హైదరాబాద్, డిసెంబర్ 3: రబీ సీజన్‌లో వేసిన పంటలకు విద్యుత్ కొరత లేకుండా చూడడానికి ప్రభుత్వం మల్లాగుల్లాలు పడుతోంది. ఈ అంశాన్ని పరిశీలించాలని ముఖ్యమంత్రి ఐదుగురు మంత్రులకు అప్పజెప్పారు. సోమవారం సచివాలయంలో మంత్రులు విద్యుత్ కొరతపై భేటీ అయ్యారు. అయితే చర్చలు అసంపూర్తిగా ముగిశాయి. ఈ నెల 5న మరోసారి సమావేశం కావాలని మంత్రులు నిర్ణయించారు. ఇప్పుడే విద్యుత్ కొరత ఎక్కువ ఉంటే వేసవిలో ఇక విద్యుత్ సమస్య గురించి చెప్పడం వీలుకాదని మంత్రులు ఆందోళన వ్యక్తం చేశారు.
శీతాకాల అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిపక్షాలు విద్యుత్ కొరతపై చర్చించేందుకు పట్టుబడతాయన్న ముందస్తు సమాచారంతో విద్యుత్ సరఫరా మెరుగు పరచడానికి వాస్తవ స్థితిగతులను పరిశీలించాలని విద్యుత్ అధికారులను మంత్రులు ఆదేశించారు. ఈ అంశాలపైన విస్తృతంగా మంత్రులు, సీనియర్ ఐఎఎస్ అధికారులతో ప్రభుత్వం చర్చిస్తోంది. ఈ నెల 10 నుంచి 20 వరకు అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయనే అనధికార సమాచారంతో ప్రభుత్వం విద్యుత్‌పై సమీక్ష జరిపింది. చలికాలంలో కూడా విద్యుత్ డిమాండ్ తగ్గడంలేదని మంత్రులు అభిప్రాయపడ్డారు. రబీలో రైతులకు ఎలా నచ్చచెప్పాలని మంత్రులు తర్జనభర్జన పడ్డారు. ప్రస్తుత రబీ సీజన్‌లో వేసిన పంటలు ఎండిపోకుండా చూస్తూనే వ్యవసాయేతర రంగాలకు కూడా విద్యుత్‌ను ఏమేరకు సరఫరా చేస్తామో వివరాలను తమ ముందుంచాలని మంత్రులు విద్యుత్ శాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు. ఈ సమావేశానికి మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, ఉత్తమ్‌కుమార్ రెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, రఘువీరారెడ్డి హజరయ్యారు. ప్రస్తుతం రోజుకు 70 మిలియన్ల యూనిట్ల విద్యుత్ లోటు ఉందని, దీన్ని నివారించడానికి నెలకు 800 కోట్లతో విద్యుత్‌ను కొనుగోలు చేస్తే సమస్యను కొంత వరకు తీర్చవచ్చునని అధికారులు మంత్రులకు వివరించారు. నిధులిస్తే విద్యుత్ కొరత తీరుస్తామని చెప్పడం బాధ్యతారాహిత్యమని మంత్రులు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యుత్ సమస్యకు ప్రధాన కారణాలను చెప్పకుండా సమావేశాలు ఏర్పాటు చేసుకోవడం దేనికని మంత్రులు ప్రశ్నించారు. విద్యుత్ సరఫరాను మెరుగుపరచడానికి చేపట్టాల్సిన ప్రత్యామ్నాయ మార్గాలను సూచించాలని, ఏ విధానం బాగుందో గుర్తించి ప్రభుత్వానికి సిఫార్సు చేస్తామని మంత్రులు సూచించారు.
వైస్ పాలనపై విచారణకు పిటిషన్ వేయాలి విజయమ్మకు టిడిపి డిమాండ్
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, డిసెంబర్ 3: వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఐదేళ్ల పాలనపై సుప్రీంకోర్టు సిట్టింగ్ న్యాయమూర్తితో విచారణ జరిపించాలని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ పిటిషన్ వేయాలని టిడిపి ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ డిమాండ్ చేశారు. ఐదేళ్ల పాలనపై సిట్టింగ్ న్యాయమూర్తితో విచారణ జరిపించాలని స్వయంగా విజయమ్మనే శాసన సభలో డిమాండ్ చేశారని, మడమ తిప్పని వాళ్లం.. మాట తప్పని వాళ్లమని చెప్పుకునే విజయమ్మ ఆ మాటకు కట్టుబడి ఉండాలని డిమాండ్ చేశారు. సిట్టింగ్ న్యాయమూర్తితో విచారణ జరిపితే, సిబిఐ విచారణలో సైతం వెల్లడి కాని అనేక వ్యవహారాలు సిట్టింగ్ న్యాయమూర్తి విచారణ జరిపితే బయట పడతాయని అన్నారు.
వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక డ్రామా కంపెనీగా మారిందని ఎవరేం మాట్లాడుతున్నారో వారికే అర్థం కాకుండా ఉందని టిడిపి నేత మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి యద్దేవా చేశారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి ముగ్గురు అధ్యక్షులు ఉన్నారని అన్నారు. ఒక అధ్యక్షుడు జైలులో ఉంటే, మరో అధ్యక్షురాలు ఇంట్లో ఉన్నారని, ఒక అధ్యక్షురాలు పాదయాత్ర చేస్తున్నారని అన్నారు. వీరు ముగ్గురు ఇతర పార్టీల నాయకులకు హామీలు ఇచ్చేస్తున్నారని, ఎవరి హామీలు నమ్మాలని, ఆ పార్టీ ఎవరి నాయకత్వంలో నడుస్తోందని ప్రశ్నించారు. డ్రామా కంపెనీ మాదిరిగా ఎవరిష్టం వచ్చిన పాత్రలు వారు పోషిస్తున్నారని ఎద్దెవా చేశారు.
టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు పాదయాత్ర వెయ్యి కిలో మీటర్లు పూర్తయిన సందర్భంగా ఎన్టీఆర్ భవన్‌లో సంబరాలు జరిపారు. పార్టీ కార్యాలయాన్ని అలంకరించి ముగ్గులు వేసి మహిళా నాయకులు సంబరాలు జరిపారు. కె.ఇ. కృష్ణమూర్తి కేక్ కట్ చేశారు.
వెయ్యి అంకెను ముగ్గు వేశారు. రాష్ట్ర వ్యాప్తంగా నియోజక వర్గాల్లో ఇదే విధంగా సంబరాలు జరిపినట్టు పార్టీ నాయకులు తెలిపారు. ఎన్టీఆర్ భవన్‌లో జరిగిన సంబరాల్లో పార్టీ నాయకులు చంద్రమోహన్ రెడ్డి, కంభంపాటి రామ్మోహన్‌రావు తదితరులు పాల్గొన్నారు.