ఒంగోలు , నవంబర్ 27: సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వంపై దండయాత్ర చేయాల్సిన సమయం ఆసన్నమైందని జిల్లా జెఎసి ప్రతినిధులు పిలుపునిచ్చారు. ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల సంయుక్త కార్యాచరణ సమితి జిల్లాశాఖ ఆధ్వర్యంలో స్థానిక కలెక్టరేట్ వద్ద మంగళవారం రిలే నిరాహార దీక్షలు జరిగాయి. ఈ సందర్భంగా జిల్లా జెఎసి చైర్మన్ షేక్ అబ్దుల్ బషీర్ మాట్లాడుతూ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోందని మండిపడ్డారు. ప్రభుత్వంలో ప్రధానపాత్ర పోషిస్తున్న ఉద్యోగుల సమస్యలను పరిష్కరించలేని ప్రభుత్వం సామాన్య ప్రజల సమస్యలు ఎలా పరిష్కరిస్తుందని సూటిగా ప్రశ్నించారు. తమ సమస్యలు పరిష్కారం అయ్యేంతవరకు ప్రభుత్వంపై ఉద్యమాలు చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు వేతన సవరణ అమలు పరిచేందుకు పదవ వేతన సవరణ సంఘాన్ని వెంటనే నియమించాలన్నారు. ఉద్యోగులకు హెల్త్‌కార్డులు మంజూరు చేయాలని, కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించాలన్నారు. అవుట్ సోర్సింగ్ విధానాన్ని రద్దుచేసి ప్రస్తుతం పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని, జిఓ నెంబర్ 177, 152ను తక్షణమే రద్దు చేయాలన్నారు. ప్రభుత్వ శాఖల్లో, ప్రభుత్వరంగ సంస్థల్లో ఖాళీలను యుద్ధప్రాతిపదికన భర్తీ చేయాలన్నారు. నగర కార్పొరేషన్‌కు 20 శాతం ఇంటి అద్దెలు చెల్లించాలని, పంచాయతీలలో 14.5 శాతం చెల్లించాలన్నారు. జిల్లా జెఎసి కార్యదర్శి బండి శ్రీనివాసరావు మాట్లాడుతూ ఉద్యోగులకు రావాల్సిన రాయితీలు కల్పించడంలో ప్రభుత్వం అలసత్వం వహిస్తోందన్నారు. డిమాండ్ల సాధనకోసం ఐక్య ఉద్యమాలే శరణ్యం అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. రాజకీయ నాయకులు జీతాలు పెంచుకొనేందుకు మాత్రం ఐకమత్యంతో ముందుకు వెళుతున్నారన్నారు. జెఎసి కోశాధికారి పి రాజ్యలక్ష్మి మాట్లాడుతూ 10వ వేతన సవరణ సంఘాన్ని, ఉద్యోగులు హెల్త్‌కార్డులు సాధించుకొనేందుకు ఉద్యమాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. జరగనున్న భవిష్యత్ ఉద్యమ కార్యక్రమాలను జయప్రదం చేసేందుకు జిల్లా ఉద్యోగులు సిద్ధంగా ఉండాలన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల చర్యలు చూస్తుంటే కార్మికుల కోపాగ్నికి కొట్టుకుకొనిపోయే రోజులు దగ్గర్లోనే ఉన్నాయన్నారు. ప్రభుత్వం మహిళా ఉద్యోగులకు ప్రత్యేక సెలవులు మంజూరు చేసేందుకు అలసత్వం ప్రదర్శిస్తోందని మండి పడ్డారు. సమస్యలు పరిష్కారం అయ్యేంతవరకు ప్రభుత్వంపై దండయాత్ర తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా నలుమూలల నుండి వచ్చిన వివిధ శాఖల ఉద్యోగులు పాల్గొన్నారు.
కలెక్టరేట్ వద్ద రిలే నిరాహార దీక్షలు
english title:
jac
Date:
Wednesday, November 28, 2012