మహబూబ్‌నగర్, డిసెంబర్ 3: వైకాపా అధికారంలోకి వచ్చి జగనన్న ముఖ్యమంత్రి అయితే దేశంలో ఎక్కడాలేని విధంగా అమ్మ పేరిట బ్యాంకుల్లో ప్రత్యేక ఖాతాల పథకం ఏర్పాటు చేయడం జరుగుతుందని వైకాపా నాయకురాలు వైఎస్ షర్మిల వెల్లడించారు. సోమవారం మరో ప్రజాప్రస్థానంలో భాగంగా మహబూబ్‌నగర్ నియోజకవర్గంలోకి ఆమె అడుగుపెట్టారు. ఓబులాయపల్లిలో రచ్చబండ, కోడూరులో రోడ్‌షోను కార్యక్రమాన్ని నిర్వహించారు. ఓబులాయపల్లెలో జరిగిన రచ్చబండ కార్యక్రమంలో షర్మిల మాట్లాడుతూ ప్రతి పేద కుటుంబంలోని పిల్లలందరూ చదువుకోవాలనే ఉద్దేశ్యంతో రాజశేఖర్‌రెడ్డి పీజు రియంబర్స్‌మెంట్‌ను తీసుకువచ్చి పేదపిల్లలందరూ ఉన్నత చదువులు చదివించాలని తెలిపారు. అయితే రాష్ట్రంలో చదువులేని పిల్లలు ఉండకూడదని వైకాపా లక్ష్యమని, జగనన్న ఓ అద్భుతమైన ప్రణాళిక రచించాడని అన్నారు. తల్లిదండ్రులకు తమ పిల్లల చదువులు భారం కాకూడదని అమ్మ పేరిట ఖాతాలు అనే పథకం ప్రవేశపెట్టనున్నట్టు ఆమె వెల్లడించారు.
ఒకటో తరగతినుండి 10వ తరగతివరకు చదువుతున్న విద్యార్థులందరికీ 500 రూపాయలను అమ్మ పేరిట బ్యాంకు ఖాతాల్లో జమ చేయడం జరుగుతుందని తెలిపారు. ఇంటర్ విద్యార్థులకు రూ.700, డిగ్రీ చదువుతున్నవారికి 1000 రూపాయలను ప్రతినెలా బ్యాంకుల్లో పిల్లల తల్లిపేరిట జమ చేయడం జరుగుతుందని ఈ సందర్భంగా ఆమె తెలిపారు. ప్రస్తుత ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డికి రాష్ట్రంలో పిల్లల చదువులపై ఏ మాత్రం శ్రద్ధ లేదని ధ్వజమెత్తారు. ఫీజులు, స్కాలర్‌షిప్‌లు ఇవ్వడానికికూడా ఆయనకు మనసు ఒప్పండం లేదని ఆమె ఆరోపించారు. ధరలు ఆకాశాన్నంటాయని, పేదవారు, మధ్యతరగతి కుటుంబాలు ధరలతో ఇబ్బందులకు గురవుతున్నారని షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు.
ఏడుగంటలపాటు విద్యుత్‌ను వ్యవసాయ రంగానికి సరఫరా చేస్తున్నామని ముఖ్యమంత్రి, మంత్రులు, కాంగ్రెస్ నాయకులు గొప్పలు చెప్పుకుంటున్నారని గ్రామాలలోకి వచ్చి ముఖ్యమంత్రి కరెంటు గురించి రెండురోజులపాటు గడిపితే అసలు సంగతి తెలుస్తుందని, ఎసిలో కూర్చుని అంతా బాగుందని భావించే ముఖ్యమంత్రి ప్రజలను పాలించే నైతిక హక్కులేదని ఆమె మండిపడ్డారు. విద్యుత్ సంక్షోభానికి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డే కారణమని ఆరోపించారు. కరెంటు ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతోందో తెలియదనికానీ బిల్లులు మాత్రం 10వతేదీ దాటనివ్వరని సర్‌చార్జిలపేరిట ఇవ్వని కరెంటుకు బిల్లులు వసూలు చేయడం దుర్మార్గమైన చర్య అని షర్మిళ ధ్వజమెత్తారు. చంద్రబాబునాయుడు కాంగ్రెస్‌తో చీకటి ఒప్పందం చేసుకున్నారనీ, ఎక్కడ అవిశ్వాసం పెట్టాల్సి వస్తుందోనని తప్పించుకుని తిరుగుతూ ‘వస్తున్నా మీకోసం...’ అనే యాత్రతో పరారయ్యారని షర్మిళ ఎద్దేవా చేశారు. చంద్రబాబు నాయుడు ఎన్ని యాత్రలుచేసినా రాష్ట్ర ప్రజలు ఆయనను నాయకులుగానే గుర్తించడంలేదని ఆరోపించారు.
