కావలసినవి
అన్నం .......................................................................... 2 కప్పులు
గుడ్లు ........................................................................... 2
చికెన్ కీమా .................................................................. 1/4 కప్పు
ఉల్లిపాయ .................................................................... 1
బీన్స్ తరుగు ................................................................ 2 టీస్పూన్లు
క్యారట్ తరుగు .............................................................. 2 టీస్పూన్లు
అజినొమొటొ ............................................................... చిటికెడు
షెజ్వాన్ మసాలా పొడి ............................................... 1 టీస్పూన్
మిరియాల పొడి .......................................................... 1/4 టీస్పూన్
ఉప్పు ........................................................................... తగినంత
నూనె ............................................................................ 3 టీస్పూన్లు
ఇలా చేద్దాం
ముందుగా అన్నం పొడిపొడిగా ఉండేలా వండి చల్లార్చుకోవాలి. దానిని రెండు భాగాలుగా చేసుకోవాలి. చికెన్ ముక్కలు ఉడికించి చిన్నగా ముక్కలు చేసుకోవాలి. ఉల్లిపాయ, బీన్స్, కారట్ చిన్నచిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. పాన్‌లో చెంచాడు నూనె వేడి చేసి గుడ్లు కొట్టివేసి వెంటనే పొడిపొడిగా అయ్యేలా గరిటతో కలపాలి. గుడ్డు పొరుటు కొద్దిగా వేగిన తర్వాత సగం ఉల్లిపాయ ముక్కలు, బీన్స్, కారట్ ముక్కలు వేసి మరో రెండు నిమిషాలు వేయించాలి.
ఇందులో అజినొమొటొ వేసి కలిపి సగం అన్నం వేయాలి. ఇందులో తగినంత ఉప్పు, సగం మిరియాల పొడి వేసి కలుపుతూ కొద్దిసేపు వేపి దింపేయాలి. మరో పాన్‌లో చెంచాడు నూనె వేడిచేసి మిగిలిన ఉల్లిపాయ, బీన్స్, కారట్ ముక్కలువేసి కొద్దిగావేపి చికెన్ కీమా వేయాలి.
ఇందులో షెజ్వాన్ మసాలాపొడి వేసి కలిపి మరో రెండు నిమిషాలు వేపాలి. తర్వాత అన్నం వేసి బాగా కలియబెట్టి కొద్దిసేపు వేపి దింపేయాలి. ఒక గినె్నలో కొద్దిగా ఉప్పు, మిరియాల పొడి, చెంచాడు నీళ్లుపోసి కలిపి గుడ్లు కొట్టివేసి గిలక్కొట్టాలి.
పెనం వేడిచేసి కొద్దిగా నూనె వేసి ఆమ్లెట్ వేసుకుని రెండువైపులా కాల్చుకోవాలి. ఒక ప్లేట్‌లో ఒక వరుస ఎగ్‌ఫ్రైడ్ రైస్ పెట్టి దానిపైన ఆమ్లెట్ వేసి దానిపైన చికెన్ రైస్ వేయాలి. లేదా అన్నం పక్కపక్కన పెట్టి ఆమ్లెట్ పైన వేసి మంచూరియా కర్రీతో సర్వ్ చేయాలి.