాంల నిర్మాణాలకు చర్యలు చేపట్టడంతో 11.37 లక్షల టన్నుల గిడ్డంగుల వసతికి చర్యలు చేపట్టామన్నారు. నాణ్యమైన ధాన్యం, బియ్యం సేకరణకు జిల్లా కేంద్రాల్లో క్వాలిటీ కంట్రోల్ విభాగాన్ని ఏర్పాటు చేస్తున్నామని ఇవి కలెక్టర్ పర్యవేక్షణలో కొనసాగుతాయన్నారు. కలెక్టర్ అనుమతించిన నాణ్యమైన బియ్యాన్ని పిడిఎస్ ద్వారా సరఫరా చేస్తామన్నారు. క్వాలిటీ కంట్రోల్ సిబ్బంది నియామకంలో భాగంగా ఏడు జిల్లాల్లో 131 మంది టెక్నికల్, అకౌంటింగ్ సిబ్బందిని నియమించడంతో పాటు ఎఫ్‌సిఐ నుండి కొందరిని డిప్యుటేషన్‌పై తీసుకున్నామన్నారు.
సివిల్ సప్లయస్ డిఎం
english title:
a
Date:
Wednesday, November 28, 2012