హైదరాబాద్, డిసెంబర్ 3: విద్యుత్ ఇంధన సర్దుబాటు చార్జీలపై ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపిఇఆర్‌సి) సోమవారం నిర్వహించిన బహిరంగ విచారణ రసాభాసగా మారింది. ఇంధన సర్దుబాటు చార్జీలను ప్రభుత్వమే భరించాలని, వినియోగదారులపై భారం మోపే విధంగా అనుమతి ఇవ్వరాదని కోరుతూ వామపక్షాలు, బిజెపి, వైకాపాల నేతలు, కార్యకర్తలు బహిరంగ విచారణ హాల్‌లో బైఠాయించడంతో గందరగోళం నెలకొంది. ఇంధన సర్దుబాటు చార్జీలను ఉపసంహరించుకోవాలి అనే నినాదాలు మార్మోగాయి. ఈ ఏడాది రెండో త్రైమాసికానికి సంబంధించి 982 కోట్ల రూపాయల ఇంధన సర్దుబాటు చార్జీలపై ఏపిఇఆర్‌సి సోమవారం బహిరంగ విచారణ చేపడుతున్నట్లు గతంలోనే ప్రకటించింది. దీంతో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి బివి రాఘవులు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ కె నారాయణ, మాజీ ఎంపి మధు, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి జనక ప్రసాద్ ఆధ్వర్యంలో ఆయా పార్టీల కార్యకర్తలు తొలుత రెడ్‌హిల్స్‌లోని ఏపిఇఆర్‌సి కార్యాలయం వద్ద ధర్నా చేశారు. అయితే కార్యకర్తలు, పోలీసుల మధ్య తోపులాట జరగడంతో రాఘవులు, నారాయణ, జనక ప్రసాద్‌తోపాటు బిజెపి సీనియర్ నేత బండారు దత్తాత్రేయ ఆధ్వర్యంలో నేతలు బహిరంగ విచారణ హాల్‌లోకి ప్రవేశించి బైఠాయించారు. ఊహించని పరిణామాలు చోటుచేసుకోవడంతో మధ్యాహ్నం 2.30 గంటలకు బహిరంగ విచారణ ప్రారంభమవుతుందని ఏపిఇఆర్‌సి చైర్మన్ రఘోత్తమరావు ప్రకటించారు. దీంతో హాల్‌లో బైఠాయించిన నేతలను అదుపులోకి తీసుకున్న పోలీసులు తిరిగి విడుదల చేశారు. ఈ క్రమంలో మధ్యాహ్నం 2.30 గంటలకు బహిరంగ విచారణను రఘోత్తమరావు ప్రారంభించారు. కాగా, అంతకుముందు రాఘవులు, నారాయణ విలేఖర్లతో మాట్లాడుతూ సర్‌చార్జీల విషయంలో ఏపిఇఆర్‌సి స్వతంత్రంగా వ్యవహరించాలని, పేదవర్గాల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఈ చార్జీలను పెంచేందుకు అనుమతించరాదని డిమాండ్ చేశారు. సామాన్య ప్రజలు, పరిశ్రమలపై ఇప్పటికే 11వేల కోట్ల రూపాయల మేర ఇంధన సర్దుబాటు చార్జీలను వడ్డించారని, దీనివల్ల వారు బిల్లులు చెల్లించలేకపోతున్నారన్నారు. సర్దుబాటు చార్జీల వ్యయాన్ని ప్రభుత్వమే భరించాలని వారు డిమాండ్ చేశారు. లేదంటే ఈ చార్జీల పెంపుదలను డిస్కాంలు ఉపసంహరించుకోవాలన్నారు. విద్యుత్ సంక్షోభానికి ప్రభుత్వం అనుసరిస్తున్న అస్తవ్యస్త విధానాలే కారణమని, సర్‌చార్జీలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తామన్నారు. ఈ ఏడాది నాలుగున్నర వేల కోట్ల రూపాయల మేర విద్యుత్ చార్జీలను పెంచారన్నారు. సరైన విద్యుత్ విధానం లేనందువల్ల పరిశ్రమలు మూతపడుతున్నాయన్నారు. బహిరంగ విచారణకు హాజరైన టిఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీష్‌రావు మాట్లాడుతూ విద్యుత్ సంస్థలు ఇంధన సర్దుబాటు చార్జీల ప్రతిపాదనలను ఉపసంహరించుకోవాలన్నారు. ప్రజలు ఈ చార్జీలను భరించలేరన్నారు. ఈ చార్జీలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ తమ పార్టీ తెలంగాణలోని పది జిల్లాల్లో ఆందోళన చేపడుతుందని ప్రకటించారు. బిజెపి సీనియర్ నేత బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ సర్‌చార్జీల పెంపుప్రతిపాదనను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఇంతవరకు 10వేల కోట్ల రూపాయలకుపైగా సర్‌చార్జీలను పెంచారన్నారు. బహిరంగ విచారణలో మాట్లాడిన విద్యుత్ రంగ నిపుణులు రఘు సైతం సర్‌చార్జీల పెంపుప్రతిపాదనలు హేతుబద్ధంగా లేవన్నారు. ఇతర పరిశ్రమల యాజమాన్యాలు కూడా సర్‌చార్జీలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశాయి.
ఏపిఇఆర్‌సి బహిరంగ విచారణ హాలులో బైఠాయింపు వామపక్షాలతో పాటు బిజెపి, వైకాపా నేతల అరెస్టు, విడుదల
english title:
v
Date:
Tuesday, December 4, 2012