అనంతపురం, నవంబర్ 27 : హంద్రీనీవా సుజల స్రవంతి ప్రాజెక్టు పూర్తి కావడంతో రాయలసీమ జిల్లాలు సస్యశ్యామలమవుతాయని కేంద్ర పర్యాటక శాఖా మంత్రి చిరంజీవి అన్నారు. అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గం, వజ్రకరూరు మండలంలోని రాగులపాడు వద్ద మంగళవారం హంద్రీనీవా ఎత్తిపోతల పథకం ఎనిమిదవ లిఫ్ట్‌ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హంద్రీనీవా ఎనిమిదవ లిఫ్ట్‌ను తాను ప్రారంభించడం అదృష్టంగా భావిస్తున్నారు. హంద్రీనీవా ప్రాజెక్టు ప్రారంభం చారిత్రక ఘట్టమని అభివర్ణించారు. సీమ జిల్లాల ప్రజల బలమైన ఆకాంక్షతోనే ఇది నెరవేరిందన్నారు. 15 నుంచి 20 సంవత్సరాల్లో అనంతపురం జిల్లా ఎడారిగా మారిపోతుందన్న వార్తలు వినిపించాయని, హంద్రీనీవా ఆ పోహలు, ప్రచారాలకు తెరదించుతుందని అన్నారు.
కాంగ్రెస్ పార్టీ కన్నా ముందు అధికారంలో ఉన్న పార్టీలు కేవలం శంకుస్థాపనలు, శిలాఫలకాలు, పత్రికా ప్రకటనలకే పరిమితమయ్యాయన్నారు. కాంగ్రెస్ పార్టీ హయాంలోనే ఇది పూర్తయ్యిందన్నాయి. అసలైన అభివృద్ధికి ఇది నిదర్శనమన్నారు. ప్రాణహిత-చేవెళ్ల, పోలవరం ప్రాజెక్టులు పూర్తయితే రాష్ట్రం మరింత అభివృద్ధి పథంలో పయనిస్తుందన్నారు. ఇందుకుగానూ తమ వంతు కృషి చేస్తామని తెలిపారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు పాదయాత్ర పేరుతోప్రజలను మభ్య పెట్టడానికి యత్నిస్తున్నారని ఆరోపించారు. ఆయన రైతుల పట్ల నిరంకుశంగా వ్యవహరించిన విషయం చిరకాలం గుర్తుండి పోతుందన్నారు. ఆయన హయాంలో రైతులు పెద్ద ఎత్తున ఆత్మహత్యలు చేసుకోగా కనీసం వారి కుటుంబాలకైనా ఏ మాత్రం సహాయం అందించలేదన్నారు. పైగా నష్టపరిహారం కోసం ఆత్మహత్యలు చేసుకుంటారని రైతు కుంబాలను హేళన చేసిన ఘనత చంద్రబాబుకు దక్కిందన్నారు. రైతు సంక్షేమం పట్ల కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందన్నారు. వడ్డీ లేని రుణాలు, కౌలు రైతులకు రుణ అర్హత కార్డులను ఇచ్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనన్నారు. ఇక మరోపార్టీ కూడా యాత్రల పేరుతోరోడ్డున పడిందని పరోక్షంగా వైకాపాను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఆ పార్టీ నేతల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదన్నారు. ఆ పార్టీ చెట్టుపేరు చెప్పి కాయలు అమ్ముకుంటోందని ఆరోపించారు. జిల్లాలోని ఉరవకొండ నియోజకవర్గం పెన్నఅహోబిళం దేవాలయాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తామన్నారు.
* కేంద్రమంత్రి చిరంజీవి ధ్వజం
english title:
r
Date:
Wednesday, November 28, 2012