ఆమంచర్లలో అత్యవసరంగా
దిగిన నావీ హెలికాప్టర్
నెల్లూరు రూరల్, డిసెంబర్ 3: నెల్లూరు రూరల్ మండల పరిధిలోని ఆమంచర్ల గ్రామ సమీపంలో ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌కు సంబంధించిన హెలికాప్టర్ సోమవారం అత్యవసరంగా ల్యాండ్ అయ్యింది. విజయవాడ నుండి తిరుపతికి 10 మంది సిబ్బందితో వెళుతున్న సమయంలో వాతావరణం అనుకూలించకపోవడం, ఇంజన్‌లో తలెత్తిన సాంకేతిక లోపం వల్ల ఆమంచర్ల ప్రాంతంలో అత్యవసరంగా హెలికాప్టర్‌ను దించేశారు. ఈ సంఘటనలో అందులో ప్రయాణిస్తున్న 10 మంది సురక్షతంగా బయట పడ్డారు. హెలికాప్టర్ అక్కడ దిగిందని తెలుసుకున్న చుట్టు పక్కల గ్రామాల ప్రజలు తండోప తండాలుగా అక్కడికి చేరుకున్నారు. సమాచారం తెలుసుకున్న జిల్లా అదనపు ఎస్పీలు ఎల్‌టి చంద్రశేఖర్, ఏసి నాగేశ్వరరావు సంఘటనా స్థలానికి చేరుకొని అందులోని శిక్షకులను సురక్షితంగా నెల్లూరు వేరొక వాహనంలో తరలించారు. కాగా మొదట హెలికాప్టర్ ల్యాండ్ అవటంతో ఇఏదో విద్రోహ చర్యల్లో భాగంగా దిగారన్న పుకార్లు షికార్లు చేశాయి. పోలీసుశాఖ అప్రమత్తమయ్యే అలాంటి ఏదీలేదని, ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌కు సంబంధించిన హెలికాప్టర్ అని నిర్ధారించి మరమ్మతుల నిమిత్తం హెలికాప్టర్‌ను నగరంలోని పోలీస్ పేరేడ్ గ్రౌండ్స్‌కు తరలించారు. పైలెట్ అప్రమత్తత వల్ల అందరూ సురక్షితంగా బయటపడ్డారు.
భక్తులతో శ్రీశైలం కిటకిట
శ్రీశైలం, డిసెంబర్ 3: శ్రీశైల మహాక్షేత్రం కార్తీక సోమవారం సందర్భంగా భక్త జనసందోహంతో కిటకిటలాడింది. మల్లన్న దర్శనానికి భక్తులు క్యూలైన్లలో 6 గంటలకు పైగా వేచి ఉండాల్సి వచ్చింది. మూడవ సోమవారం అనూహ్యంగా భక్తులు భారీగా తరలివచ్చారు. సుమారు లక్ష మందికిపైగా భక్తులు స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నారు. సోమవారం 600 సామూహిక అభిషేకాలు నిర్వహించారు. సామూహిక అభిషేకం చేయించిన భక్తులు స్వామి అమ్మవార్ల దర్శనం కోసం సుమారు 2 గంటలకుపైగా వేచి ఉండాల్సి వచ్చింది. వేకువజామునే కృష్ణానదిలో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు స్వామి దర్శనార్థం క్యూ లైన్లలో వేచిఉన్నారు. దీంతో క్యూలైన్లన్నీ భక్తులతో కిటకిటలాడాయి. భక్తులు భారీగా తరలిరావడంతో అధికారులు ఆలయ వేళల్లో మార్పులు చేశారు.
మల్లన్న సన్నిధిలో డిజిపి దినేష్‌రెడ్డి
శ్రీశైలం, డిసెంబర్ 3: రాష్ట్ర డిజిపి దినేష్‌రెడ్డి కుటుంబ సమేతంగా సోమవారం శ్రీశైల భ్రమరాంబిక, మల్లికార్జున స్వామివార్లను దర్శించుకున్నారు. కార్తీక సోమవారం సందర్భంగా మల్లన్న దర్శనార్థం వచ్చిన డిజిపికి అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. మల్లికార్జునస్వామి, భ్రమరాంబ అమ్మవారికి డిజిపి దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.