హైదరాబాద్, డిసెంబర్ 3: జలయజ్ఞం నిర్మాణాల్లో జాప్యాన్ని, నిర్లక్ష్యాన్ని సహించబోమని భారీ నీటిపారుదల శాఖ మంత్రి సుదర్శన్‌రెడ్డి, అటవీశాఖ మంత్రి శత్రుచర్ల విజయ రామరాజు స్పష్టం చేశారు. నీటి పథకాలకు అటవీ, పర్యావరణ అనుమతుల రాకలో జరుగుతున్న జాప్యం, తీసుకోవాల్సిన చర్యలపై వారు సీనియర్ అధికారులతో సోమవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారుల వైఖరిపై ఘాటుగా స్పందించారు. పనుల నిర్వహణలో నిర్లక్ష్యాన్ని వహిస్తున్న కాంటాక్టర్లను గుర్తించి వారికి చెల్లించే బిల్లులను నిలిపివేయాలని మంత్రి సుదర్శన్‌రెడ్డి ఆదేశించారు. వారిపై నిబంధనల మేరకు చర్యలు తీసుకోవాలని కూడా స్పష్టం చేశారు. అధికారుల పాత్రపైనా తీవ్రంగా స్పందించారు. పనుల పర్యవేక్షణలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ, అటువంటి అధికారులపై కూడా చర్యలు తప్పవని స్పష్టం చేశారు. జలయజ్ఞం ప్రాజెక్టులు, కాలువల నిర్మాణానికి అవసరమైన అటవీ భూములకు అనుమతులు సాధించేందుకు అవసరమైన కార్యాచరణ ప్రణాళికను పదిహేను రోజుల్లో సిద్ధం చేయాలని ఆదేశించారు. ప్రాజెక్టులకు మధ్యలో ఉన్న అటవీ భూములకు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల నుంచి అనుమతులు రావడంలో నెలకొన్న జాప్యం కారణంగా పనులు నెమ్మదిగా నడుస్తున్నాయని, అందుకే రెండు శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి త్వరగా అనుమతులు లభించేలా చూడాలన్నారు. ఆంధ్ర ప్రాంతంలోని ప్రాజెక్టులకు 15,484 ఎకరాల అటవీ భూమి, నెల్లూరు, ప్రకాశం, సీమ జిల్లాల్లో ప్రాజెక్టులల్లో 22,170 ఎకరాల అటవీ భూమి, తెలంగాణ ప్రాంతంలోని ప్రాజెక్టులకు 17,222 ఎకరాల అటవీ భూమి సేకరించాల్సి ఉందని ఈ సందర్భంగా అధికారులు వెల్లడించారు. దీనికోసం నష్టపరిహారంగా రూ.1,005 కోట్లను అటవీశాఖ వద్ద డిపాజిట్ చేయడం జరిగిందని వారు చెప్పారు. కాగా, రోడ్లు భవనాలశాఖ అధికారులతో కూడా మంత్రులు సమీక్షించారు. ప్రాజెక్టులు, కాలువల నిర్మాణ ప్రాంతంలో 78చోట్ల జాతీయ రహదారులపై క్రాసింగ్‌లు ఉన్నాయని, ఇందులో 30 క్రాసింగ్‌లకు అనుమతి లభించగా, 46 క్రాసింగ్‌లకు అనుమతులు రావాల్సి ఉందని అధికారులు వెల్లడించారు. ఈ ప్రాంతంలో వంతెనలు నిర్మించేందుకు ఆర్‌అండ్‌బి వద్ద రూ.83 కోట్లను డిపాజిట్ చేశామని, ఇక రాష్ట్ర రహదారులపై కూడా 180 చోట్ల కాలువలపై క్రాసింగ్‌లు నిర్మించాల్సి ఉందని అధికారులు చెప్పారు. ఈ అంశంపై ఆయా శాఖలు సమన్వయంతో పనిచేసి యుద్ధ ప్రాతిపదికన అనుమతులు సాధించాలని మంత్రి ఆదేశించారు. ప్రభుత్వ లక్ష్యాన్ని, అభిమతాన్ని గుర్తించి పనులు వేగవంతం చేసేందుకు అధికారులు ప్రయత్నించాలని హితవు పలికారు. ఈ సమావేశంలో నీటిపారుదలశాఖ ముఖ్య కార్యదర్శులు ఎస్‌కె జోషి, ఆదిత్యనాధ్ దాస్, అరవిందరెడ్డి, అటవీశాఖ పిసిసిఎఫ్ ఎస్‌వి కుమార్, ఆర్‌అండ్ ఇఎన్‌సి శివారెడ్డి, ఇతర సీనియర్ అధికారులు పాల్గొన్నారు.
రబీ గట్టెక్కేదెలా?