మహబూబ్‌నగర్, నవంబర్ 27: ఓబులాపురం, బయ్యారం గనుల్లో ఒక్క రూపాయి పెట్టుబడులు లేవని, దాన్ని నిరూపిస్తామని వైకాపా నాయకురాలు షర్మిల సవాల్ చేశారు. మరో ప్రజాప్రస్థానం పాదయాత్రలో భాగంగా మంగళవారం మహబూబ్‌నగర్ జిల్లా గద్వాలలో షర్మిల పాదయాత్ర కొనసాగింది. గద్వాల పట్టణంలో నిర్వహించిన సభకు వేలాది మంది జనం తరలివచ్చారు. సభలో షర్మిల ఆవేశపూరితమైన ప్రసంగం చేశారు. ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో పాదయాత్ర కొనసాగిస్తుండగా మొట్టమొదటిసారిగా కెసిఆర్‌పై షర్మిల ఘాటైన వ్యాఖ్యలు చేస్తూ విమర్శనాస్త్రాలు గుప్పించారు. తెలంగాణ ప్రాంతమంటే వైఎస్‌కు గానీ, వారి కుటుంబానికి గానీ అభిమానం లేదని, ప్రేమ లేదని కెసిఆర్ చెప్పడం అబద్ధమన్నారు. ముఖ్యంగా ఓబులాపురంలో జగన్‌కు, బయ్యారంలో షర్మిలకు వాటాలు, పెట్టుబడులు ఉన్నాయని కెసిఆర్ చేస్తున్న ప్రచారం పచ్చి అబద్ధమని షర్మిల స్పష్టం చేశారు. ఈ గనులతో తనకేం సంబంధమని ఎన్నిసార్లు చెప్పినా పదేపదే తమపై కెసిఆర్ ఎందుకు అభాండాలు వేస్తున్నారని ఆమె ప్రశ్నించారు. ‘ నీకో బిడ్డ ఉంది.. ఓ సారి ఆలోచించాలని, అభాండాలు వేయడం మానుకోవాలి‘ అనిని ఆమె కెసిఆర్‌కు హితవు పలికారు. ‘ మీ బిడ్డ మీద అభాండాలు వేస్తే నీవు ఊరుకుంటావా? అంటూ’ కెసిఆర్‌ను ఆమె ప్రశ్నించారు. ప్రాంతీయ విభేదాలు తెచ్చే వారికి ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని ఆమె ప్రజలకు పిలుపునిచ్చారు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డికి తెలంగాణ ప్రాంతంపైన అభిమానం, ప్రేమ ఉన్నందుకే ఏ పథకమైనా ఈ ప్రాంతం నుంచే ప్రారంభించారని షర్మిల గుర్తు చేశారు. దేశంలో అతిపెద్ద ఎత్తిపోతల పథకం ప్రాణహిత, చేవెళ్లనేనని, ఏడు జిల్లాలకు 16లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలనే కలతో ఈ పతకానికి వైఎస్ శ్రీకారం చుట్టారని తెలిపారు. వైఎస్ హయాంలో రూ.25 వేల కోట్లు ప్రాజెక్టుల కోసం ఖర్చు పెట్టారని, ప్రస్తుత ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి కేవలం రూ.7వేల కోట్లు మాత్రమే ఖర్చు పెట్టి వైఎస్ కలలు కన్న జలయజ్ఞానికి తూట్లు పొడిచారని ఆరోపించారు. చంద్రబాబు ప్రాజెక్టులపై కేవలం రూ.700 కోట్లు ఖర్చు పెట్టి చేతులు దులుపుకున్నారని ఎద్దేవా చేశారు. గద్వాల బహిరంగ సభలో మాజీ మంత్రి కొండా సురేఖ సైతం కెసిఆర్, టిజెఎసి చైర్మన్ కోదండరాంలపై కూడ విమర్శనాస్త్రాలు గుప్పించారు. ఈ యాత్రలో లక్ష్మిపార్వతి పాల్గొన్నారు.
మరో ప్రజాప్రస్థానంలో షర్మిల
english title:
c
Date:
Wednesday, November 28, 2012